ఇది నిజమైన హీరో కథ
ముంబై: ఆయన నిజమైన హీరో. భారత దేశ స్వాతంత్య్రం కోసం దాదాపు ఐదేళ్లపాటు పోరాటం చేశారు. జైలుకు కూడా వెళ్లారు. పిన్న వయసులోనే పెద్ద పని చేశావంటూ సాక్షాత్తు జాతిపిత మహాత్మా గాంధీ నుంచి ప్రశంసలు కూడా అందుకున్నారు. ఆ తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడిగా సర్టిఫికేట్ సాధించేందుకు భారత బ్యూరోక్రసీపై ఏకంగా 32 ఏళ్లపాటు సుదీర్ఘ పోరాటం చేశారు. ఈ రెండో పోరాటంలో భాగంగా 321 ఆఫీసుల తలుపులు తట్టారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు 1043 లేఖలు రాశారు. 66000 మెట్లు ఎక్కారు.
ఆయనే గౌర్ హరి దాస్. మహారాష్ట్ర సరిహద్దులోవున్న ఒడిశాలోని జాడ్పీపల్ గ్రామంలో పుట్టి పెరిగిన హరిదాస్ తన తండ్రి (సీనియర్ హరి దాస్. ఆయన కూడా స్వాతంత్య్ర సమర యోధుడే) నుంచి స్ఫూర్తి పొంది 14వ ఏటనే స్వాతంత్య్ర సంగ్రామంలో అడుగు పెట్టాడు. తోటి వారితో కలసి ‘వానర సేన’ను ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమానికి సంబంధించిన సాహిత్యాన్ని ప్రచురించడం, వాటిని రహస్యంగా ప్రజలకు అందజేయడం వానర సేన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని హరిదాస్ చిత్తశుద్ధిగా చేశారు. 1945, జనవరి 26వ తేదీన బ్రిటీషర్స్ ఆజ్ఞలను ధిక్కరించి ఓ వీధి కూడలిలో భారత జెండాను ఎగరవేసినందుకు అరెస్టయ్యారు. బాలాసోర్ జైల్లో రెండు నెలల పాటు శిక్ష అనుభవించారు. విడుదలైన అనంతరం కూడా దేశ స్వాతంత్య్ర కోసం పోరాటం కొనసాగించారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక తండ్రి, అన్నాదమ్ములు, అక్కా చెళ్లెల్లతో కలసి ముంబాయికి మారారు. దేశం తొలి ఎన్నికల ప్రచారంలో కూడా హరిదాస్ చురుగ్గా పాల్గొన్నారు. అప్పుడు తనకు సహకరించిన లక్ష్మీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. 1975లో భారత ప్రభుత్వం తొలిసారి స్వాతంత్య్ర సమరయోధుల కోసం పెన్షన్ పథకాన్ని తీసుకొచ్చింది. అందుకు అందరిని సర్టిఫికేట్లు తీసుకోమంది. అప్పటికే ముంబైలోని ‘ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ)లో పనిచేస్తున్నందున హరి దాస్ తనకు సర్టిఫికెట్ అనవసరమని ఊరుకున్నారు.
1976లో తన పెద్ద కుమారుడిని రాష్ట్రంలోని 'వీర్ మాతా జీజాభాయ్ టెక్నాలోజికల్ ఇనిస్టిట్యూట్' ఇంజనీరింగ్ కోర్సులో చేర్చేందుకు తీసుకెళ్లారు. మార్కులు తక్కువున్నందున సీటు రాకపోవచ్చని, స్వాతంత్య్ర యోధుల పిల్లలకు కొంత రిజర్వేషన్ ఉందని, స్వాతంత్య్ర యోధుడిగా సర్టిఫికేట్ తీసుకురమ్మని కాలేజీ యాజమాన్యం సూచించింది. దాంతో హరి దాస్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ముంబై మున్సిపాలిటీ, రాష్ట్ర సచివాలయం మధ్య కాళ్లు అరిగేలా తిరిగుతూ వచ్చారు.
