‘పచ్చ’పాపం.. విద్యార్థినుల శోకం
ఐదేళ్ల టీడీపీ పాలనలో విద్యారంగం కుదేలైంది. కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రూ.20 లక్షలు వెచ్చిస్తే 100 మందికి పైగా వసతి కల్పించవచ్చని అధ్యాపకులు వేడుకున్నా.. ఐదేళ్ల కాలంలో ఐదు పైసలు కూడా విడుదల చేయని పరిస్థితి. ప్రచారం పేరుతో రూ.కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు.. విద్యారంగంపై వివక్ష చూపారు. అప్పటికే కొనసాగుతున్న పనులకు కూడా నిధులు మంజూరు చేయకుండా నిలిపేశారు. ఫలితంగా రాయలసీమలోనే పేరుగాంచిన కేఎస్ఎన్ కళాశాలలో వసతి గృహాల నిర్మాణాలు పూర్తి కాక విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ నిర్లక్ష్యానికి ఇప్పుడు రూ.1.20 కోట్ల మూల్యం చెల్లించుకోవాల్సి రావడం గమనార్హం.
అనంతపురం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కేఎస్ఎన్ మహిళా డిగ్రీ కళాశాల రాయలసీమలోనే పేరుగాంచింది. అందువల్లే ఇక్కడ చదువుకునేందుకు అనంతపురంతో పాటు వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాల విద్యార్థినులు కూడా ఉత్సాహం చూపుతారు. ఇతర జిల్లాల నుంచి వచ్చే విద్యార్థినులతో పాటు అనంతపురం జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులకు వసతి తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలోనే 2012లో అప్పటి ముఖ్యమంత్రి హాస్టల్ భవనానికి రూ.కోటి నిధులు కేటాయించారు. 19 గదులు(టాయిలెట్, బాత్రూం ఆటాచ్డ్), డైనింగ్‌హాల్, లైబ్రరీ గది నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. రూ.కోటి ఖర్చు చేసినా అన్నీ శ్లాబ్ స్థాయి వరకు పనులు జరిగాయి. అక్కడితో నిధులు అయిపోవడంతో పనులు నిలిపేశారు. 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి కళాశాల యాజమాన్యం పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి వసతి గృహం సమస్యను తీసుకెళ్లినా లాభం లేకపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్న ఐదేళ్లలో ఈ నిర్మాణాలకు రూపాయి కూడా విడుదల చేయలేదు.
‘రూసా’ నిధులతో 12 గదుల నిర్మాణాల పూర్తి..
హాస్టల్ గదుల కొరత, నిర్మాణాలు అర్ధంతరంగా నిలిచిపోవడంతో ‘కేఎస్ఎన్’ యాజమాన్యం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఈక్రమంలో 2017లో రాష్ట్రీయ ఉచ్చతర్ శిక్ష అభియాన్ (రూసా) నిధులు రావడంతో రూ. 35 లక్షలు ఖర్చు చేసి పెండింగ్‌లో ఉన్న 12 గదుల నిర్మాణాలను పూర్తి చేసింది. ఈ గదులు అందుబాటులోకి రావడంతో విద్యార్థినులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. తక్కిన ఏడు గదులు, డైనింగ్‌హాల్, లైబ్రరీ నిర్మాణాలు ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయి. టీడీపీ హయాంలో రూ.20 లక్షలు ఖర్చు చేసి ఉంటే ఆ పనులన్నీ అప్పుడే పూర్తయ్యేవి. కానీ వారు నిధులు మంజూరు చేయకపోవడంతో ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలంటే రూ.1.20 కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
160 మందికి మాత్రమే వసతి..
కళాశాల హాస్టల్లో ప్రస్తుతం 450 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో మొదటి సంవత్సరం విద్యార్థినులు 320 మంది హాస్టల్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. భవనాలు అందుబాటులో లేకపోవడంతో అధ్యాపకులు 160 మందికి మాత్రమే అవకాశం ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న ఏడు గదులు పూర్తయితే మరో 100 మందికి పైగా వసతి భాగ్యం దక్కేది. వసతి సదుపాయం లేని కారణంగా చాలామంది విద్యార్థినులు వెనక్కు వెళ్లిపోతున్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతిభగల విద్యార్థులు కూడా వసతిలేని కారణంగానే ఉన్నత చదువులకు ఫుల్స్టాప్ పెట్టేస్తున్నారు.
రూ.90 లక్షలతో అంచనాలు..
పెండింగ్‌లో ఉన్న ఏడు గదుల నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు రూ.40 లక్షలు, అలాగే డైనింగ్ హాల్, లైబ్రరీ గది పూర్తి చేసేందుకు మరో రూ.50 లక్షలు అవసరమని ఏపీఈడబ్ల్యూఐడీసీ అధికారులు తాజాగా అంచనాలు రూపొందించారు. వాస్తవానికి ఈ పనులు పెండింగ్‌లో ఉంచకుండా అప్పుడే పూర్తి చేసి ఉంటే రూ.25 లక్షల్లోపు పూర్తయ్యేవి. నాడు పట్టించుకోని కారణంగా ప్రస్తుతం దాని వ్యయం రూ.1.25 కోట్లకు చేరింది. ఇప్పటికైనా నిధులు కేటాయించి పెండింగ్ నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని విద్యార్థినులు కోరుతున్నారు.
వసతికి ఇబ్బందిగా ఉంది
హాస్టల్ భవన నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. ఏడు గదులు, డైనింగ్ హాల్, లైబ్రరీ గది పూర్తయితే చాలా ఉపయోగంగా ఉంటుంది. మరో వందమందికి వసతి కల్పించవచ్చు. ఆరేళ్ల కిందట రూ. కోటితో నిర్మాణాలు చేపట్టినా అవి పూర్తి కాలేదు. ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేసి అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలను పూర్తి చేసేలా చూడాలి.
– శంకరయ్య, ప్రిన్సిపల్