ఇంటర్ విద్యార్ధినిపై వాచ్మెన్ అత్యాచారం
ఏలూరు: రాష్ట్రంలో అత్యాచారాల ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కామాంధుల కబంధహస్తాలలో ఆడపిల్లలు చిక్కుకుంటున్నారు. కీచకుల ఆకృత్యాలకు అంతులేకుండా పోతోంది. ఒకవైపు అత్యాచారాలకు పాల్పడితే కఠిన శిక్షలు అమలు చేస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఈ అత్యాచార ఘటనలు ఆగడం లేదు. తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కామాంధుల ఆకృత్యాలకు ఆడపిల్లలు బలైపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం వెలుగుచూస్తూనే ఉన్నాయి.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు ప్రభుత్వ బాలికల హస్టల్లో ఉంటున్న ఇంటర్ విద్యార్థినిపై వాచ్మెన్ అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత కొన్నినెలలుగా విద్యార్థినిని బలవంతంగా లోబర్చుకుని వాచ్మెన్ అత్యాచారం చేస్తున్నాడు. వాచ్మెన్ ఆకృత్యానికి ఆమె గర్భం దాల్చింది. విద్యార్ధిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాచ్మెన్ బండారం బయటపడింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు వాచ్మెన్పై మోసం, అత్యాచారాల కింద కేసు నమోదు చేశారు. కాగా, పరారీలో ఉన్న నిందితుడు వాచ్మెన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.