అక్కడ గేయం..ఇక్కడ గాయం
- తెలంగాణ ఉద్యోగులకు నజరానాలు
- ఇక్కడి సిబ్బందికి రిక్తహస్తాలు
- వచ్చేనెల జీతాలు అనుమానమే..
- అయోమయంలో సర్కారు సేవకులు
అక్కడ ఉద్యోగ శ్రేణులకు వరాల జల్లు.. ఇక్కడ వచ్చే నెల నుంచి అసలు జీతాలే అందుతాయో లేదో అనే అనుమానం. తెలంగాణ నూతన ముఖ్యమంత్రి తమ ప్రభుత్వ సిబ్బందికి కేంద్రప్రభుత్వ ఉద్యోగులస్థాయిలో వేతనాలిచ్చేస్తామని అభయం ఇచ్చేశారు. ఇక్కడ ట్రెజరీపై ఆంక్షలు విధించడంతో కనీసం కరెంటు బిల్లైనా కట్టలేని దుస్థితి.
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ శాఖలకు విభజన కష్టాలు మొదలయ్యాయి. సోమవారం నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన నేపథ్యంలో పాలన ఎవరిది వారిదే. దీంతో ఉద్యోగులు కొత్త కష్టాలతో అయోమయంలో ఉన్నారు. ఏ పని చేయాలో, ఎలా చేయాలో అర్థం కాక తల పట్టుకుంటున్నారు. అకౌంట్ల నిర్వహణ, రికార్డులు, బిల్లుల చెల్లింపులు అసలేం అర్థంకాక శాఖాధిపతులు సతమతమవుతున్నారు. ట్రెజరీపై ఆంక్షలు విధించడంతో కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది. అన్నింటికి మించి వచ్చే నెల నుంచి తమకు జీతాలు వస్తాయో రావోననే బెంగ పట్టుకుంది.
జిల్లాలో సుమారు 52కుపైగా ప్రభుత్వశాఖలున్నాయి. వీటిలో దాదాపు 30వేల మందిపైగానే సిబ్బంది ఉంటారు. ఇప్పుడు వీరందరికీ పని సమస్య పట్టుకుంది. ఇప్పటి వరకు కొనసాగిన రికార్డులు, ఫైళ్లు, సిరీస్ నంబర్లు, హైదరాబాద్ ఖాతాలు, మెయిల్ అడ్రస్‌లు, సమాచారం ఇచ్చి పుచ్చుకోవడం ఇక నుంచి పూర్తిగా మారిపోవడంతో గందరగోళం తీవ్రమైంది. జిల్లాస్థాయి అధికారులైతే ప్రస్తుత పరిస్థితి తల్చుకుని కిందా మీద పడుతున్నారు.
అన్ని రకాల ప్రభుత్వ లావాదేవీలు, ఉన్నతాధికారుల చిరునామాలు, ఫైళ్లు అన్నీ మారిపోవడంతో ఏం చేయాలో తెలీక సతమతమవుతున్నారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు దీరకపోవడంతో అసలు ఏం చేయాలో దిశా నిర్దేశం చేసే వాళ్లు లేక, ప్రజావసరాలకు స్పందించలేక తలలు పట్టుకుంటున్నారు. ఈనెల 8 వరకు ట్రెజరీలో ఏ చిన్ని ఆర్థిక లావాదేవీ జరపవద్దని ఆదేశాలు రావడంతో చేతిలో చిల్లిగవ్వలేక శాఖలు గింజుకుంటున్నాయి.
నిన్న మొన్నటివరకు క్షేత్రస్థాయితోపాటు కార్యాలయంలో ఏదొక ఫైలు పని ఉండేది. కానీ ఇప్పుడు పాతఫైళ్లను పక్కనపడేసి అన్నీ కొత్తగా ప్రారంభించాల్సి రావడంతో అంతా అయోమయంగా మారింది. వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు మాత్రం కొత్త ప్రభుత్వంలో రైతులు,డ్వాక్రా మహిళలు ఎంతెంత రుణాలు తీసుకున్నారు? ఎంతమందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను మాత్రం సిద్ధం చేసి ఉంచారు.
నిరాశలో ఉద్యోగులు
ఇదంతా ఒక ఎత్తయితే తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడ ఉద్యోగులకు కేంద్రప్రభుత్వ ఉద్యోగుల స్థాయిలో వేతనాలు అమలుచేస్తామని ప్ర కటించారు. ఇదికాక తెలంగాణ వచ్చిన సందర్భంగా ఇంక్రిమెంట్లు కూడా వేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటనతో ఇప్పుడు జిల్లాలో ఉద్యోగులు నీరసపడిపోయారు.
అక్కడ చిన్నస్థాయి ఉద్యోగికి కూడా జీతాలు రెట్టింపవుతుంటే ఇక్కడేమో కొత్త ఆంధ్రప్రదేశ్‌లో తమకు వచ్చేనెల నుంచి లోటు బడ్జెట్ కారణంగా జీతాలు వస్తాయో రావో తెలియక తల్చుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో తమ క్యాడర్ ఉద్యోగులకు పెరిగే వేతనం తల్చుకుని నిరాశకు గురవుతున్నారు. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో లోటు బడ్జెట్ కారణంగా తమకు ఎలాగూ జీతాలు పెంచే పరిస్థితి లేనందున నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.