మరో 6 ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతులు
కొత్తగా 5 కాలేజీలకు ఫీజు ఖరారు
సాక్షి, హైదరాబాద్: మరో ఆరు ఇంజనీరింగ్ కాలేజీలకు జేఎన్టీయూహెచ్ అనుబంధ గుర్తింపు మంజూరు చేసింది. కాలేజీల్లో లోపాలు సరిదిద్దుకున్నట్లు తేలడంతో వాటిలో ప్రవేశాలకు ఓకే చెప్పినట్లు అధికారులు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లాలోని కేఎన్ఆర్ఆర్, మల్లారెడ్డి, మల్లారెడ్డి(మహిళ), ఎన్ఆర్ఐ కాలేజీలు, నల్లగొండ జిల్లా కోదాడలోని గాంధీ అకాడమీ, శ్రీసాయి కాలేజీలకు అనుబంధ గుర్తింపు మంజూరు చేశారు. వాటిని కౌన్సెలింగ్లో చేర్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఇక వీఎన్ఆర్ విజ్ఞాన్జ్యోతి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) కోర్సులకు అనుబంధ గుర్తింపు లభించలేదు. దీనిపై కాలేజీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
ఫీజుల ఖరారు వీటికే..
కొత్తగా 5 కాలేజీలకు ప్రభుత్వం వార్షిక ఫీజులు ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య గురువారం జీవో 23 జారీ చేశారు. జోగినపల్లి బీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు రూ.75 వేలుగా, శ్రీబాలాజీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఫీజు రూ.36 వేలుగా, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ ఎడ్యుకేషన్ సొసైటీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్కు రూ.50 వేలుగా, ధన్వంతరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ ఫీజు రూ.43 వేలుగా, ట్రినిటి కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్ కాలేజీ ఫీజు రూ.40 వేలుగా ఖరారు చేశారు.