అటార్నీ, సొలిసిటర్ జనరళ్ల రాజీనామా
** నూతన ఏజీ, ఎస్జీలుగా హరీశ్ సాల్వే, ముకుల్ రోహ్తగీ?
న్యూఢిల్లీ: కేంద్రంలో నూతన సర్కారు కొలువుదీరిన నేపథ్యంలో అటార్నీ జనరల్ గులామ్ ఎస్సాజీ వాహనవతి, సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌లు రాజీనామా సమర్పించారు. కోర్టులలో ప్రభుత్వానికి ప్రతినిధులుగా వ్యవహరిస్తూ, క్లిష్టమైన అంశాలపై న్యాయ సలహాలు ఇచ్చేందుకుగాను ఏజీ, ఎస్జీలను ప్రభుత్వం నియమించుకుంటుంది కాబట్టి.. ప్రభుత్వాలు మారినప్పుడు ఆ పదవుల్లో ఉన్నవారు రాజీనామా చేయడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ నేపథ్యంలో వీరిద్దరి రాజీనామా ప్రక్రియ పూర్తి అయిందని, నూతన ప్రభుత్వం కొత్త ఏజీ, ఎస్జీలను నియమించుకుంటుందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. కొత్త ఏజీ, ఎస్‌జీల నియామకం గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినా.. అటార్నీ జనరల్‌గా సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహ్తగీలు, నూతన ఎస్జీగా రంజిత్ కుమార్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
యూపీఏ-1లో ఐదేళ్లపాటు ఎస్జీగా వాహనవతి పనిచేశారు. ఏజీగా నియమితులైన తొలి ముస్లిం కూడా వాహనవతియే కావడం గమనార్హం. అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యావాది అయిన మోహన్ పరాశరన్‌ను యూపీఏ సర్కారు 2004లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా, గతేడాది ఫిబ్రవరిలో ఎస్జీగా నియమించుకుంది.