government servants
-
106 మంది ఉద్యోగులపై వేటు
సిద్దిపేట రూరల్: లోక్‌సభ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ బీఆర్ఎస్ నిర్వహించిన సమావేశంలో పాల్గొ న్న 106 మంది ప్రభుత్వ ఉద్యోగు లపై వేటు పడింది. మంగళవారం సిద్దిపేట జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మిక్కిలినేని మను చౌదరి వారిపై సస్పెన్షన్ విధిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆదివారం రాత్రి సమయంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి ఎన్నికల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవనంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ 106 మంది సెర్ప్, ఉపాధి హామీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ విష యం తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్‌కు, కలెక్ట ర్కు ఫిర్యాదు చేశారు. ఫంక్షన్ హాల్లోని సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా సమావేశంలో పాల్గొన్న 106 మందిని గుర్తించారు. ఈ నివేదికను ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్చార్జి.. కలెక్టర్‌కు అందజేశారు. ఇందులో సెర్ప్ ఉద్యో గులు 38 మంది, ఈజీఎస్ అధికారులు 68 మందిపై శాఖా పరమైన చర్యల్లో భాగంగా సస్పెన్షన్ వేటు వేశారు. సోమవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, స్థానిక నాయకులపై కేసు నమోదు కావడం తెలిసిందే. -
గ్రామ, వార్డు సచివాలయాల్లో కారుణ్య నియామకాలు
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారితో మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లో కొందరికి ఇప్పటికే కారుణ్య నియామకాలు కల్పించగా ఇంకా మిగిలిపోయిన కుటుంబాల్లో ఒకరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో ఇలా మృతిచెందిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల్లోని వారికి ఇప్పటివరకు 1,488 మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. మిగిలిన 1,149 మంది దరఖాస్తుదారులకూ ఇప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు కల్పించేందుకు ఉత్తర్వులు జారీచేశారు. వీటిల్లో మొత్తం 13,026 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిల్లో ఆ 1,149 దరఖాస్తుదారుల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకాల కింద ప్రభుత్వోద్యోగాలు ఇవ్వాల్సిందిగా సీఎస్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయంలో విద్యార్హతలు, రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లను పాటించాలని సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఖాళీగా ఉన్న పోస్టులివే.. గ్రామ, వార్డు సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, సంక్షేమ విద్యా అసిస్టెంట్, గ్రామ వ్యవసాయ అసిస్టెంట్, గ్రామ, వార్డు రెవెన్యూ కార్యదర్శి, గ్రామ సర్వేయర్, వార్డు పరిపాలన కార్యదర్శి, వార్డు విద్యా కార్యదర్శి, వార్డు సంక్షేమ కార్యదర్శి, ఇంజనీరింగ్ అసిస్టెంట్, తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్‌రెడ్డి ఆదేశించారు. పోస్టుల భర్తీకి టైమ్‌లైన్.. ఇక ఈ కారుణ్య నియామకాల భర్తీకి ప్రభుత్వం టైమ్‌లైన్‌ను కూడా నిర్దేశించింది. దరఖాస్తుల పరిశీలన ఆగస్టులోగా పూర్తిచేయాలి.. అర్హులైన వారికి నియామక పత్రాలను ఆగస్టు 24లోగా జారీచేయాలి. సమ్మతి నివేదికను సెప్టెంబర్ 30లోగా ప్రభుత్వానికి సమర్పించాలి. మృతిచెందిన ఉద్యోగికి మైనర్ పిల్లలు ఉంటే వయస్సు, విద్యార్హతల ఆధారంగా జీవిత భాగస్వామికి ఉద్యోగం ఇవ్వడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఉద్యోగ నియామక పత్రం జారీచేసిన 30 రోజుల్లోగా ఉద్యోగంలో చేరాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఆయా పోస్టులను విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు ఆధారంగా భర్తీచేయాలి. -
రూ.2 కోట్ల భారీ నష్టపరిహారం
న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబానికి రూ.2 కోట్లకు పైగా నష్టపరిహారం ఇవ్వాలని నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీకి ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. మనీష్ గౌతమ్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఢిల్లీలోని రోహిణి మార్గ్‌లో 2019 మే 31న రోడ్డు పక్కన నడుస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీ కొంది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలైన గౌతమ్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఆ మర్నాడు జూన్ 1న మరణించారు. అయితే బాధితుడు నిర్లక్ష్యంగా ఉండడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, అందుకే నష్టపరిహారం ఇవ్వాల్సిన పని లేదని ఇన్సూరెన్స్ కంపెనీ చేసిన వాదనలను ట్రిబ్యునల్ న్యాయమూర్తి తోసిపుచ్చారు. గౌతమ్ కుటుంబ సభ్యులకు 2 కోట్ల 50 వేల రూపాయలు చెల్లించాల్సిందేనని ఆదేశించారు. -
'ఉద్యోగులను కొట్టడం పెద్ద నేరమేమీకాదు'
పణజి: ఎమ్మార్వో వనజాక్షిపై దాడి ఘటనలో ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అందరికీ గుర్తే! అసలు దోషుల్ని వదిలేసి తప్పంతా సదరు అధికారిదేనని మంత్రులు తీర్మానించగా, సీఎం కూడా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినవచ్చాయి. ఏపీని ఆదర్శంగా తీసుకుందో ఏమోగానీ.. ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం, వారిపై దాడులకు దిగడం లాంటివి పెద్ద నేరమేమీకాదని గోవా ప్రభుత్వం తీర్మానించింది. ఇక్కడి లాగే అక్కడ కూడా ఓ 'అవినీతి' ఎమ్మెల్యేను కాపాడుకోవడానికే ఈ తతంగమంతా నడిచింది. తమ చర్యను సమర్థించుకుంటూ గోవా ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌడా ఇలా అన్నారు.. 'ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు పెద్ద నేరమేమీకాదు. ప్రస్తుతం మనం సంస్కరణల యుగంలో ఉన్నాం. హింస కంటే సంస్కరణ ద్వారానే ప్రజల ఆలోచనా విధానంలో మార్పు వస్తుంది. న్యాయశాస్త్రం కూడా దీనిని సమర్థిస్తుంది. హింస లేదా శిక్షలతో సాధించేది ఏమీ ఉండదు. ఈ విధంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన అవసంరం ఉంది' అంటూ పూర్తిచేశారు డిసౌజా. ఇంతా చేసింది ఎవరికోసమంటే.. బీజేపీ మిత్రపక్షమైన గోవా వికాస్ పార్టీ ముఖ్యనేత, ఎమ్మెల్యే పచేకో కోసం. 2006లో ఓ ప్రభుత్వోద్యోగిపై చేయిచేసుకున్న పచేకో.. న్యాయస్థానంలో దోషిగా నిరూపణ కావడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. అదికూడా ఆరు నెలల శిక్ష మాత్రమే. కాగా, ఎలాగైనాసరే ఆయనను జైలు నుంచి విడుదల చేయించాల్సిందేనని కంకణం కట్టుకున్న బీజేపీ ప్రభుత్వం.. పచేకో చేసింది కేవలం 'పొరపాటు మాత్రమే' అని తీర్మానించి ఆమోదం కోసం గవర్నర్ వద్దకు పంపింది. -
అక్కడ గేయం..ఇక్కడ గాయం