ఇరుగుపొరుగు వాళ్లు పిచ్చోడని ముద్ర వేశారు. పిచ్చా, వెర్రా? అంటూ తోటి వారూ గేలి చేశారు. అయినా ఆయన పట్టించుకోలేదు. ఒక్క భార్య లక్ష్మీ మాత్రమే ఆయన ఆవేదనను అర్థం చేసుకొని అండగా నిలిచింది. దేశ స్వాతంత్య్రం కోసం కూడా తాను ఎన్నడూ ఇంత కష్టపడలేదని, భారత బ్యూరోక్రసిపై పోరాటం చేయడమే కష్టంగా ఉందని ఆయన భావించిన రోజులున్నాయి. తండ్రిని నమ్ముకుంటే తన చదువుకాస్త గంగలో కలుస్తుందని భావించిన ఆయన కుమారుడు ఈలోగా కష్టపడి చదవి మెరిట్ ద్వారానే సీటు సంపాదించి ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశారు.
అయినా సరే! తన పోరాటాన్ని హరి దాస్ ఆపలేదు. చివరకు తన అకుంఠిత పోరాటం వల్లనైతేమీ, తనకు సహకరించిన ఎన్జీవో సంస్థల తోడ్పాటు వల్లనైతేమీ 2008, చివరలో స్వాతంత్య్ర సమర యోధుడిగా సర్టిఫికేట్ సాధించారు. అయినా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. తనకు కావాల్సిందీ గుర్తింపు సర్టిఫికెట్‌గానీ పెన్షన్ కాదన్నారు. ఇప్పుడు ఆ హరి దాస్‌కు 84 ఏళ్లు. అల్జీమర్స్ తొలిదశ వల్ల జ్ఞాపక శక్తి, వినికిడి తగ్గింది. అయినా ఆయన తన పోరాటానికి సంబంధించిన ప్రతి కాగితాన్ని భద్రంగా దాచుకున్నారు. ఏ రోజు ఏ ఆఫీసుకు వెళ్లింది, అక్కడ ఎన్ని మెట్లు ఎక్కిందో కూడా కాగితాల్లో రాసుకున్నారు.
సమాజానికి స్ఫూర్తినిచ్చే ఆయన పోరాటం గురించి ఎన్జీవో మిత్రులు, పత్రికల ద్వారా తెలసుకున్న ప్రముఖ థియోటర్ ఆర్టిస్ట్, ప్రముఖ బాలివుడ్ దర్శకుడు అనంత్ మహదేవన్ ఆయన బయోపిక్‌ను చిత్రంగా తీయాలని ఆయన్ని సంప్రదించారు. తనపై చిత్రమేమిటని ముందుగా భావించిన హరిదాస్, ఆ తర్వాత దర్శకుడి చిత్తానికే వదిలేశారు. తొలిరోజుల్లో బాలివుడ్లో కమర్షియల్స్ సినిమాలు తీసిన మహదేవన్, ఆ తర్వాత ఆ తరహా చిత్రాలను వదిలేసి అర్థవంతమైన చిత్రాలను తీయడం ప్రారంభించారు. ఆయన గతేడాది తీసిన 'స్టేయింగ్ అవే' చిత్రం ప్రశంసలు అందుకుంది.
ప్రముఖ సామాజిక కార్యకర్త 'సింధుతాయి సప్కల్'పై తీసిన ఆయన బయోపిక్ చిత్రమైతే నాలుగు జాతీయ అవార్డులు అందుకుంది. ఇప్పుడు ఆయన హరి దాస్‌పై తీసిన మరో బయోపిక్ చిత్రం 'గౌర్ హరి దస్తాన్-ది ఫ్రీడమ్ ఫైల్' పేరిట శుక్రవారం దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. ఇందులో హరి దాస్‌గా వినయ్ పాఠక్, ఆయన భార్య లక్ష్మీగా కొంకణా సేన్ నటించారు. హరి దాస్ దస్తావేజులను ఆమూలాగ్రంగా చదవిన జర్నలిస్ట్, కవి సీపీ సురేంద్రన్ దీనికి స్క్రీన్ ప్లే రాశారు.