అధికారుల కనుసన్నల్లోనే!
♦ రాయకూర్ కెనాల్ వద్ద ఇసుక డంప్‌లు
♦ ప్రభుత్వ అనుమతుల పేరుతో పక్కదారి..
♦ ఒక్కో ఇసుక ట్రాక్టర్‌కు రూ. 2,300
♦ అత్యవసరం అయితే రూ. 2,500
♦ చోద్యం చూస్తున్న రెవెన్యూ సిబ్బంది
కోటగిరి : ఇసుక అనుమతుల విషయంలో సామాన్యులకు చుక్కలు చూపే అధికారులు.. యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా అవుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. కళ్లముందే సాక్ష్యాలున్నా.. చర్యలకు ముందుకు రావడం లేదు.
సులేమాన్‌ఫారం సమీపంలోని నిజాంసాగర్ కెనాల్ కట్ట వద్ద కొందరు ఇసుక వ్యాపారులు ఇసుకను డంప్ చేస్తున్నారు. దీనిని రాత్రి వేళల్లో అక్రమంగా తరలిస్తున్నారు. ఇసుకతో పాటు ఇటుక బట్టీల నుంచి తరలించిన ఇటుకలనూ ఇక్కడ డంప్ చేసి తర్వాత తీసుకెళ్తున్నారు.
ప్రభుత్వ పనులకుగాను మండలంలోని పోతంగల్ లేదా కొడిచర్ల మంజీర నది నుంచి ఇసుక రవాణాకు రెవెన్యూ అధికారులు వారంలో ఓ రోజు అనుమతి ఇస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని కొందరు ఇసుక వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారికి కొన్ని ప్రాంతాల్లో వీఆర్వోలు సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ అనుమతుల పేరుతో కొందరు వేబిల్లులు పొంది ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
రెవెన్యూ అధికారుల అనుమతితో లబ్ధిదారుడు మంజీర నదినుంచి ఒక ట్రాక్టర్ ఇసుకను తరలించాలంటే సుమారు వెయ్యి రూపాయలు ఖర్చవుతాయి. అదే ఒక ఇసుక ట్రాక్టర్‌ను ఇసుక వ్యాపారి రూ. 1,900 నుంచి 2,300 వరకు విక్రయిస్తున్నారు. వినియోగదారుల అవసరాన్ని బట్టి ట్రాక్టర్ ఇసుకకు రూ. 2,500 లు కూడా వసూలు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణానికి రెవెన్యూ అధికారుల అనుమతి లభించడం కష్టమైనవారు వ్యాపారులనుంచి ఇసుకను కొనుగోలు చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
ప్రభుత్వ స్థలాల్లో ఇసుక డంప్‌లు కానీ ఇటుక డంప్‌లు కానీ ఏర్పాటు చేయడం నేరం. అలా ఎవరైనా చేస్తే చర్యలు తీసుకుంటాం. అనుమతులు తీసుకోకుండా ఇసుక రవాణా చేస్తే క్రిమినల్ కేసులు పెడుతాం. ఎవరినీ ఉపేక్షించం. ఇసుక వ్యాపారులకు వీఆర్వోలు సహకరిస్తే వారిపైనా చర్యలు తీసుకుంటాం. - రాజేశ్వర్, తహసీల్దార్