పర్లీ నుంచి హస్తిన వరకూ.....
న్యూఢిల్లీ : రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మృతి చెందిన గోపీనాథ్ ముండే మధ్య తరగతి కుటుంబం నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. బీజేపీలో కీలక నేతగానే కాకుండా, మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 1949 డిసెంబర్ 12న మహారాష్ట్రలోని పర్లీలో జన్మించిన ఆయన 1980లో రాజకీయాల్లోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగారు. గిరిజన నాయకుడైన గోపీనాథ్ ముండే.. ఇటీవలి ఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల మెజారిటీతో బీద్ లోక్ సభ స్థానం నుంచి గెలిచారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు.
1980-85, 1990-2009 మధ్య ఎమ్మెల్యేగా ముండే సేవలు అందించారు. 1995- 1999 మధ్య మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా పనిచేశారు. లోక్సభలో బీజేపీ ఉపనేతగా ముండే వ్యవహరించారు. లోక్ సభ ఎన్నికల్లో గెలిచిన ముండే ఇటీవలే కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దివంగత బీజేపీ నేత ప్రమోద్ మహాజన్ సోదరిని ముండే వివాహం చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. ముంబైలో విజయోత్సవ ర్యాలీకి వెళుతూ ముండే మృత్యువాత పడటంతో బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది.