సర్కార్ గల్లా ‘ఫుల్’
పెరిగిన మద్యం విక్రయాలు
భారీగా పెరిగిన ఆదాయం
రూ.8,749 కోట్ల రాబడి
సాక్షి, బెంగళూరు : రాష్ట్ర ప్రభుత్వం ‘ఫుల్’ఖుష్గా ఉంది. మిగిలిన ప్రభుత్వ శాఖల నుంచి రాబడి ఎలా ఉన్నా అబ్కారీ శాఖ నుంచి వస్తున్న ఆదాయం పెరుగుతుండటమే దీనికి కారణం. రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు ‘మూడు బీర్లు...ఆరు బ్రాందీలు’గా సాగుతోంది. తొమ్మిది నెలల కాలంలో 2.97 కోట్ల లీటర్ల మద్యం (33 లక్షల కేసుల మద్యం), 90 లక్షల లీటర్ల బీరు (12.5 లక్షల కేసుల)ను ‘మందు బాబులు’ ఫుల్లుగా ష్టాగేశారు. దీంతో ప్రభుత్వానికి రూ.8,749 కోట్ల ఆదాయం సమకూరింది.
అబ్కారీ వల్ల ఈ ఏడాది రూ.12,400 కోట్లు రాబట్టాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా అందులో దాదాపు 73 శాతం లక్ష్యాన్ని తొమ్మిది నెలల్లోనే చేరుకుంది. మిగిలిన రూ.3,651 కోట్ల లక్ష్యాన్ని మూడు నెలల్లో సులభంగా రాబట్టగలమని అబ్కారీ శాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాదితో పోల్చితే ఇదే సమయానికి మద్యం అమ్మకాలు 14 శాతం పెరిగాయి.
జిల్లాల వారీగా తీసుకుంటే మద్యం అమ్మకాల్లో బెంగళూరు అర్బన్ మొదటిస్థానంలో, బెల్గాం, మైసూరు, దక్షిణ కన్నడ వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. రాష్ట్రంలో తాలూకాకు రెండు చొప్పున ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం షాపులను (ఎంఎస్ఐఎల్) అందుబాటులో ఉంచడం, సారా తాగడం వల్ల కలిగే అనర్థాలపై ప్రచారం చేయడంవల్లే ప్రతి ఏడాది రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయని మద్యం సరఫరా, అమ్మకాలను పర్యవేక్షించే కర్ణాటక స్టేట్ బెవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ ఆపరేషన్స్ విభాగం డెరైక్టర్ సన్నబసప్ప పేర్కొన్నారు.