ఇదే బదిలీల లక్షణం!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:ప్రభుత్వ సిబ్బంది బదిలీల ప్రక్రియ ప్రహసనంగా సాగుతోంది. పూర్తిగా అధికార పార్టీ నేతల కనుసన్నల్లో సాగుతున్న ఈ తంతు కొందరు నేతలకు కాసులు కురిపిస్తుండగా.. మరోవైపు పనిలో పనిగా కుల, ప్రాంత సమీకరణలు, కక్ష సాధింపు చర్యలకూ బదిలీలను అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. చోటామోటా నేతలు కూడా బదిలీ కోరుకుంటున్న ఉద్యోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. పదేళ్ల తర్వాత అధికారం రుచి చూస్తున్న టీడీపీ నేతలు జిల్లాలో పూర్తి పట్టు సాధించాలన్న ధ్యేయంతో తమకు అనుకూలంగా ఉన్నవారికి పోస్టింగులు ఇప్పించుకునేందుకు కుల సమీకరణలకు తెర తీస్తున్నారు. ఇందుకు ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రితో పాటు పొరుగు జిల్లాల నేతల పలుకుబడినీ ఉపయోగించుకుంటున్నారు.
నేతలకు ఇచ్చే బదులు తమ ఉన్నతాధికారులకే అంతో ఇంతో ముట్టజెబితే పని అవుతుందన్న ఉద్దేశంతో ఉద్యోగులున్నా ఈ విషయంలో తమదే పూర్తి అధికారం అన్నట్లు అధికార పార్టీ నేతలు పెత్తనం చెలాయిస్తున్నారు. స్థానికంగా అనుకూల ఉద్యోగులు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవన్న ఉద్దేశంతో పావులు కదుపుతున్నారు. కీలకమైన పంచాయతీరాజ్, నీటిపారుదల, జిల్లాపరిషత్, పోలీస్ శాఖల బదిలీల విషయంలో పోస్టును బట్టి రేటు కట్టేసి దండుకుంటున్నారు. జెడ్పీలో దీర్ఘకాలంగా పని చేస్తున్న ఓ ఇంజినీర్ తనను ఇక్కడే కొనసాగించాలంటూ నేతలను ఆశ్రయించారని సమాచారం. ఇందుకు వారికి భారీగానే ముట్టజెప్పారని తెలిసింఇ. ఎక్సైజ్ శాఖలో కానిస్టేబుల్ స్థాయి బదిలీలకు కూడా టీడీపీ నేతలు లక్షల్లో డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కక్ష సాధింపులకూ ఇదే సమయం
గత ప్రభుత్వ హయాంలో తమకు పనులు చేయని, ప్రత్యర్థులకు అనుకూలంగా ఉన్న అధికారులు, సిబ్బందిపై పనిలోపనిగా బదిలీ వేటు వేయించాలని నేతలు ఉబలాటపడుతుఆన్నరు. బదిలీలన్నీ పారదర్శకంగా జరుగుతాయని బయటకు చెబుతున్నా అంతర్గతంగా జరిగాల్సిందంతా జరిగిపోతోంది. ప్రభుత్వం అధికారికంగా సోమవారం వనమహోత్సవం నిర్వహించినా చాలా మంది నేతలు గైర్హాజరై విశాఖలో ఉన్న సీఎం, మంత్రులు వద్దకు బదిలీల చిట్టాలు పట్టుకెళ్లారని తెలిసింది. రెవెన్యూ శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది మంత్రి ఓఎస్డీ తమపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం కక్ష సాధింపులు ఏస్థాయిలో ఉన్నాయో స్పష్టం చేస్తోంది.
కుల సమీకరణలకూ ఇదే అదను
పనిలో పనిగా కులసమీకరణలకూ నాయకులు తెరతీశారు. శ్రీకాకుళం, టెక్కలి ప్రాంతాలకు వెలమ సామాజికవర్గ అధికారులు, సిబ్బందిని, ఆమదాలవలస, జిల్లాపరిషత్, శ్రీకాకుళం రూరల్ ప్రాంతాలకు కాళింగ సామాజిక వర్గానికి చెందిన సిబ్బందిని తెప్పించుకునే దిశగా పావులు కదుపుతున్నారు. గతంలో ఓ మంత్రికి అనుకూలంగా ఉన్న ఒక ఇంజినీర్‌ను ఇక్కడ నుంచి తప్పించే మార్గాలు మూసుకుపోవడంతో, స్థానిక నేతలు పొరుగు జిల్లా నేతలను ఆశ్రయించారని తెలిసింది. జెడ్పీలోని మరో అధికారి విజయనగరం జిల్లా ఎమ్మెల్యే సహా ఆయన బంధువులను ఆశ్రయించి కావాల్సిన పోస్టింగ్‌కు ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఇక పోలీస్‌శాఖలో బదిలీలకు మంత్రి బంధువులను రంగంలోకి దింపారని తెలుస్తోంది. మంత్రి సోదరుడు కూడా ఇదే శాఖలో పనిచేస్తుండడంతో ఆయన ద్వారా పనులు చక్కబెట్టుకునేందుకు నేతలు కసరత్తు చేస్తున్నారు. అయితే కొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నట్టు తెలిసింది. తమకు జూనియర్‌గా ఉన్న వ్యక్తితో బదిలీల పైరవీలు చేయించుకునేందుకు సిద్ధంగా లేమని బాహటంగానే చెబుతున్నట్టు సమాచారం. మంత్రి బంధువులు కూడా ఇది సరి కాదంటూ నేతలకు సర్ది చెబుతున్నట్టు తెలిసింది. మొత్తానికి బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండదన్న ప్రభుత్వ పెద్దల ప్రకటనలకూ, ఇక్కడి నేతల నిర్వాకానికి పొంతన కుదరడం లేదు.