govt Negligence
-
నెత్తిపై మృత్యు దేవత
పెంకులు పడిపోతుంటాయి. నెత్తిన బొప్పి కడుతుంటాయి. పైకప్పులోంచి చువ్వలు కనిపిస్తుంటాయి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయం.. ఎప్పుడే ప్రాణం పోతుందోనని కలవరం. శిధిలమవుతున్న ప్రభుత్వ భవనాలు మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. కూలిపోయే స్థితిలో ఉన్న గదుల్లో పాఠశాలలు సాగుతున్నాయి. పాచిపెంటలో ప్రభుత్వ పాఠశాల మరుగుదొడ్డి గోడ కూలి ఓ విద్యార్థి నిండు ప్రాణం రాలిపోయింది. నెత్తిపైనే మృత్యుదేవత తాండవిస్తోంది. సాక్షి,విజయనగరం: సీతానగరం పీహెచ్సీ సిబ్బంది నివాసాలు శిధిలమయ్యాయి. పెదంకలాం పీహెచ్సీ భవనం శిధిలమై పాములకు నివాసంగా మారింది. గుమ్మిడివరంలో ఎంపీఈ స్కూల్ అదనపు భవనం కూడా కూలిపోయే స్థితికి చేరుకుంది. – సీతానగరం (పార్వతీపురం) మండలంలోని భోజరాజపురంలో పాఠశాల భవనం పూర్తిగా పాడైనా అందులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. గోపాలరాయుడిపేట ఎంపీపీ పాఠశాల భవనంలో తరగతి గది పైకప్పు పెచ్చులూడిపోయింది. – బొబ్బిలి రూరల్ నెల్లిమర్ల మండల పరిషత్ భవనం శిథిలమై ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఈ భవనాన్ని 1998లో మిమ్స్ ఆస్పత్రి సేవలకు అప్పగించగా 2002లో ఖాళీ చేసినా తొలగించలేదు. – నెల్లిమర్ల చీపురుపల్లి ఆర్ అండ్ బి సహాయ ఇంజనీర్ అధికారి కార్యాలయం శిధిలం కావడంతో సిబ్బంది ఖాళీ చేశారు. కొన్నాళ్లకు భవనం కొంత కూలిపోయినా ఇంతవరకు తొలగించలేదు. జీవీఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మొదటి అంతస్తులోని పలు భవనాలు కూడా శిధిలావస్థకు చేరుకున్నాయి. – చీపురుపల్లి మెరకముడిదాంలో రెండేళ్ల క్రితం ఎస్సీ బాలుర వసతిగృహాన్ని ఎత్తివేశారు. అప్పటి నుంచి భవనం వృధాగా పడి ఉండటంతో శిధిలావస్థకు చేరింది. – మెరకముడిదాం (చీపురుపల్లి) వేపాడ మండలంలో శిధిలమైన భవనాల్లోనే చదువులు సాగుతున్నాయి. ఆకులసీతంపేట, సోంపురం, గుడివాడ, కుమ్మపల్లి, జగ్గయ్యపేట, ఎస్.కోట సీతారాంపురం, వేపాడ తదితర ప్రాథమిక పాఠశాలలు ఏ క్షణాన్నయినా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి. – వేపాడ (శృంగవరపుకోట) -
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి..
