ప్రభుత్వ స్థలాల్లో నర్సరీలు
మోర్తాడ్ :తెలంగాణ హరిత హారంలో భాగంగా విస్తారంగా మొక్కలను పెంచడం కోసం అవసరం అయిన ఏర్పాట్లను ఉపాధి హామీ పథకం, సామాజిక అటవీశాఖ అధికారులు చేస్తున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలోని ఖాళీ స్థలాలను ఎంపిక చేసి అక్కడ నర్సరీలను ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం యోచిస్తోంది. నర్సరీల నిర్వహణ బాధ్యతను ఉపాధి హామీ పథకం, సామాజిక అటవీ శాఖలకు అప్పగించారు.
గ్రామాల్లో మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలనే ప్రధాన ఉద్దేశంతో ప్రభుత్వం తెలంగాణ హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టింది. నియోజకవర్గానికి 40 లక్షల మొక్కలను, జిల్లా వ్యాప్తంగా 3.60 కోట్ల మొక్కలను రానున్న మూడేళ్లలో నాటాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. కాగా తెలంగాణ హరిత హారం పథకాన్ని అమలు చేయడానికి ఇప్పుడు నిర్వహిస్తున్న నర్సరీల సంఖ్య సరిపోదని అధికారులు నిర్ధారణకు వచ్చారు.
కొత్త నర్సరీలను ఏర్పాటు చేసి మొక్కలను ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు. భారీగా మొక్కలను నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడంతో అందుకు అనుగుణంగా మొక్కలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి మండల కేంద్రంలో, మేజర్ పంచాయతీలో నర్సరీలను నిర్వహించడం కోసం అనువైన స్థలాలను గుర్తిస్తున్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రి, జూనియర్, డిగ్రీ కళాశాలల స్థలాలు, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, నీటిపారుదల శాఖ అతిథి గృహాలు ఇతర ప్రభుత్వ స్థలాల్లో మొక్కలను పెంచడానికి నర్సరీలను నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ పథకానికి సామాజిక అటవీ శాఖ 75 శాతం మొక్కలను సరఫరా చేయాల్సి ఉంది. ఉపాధి హామీ పథకం కింద మరో 25 శాతం మొక్కలను సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రెండు శాఖలు నిర్వహిస్తున్న నర్సరీలకు అనుబంధంగానే కొత్త నర్సరీలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి మండలానికి పది నుంచి 15 నర్సరీలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.