ఒంటి కాలిపై నిల్చొని రెండో ఏఎన్ఎంల నిరసన
మంచిర్యాల టౌన్ : తమను రెగ్యులరైజ్ చేయాలని, డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న రెండో ఏఎన్ఎంలు బుధవారం పట్టణంలోని ఐబీ చౌరస్తాలో గత పది రోజులుగా చేస్తున్న సమ్మె శిబిరంలో ఒంటి కాలిపై నిల్చొని వినూత్న నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెగ్యులర్ ఏఎన్ఎంలతో సమానంగా పనిచేస్తున్న, తమకు కనీస వేతనం కూడా ఇవ్వడం లేదని,. కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, పదో పీఆర్సీ ప్రకారం కనీస వేతనం రూ. 21,500లు ఇస్తూ, డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర అలవెన్సులు ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లే తమకు 35 రోజుల క్యాజువల్ లీవ్‌లు, 180 రోజుల వేతనంతో కూడిన మెటర్నిటీ లీవులు ఇవ్వాలని, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, విధుల్లో ఉండి మతి చెందిన వారికి రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఐ. సుజాత, జిల్లా కార్యదర్శి బి. పద్మ, డివిజనల్ అధ్యక్షురాలు ఎన్. మంజుల, సభ్యులు తిరుమల, నలిత, విజయ, రాజేశ్వరీ, విమల, భవాని, సత్యవతి పాల్గొన్నారు.