అది శిథిలమైన భవనమే.. దానిలోనే ఆ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదో రోజు అది కూలిపోయే ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఫలితం శూన్యం. ఆ పురాతన కట్టడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఆ భవనంలో ఓ భాగం శ్లాబు కుప్పకూలి దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగి ప్రాణాలు కోల్పోయింది. సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్(ఓఎస్)గా పనిచేస్తున్న మట్టపర్తి ఆదిలక్ష్మి(46) ఈ దురదృష్టకర సంఘటనకు బలైంది. కొత్తపేట: బ్రిటిష్ పాలకులు నిర్మించిన వివిధ కార్యాలయాల భవన సముదాయం శ్లాబు బలహీన పడి శిథిలావస్థకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సబ్ ట్రెజరీ రెండో గది భాగం శ్లాబు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఆ గదిలో ఉన్న ఓఎస్ మట్టపర్తి ఆదిలక్ష్మి ఆ శ్లాబు శిథిలాల కింద ఇరుక్కుపోయింది. వెంటనే స్థానికులు, పక్కనే ఉన్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించి, ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి చిన్నప్పటి నుంచి రెండు కాళ్లు పోలియోతో చంక కర్రల సాయంతో నడుస్తుంది. డిగ్రీ చదివిన ఆమె సుమారు పదేళ్ల నుంచి ఉద్యోగానికి ప్రయత్నించగా, 2016 జూలైలో ఉపాధి కల్పన శాఖ పీహెచ్సీ కోటాలో సబ్ ట్రెజరీకి ఎంపిక చేసింది. కొత్తపేట సబ్ ట్రెజరీలో ఓఎస్గా పోస్టింగ్ ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన రెండేళ్లకు ఈ విధంగా ఆమె తనువు చాలించడం విచారకరం. వర్షం నీటి చెమ్మతో తప్పిన పెను ప్రమాదం ఆ కార్యాలయంలో ఎస్టీఓతో పాటు ఎనిమిది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండే పలువురు ఉద్యోగులు మధ్యాహ్న భోజనానికి తమ ఇళ్లకు వెళ్లగా, మిగిలిన వారు కార్యాలయంలో ప్రమాదం జరిగిన గదిలోనే భోజనం చేసి సేద తీరేవారు. కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నందున నీరు కారుతూ చెమ్మగిల్లింది. దాంతో ఓఎస్ ఆదిలక్ష్మి మినహా మిగిలిన వారందరూ మొదటి గది, లోపలి గదిలో వారివారి టేబుళ్ల వద్ద భోజనం చేసి కూర్చున్నారు. ఆదిలక్ష్మి మాత్రం ఆ గదిలోనే భోజనం చేసి కూర్చుంది. అదే సమయంలో ఒక్కసారిగా శ్లాబు కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోయింది. నాలుగేళ్లుగా ‘సాక్షి’ హెచ్చరిçస్తూనే ఉన్నా.. 1898లో అప్పటి బ్రిటిష్ పాలకులు తాలూకా పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం రాతి కట్టుబడితో మద్రాస్ టెర్రస్ (గానుగు సున్నం) శ్లాబుతో నిర్మించారు. దానిలో తహసీల్దార్, సబ్ ట్రెజరీ, ప్రస్తుతం అగ్నిమాపక కేంద్ర కార్యాలయాలున్నాయి. గతంలో అగ్నిమాపక కేంద్రం విభాగాన్ని ఆ శాఖ వారు ఆధునికీకరించుకోగా, రెవెన్యూ, సబ్ ట్రెజరీ కార్యాలయాల విభాగాలు నీరుకారుతూ శిథిలావస్థకు చేరాయి. ఏమాత్రం వర్షం కురిసినా నీరు కారుతోంది. సీలింగ్కు టార్పాలిన్, సంచులు కట్టుకుని వర్షం నీటి నుంచి రక్షణ పొందుతూ, రికార్డులను భద్రపరుచుకుంటూ ఆయా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. నాలుగేళ్లుగా ఆధునికీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడమే తప్ప వాటికి మోక్షం లభించలేదు. గత ఏడాది సెప్టెంబర్ 15న సాక్షిలో ‘పరిరక్షించుకుంటే పదిలం’, గత నెల 12న ‘పురాతన భవనాన్ని పదిలం చేద్దాం’ శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఫలితంగా ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. -
ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎమ్మెల్యే నిరాహార దీక్ష
నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ బుధవారం నిరాహార దీక్షకు దిగారు. నగర అభివృద్ధిపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో దీక్ష చేపట్టారు. ఈ దీక్ష కార్యక్రమానికి ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ రెడ్డి, పార్టీ నేతలు ఆనం విజయకుమార్ రెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి, కార్పొరేటర్లు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు చేరుకుని సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ తీరుపై నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగి కష్టాలు..
