Gopinath Munde dies
-
పర్లీ నుంచి హస్తిన వరకూ.....
-
పర్లీ నుంచి హస్తిన వరకూ.....
న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందిన గోపీనాథ్ ముండే మధ్య తరగతి కుటుంబం నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. బీజేపీలో కీలక నేతగానే కాకుండా, మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 1949 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని పర్లీలో జన్మించిన ఆయన 1980లో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. గిరిజన నాయకుడైన గోపీనాథ్ ముండే.. ఇటీవలి ఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల మెజారిటీతో బీద్ లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. 1980-85, 1990-2009 మధ్య ఎమ్మెల్యేగా ముండే సేవలు అందించారు. 1995- 1999 మధ్య మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. లోక్‌సభలో బీజేపీ ఉపనేతగా ముండే వ్యవహరించారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ముండే ఇటీవలే కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ సోదరిని ముండే వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ముంబైలో విజయోత్సవ ర్యాలీకి వెళుతూ ముండే మృత్యువాత పడటంతో బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. -
'ముండే కారులోంచి కిందకు పడిపోయారు'
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే ప్రమాదం జరిగినప్పుడు కారు వెనుక సీట్లో కూర్చున్నారని బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ తెలిపారు. ప్రమాదంపై ఆయన తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే గడ్కరీ, మరో మంత్రి హర్షవర్థన్ హుటాహుటీన ఎయిమ్స్‌కు తరలి వెళ్లారు. ముండే మృతిపై గడ్కరీ మాట్లాడుతూ ఈరోజు ఉదయం 6.30గంటలకు ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో కారులోంచి ఆయన కిందకు పడిపోయారని తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు ఆయనతో పాటు సహాయకుడు, డ్రైవర్ ఉన్నట్లు తెలిపారు. ముండేను రక్షించేందుకు వైద్యులు తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు గడ్కరీ చెప్పారు. ఉదయం ఎనిమిది గంటలకు ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారన్నారు. ముండే మరణవార్తను ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సమాచారం ఇచ్చినట్లు గడ్కరీ తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ముండే భౌతికకాయాన్ని ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు పార్టీ కార్యాలయానికి తరలించనున్నట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. బుధవారం ప్రభుత్వ లాంఛనాలతో ముండే స్వగ్రామంలో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ముంబయిలోని బీజేపీ విజయోత్సవ ర్యాలీలో పాల్గొనేందుకు వెళుతూ ముండే రోడ్డుప్రమాదంలో మృత్యువాత పడ్డారు. -
కేంద్రమంత్రి గోపీనాథ్ ముండే మృతి