తెలంగాణ ఉద్యోగులకు నజరానాలు ఇక్కడి సిబ్బందికి రిక్తహస్తాలు వచ్చేనెల జీతాలు అనుమానమే.. అయోమయంలో సర్కారు సేవకులు అక్కడ ఉద్యోగ శ్రేణులకు వరాల జల్లు.. ఇక్కడ వచ్చే నెల నుంచి అసలు జీతాలే అందుతాయో లేదో అనే అనుమానం. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి తమ ప్రభుత్వ సిబ్బందికి కేంద్రప్రభుత్వ ఉద్యోగులస్థాయిలో వేతనాలిచ్చేస్తామని అభయం ఇచ్చేశారు. ఇక్కడ ట్రెజరీపై ఆంక్షలు విధించడంతో కనీసం కరెంటు బిల్లైనా కట్టలేని దుస్థితి. సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ శాఖలకు విభజన కష్టాలు మొదలయ్యాయి. సోమవారం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నేపథ్యంలో పాలన ఎవరిది వారిదే. దీంతో ఉద్యోగులు కొత్త కష్టాలతో అయోమయంలో ఉన్నారు. ఏ పని చేయాలో, ఎలా చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. అకౌంట్ల నిర్వహణ, రికార్డులు, బిల్లుల చెల్లింపులు అసలేం అర్థంకాక శాఖాధిపతులు సతమతమవుతున్నారు. ట్రెజరీపై ఆంక్షలు విధించడంతో కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అన్నింటికి మించి వచ్చే నెల నుంచి తమకు జీతాలు వస్తాయో రావోననే బెంగ పట్టుకుంది. జిల్లాలో సుమారు 52కుపైగా ప్రభుత్వశాఖలున్నాయి. వీటిలో దాదాపు 30వేల మందిపైగానే సిబ్బంది ఉంటారు. ఇప్పుడు వీరందరికీ పని సమస్య పట్టుకుంది. ఇప్పటి వరకు కొనసాగిన రికార్డులు, ఫైళ్లు, సిరీస్ నంబర్లు, హైదరాబాద్ ఖాతాలు, మెయిల్ అడ్రస్‌లు, సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం ఇక నుంచి పూర్తిగా మారిపోవడంతో గందరగోళం తీవ్రమైంది. జిల్లాస్థాయి అధికారులైతే ప్రస్తుత పరిస్థితి తల్చుకుని కిందా మీద పడుతున్నారు. అన్ని రకాల ప్రభుత్వ లావాదేవీలు, ఉన్నతాధికారుల చిరునామాలు, ఫైళ్లు అన్నీ మారిపోవడంతో ఏం చేయాలో తెలీక సతమతమవుతున్నారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు దీరకపోవడంతో అసలు ఏం చేయాలో దిశా నిర్దేశం చేసే వాళ్లు లేక, ప్రజావసరాలకు స్పందించలేక తలలు పట్టుకుంటున్నారు. ఈనెల 8 వరకు ట్రెజరీలో ఏ చిన్ని ఆర్థిక లావాదేవీ జరపవద్దని ఆదేశాలు రావడంతో చేతిలో చిల్లిగవ్వలేక శాఖలు గింజుకుంటున్నాయి. నిన్న మొన్నటివరకు క్షేత్రస్థాయితోపాటు కార్యాలయంలో ఏదొక ఫైలు పని ఉండేది. కానీ ఇప్పుడు పాతఫైళ్లను పక్కనపడేసి అన్నీ కొత్తగా ప్రారంభించాల్సి రావడంతో అంతా అయోమయంగా మారింది. వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు మాత్రం కొత్త ప్రభుత్వంలో రైతులు,డ్వాక్రా మహిళలు ఎంతెంత రుణాలు తీసుకున్నారు? ఎంతమందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను మాత్రం సిద్ధం చేసి ఉంచారు. నిరాశలో ఉద్యోగులు ఇదంతా ఒక ఎత్తయితే తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఉద్యోగులకు కేంద్రప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో వేతనాలు అమలుచేస్తామని ప్ర కటించారు. ఇదికాక తెలంగాణ వచ్చిన సందర్భంగా ఇంక్రిమెంట్లు కూడా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో ఇప్పుడు జిల్లాలో ఉద్యోగులు నీరసపడిపోయారు. అక్కడ చిన్నస్థాయి ఉద్యోగికి కూడా జీతాలు రెట్టింపవుతుంటే ఇక్కడేమో కొత్త ఆంధ్రప్రదేశ్‌లో తమకు వచ్చేనెల నుంచి లోటు బడ్జెట్ కారణంగా జీతాలు వస్తాయో రావో తెలియక తల్చుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తమ క్యాడర్ ఉద్యోగులకు పెరిగే వేతనం తల్చుకుని నిరాశకు గురవుతున్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో లోటు బడ్జెట్ కారణంగా తమకు ఎలాగూ జీతాలు పెంచే పరిస్థితి లేనందున నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.