అతనిలో ఉన్న నైపుణ్యం తపాలా శాఖలో ఉద్యోగిగా మార్చింది. కొన్ని సంవత్సరాల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగాడు. అదే సమయంలో కారుణ్య నియమాకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ ఉద్యోగాన్ని సమకూర్చింది. రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వచ్చాడు. అనుకోని విధంగా కొందరు ఫిర్యాదు చేయడంతో సమస్యల్లో కూరుకుపోయాడు. కేంద్ర ప్రభుత్వ కొలువును వదులుకున్నా... ఫలితం లేకుండా పోయింది. దర్యాప్తు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రస్తుతం అతని కుటుంబం రోడ్డున పడింది. దీర్ఘకాలిక వ్యాధుల బారినపడ్డ అతను మంచానికే పరిమితమయ్యాడు. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు రాలేదు. అనంతపురం: కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లికి చెందిన నగేష్రెడ్డి 1981లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన తపాల శాఖలో బ్రాంచ్ పోస్టమాస్టర్గా పనిలో చేరాడు. అప్పటి నుంచి 2012 వరకు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ వచ్చాడు. 2008లో కారుణ్య నియామాకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అతనికి బ్రహ్మసముద్రం మండల వీఆర్వోగా ఎంపిక చేసింది. నాలుగేళ్ల పాటు బీపీఎం, వీఆర్వోగా ఆయన రెండు ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు. ఒకటి వదులుకున్నా... ఒకే వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడం తప్పే కావచ్చు. అయితే మొదటి ఉద్యోగం చేస్తున్న విషయం తెలుసుకోకుండా రెండవ ఉద్యోగాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా విమర్శలకు దారితీస్తోంది. 2012లో ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి, విచారణ చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశాడు. అదే సమయంలో వీఆర్వో ఉద్యోగం నుంచి నగేష్రెడ్డిని అప్పటి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న మొత్తం వేతనాన్ని వెనక్కు చెల్లిస్తే తిరిగి వీఆర్వోగా విధుల్లో చేరే అవకాశం కల్పిస్తామంటూ అప్పట్లో అధికారులు హామీనిచ్చారు. దీంతో పోస్టల్ శాఖ నుంచి తాను పొందిన మొత్తం వేతనాన్ని ఆయన వెనక్కు చెల్లించాడు. అప్పటి నుంచి తన సస్పెన్షన్ను తొలగించాలంటూ అధికారులను వేడుకుంటూ వచ్చాడు. వారు కరుణించలేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఫలితం దక్కలేదు. తన భార్య, ఇద్దరు పిల్లలు వీధిన పడుతున్నారని, సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ కన్నీటితో వేడుకున్నాడు. అధికారులు పట్టించుకోలేదు. ప్రస్తుతం పరిస్థితి విషమించి.... ప్రస్తుతం నగేష్రెడ్డి పరిస్థితి విషమించింది. అతనిపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేసినా ఉద్యోగం చేయలేసి అసహాయ స్థితిలో ఉన్నాడు. మధుమేహ(షుగర్) వ్యాధి బారిన పడ్డ అతను సరైన చికిత్సలు చేయించుకోలేకపోయాడు. దీంతో వ్యాధి బాగా ముదిరిపోయింది. రెండు కిడ్నీలూ చెడిపోయాయి. ఒకరి సాయం లేనిదే సొంత పనులూ చేసుకోలేని అసహాయ స్థితిలో ఉన్నాడు. వైద్య చికిత్సలకు సైతం చేతిలో చిల్లిగవ్వలేక మంచానపడ్డాడు. తన దుస్థితిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇంటర్మీడియట్ చదువుతున్న తన ఇద్దరు కూతుళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ వేడుకుంటున్నాడు. ఇంతటి దుర్భర స్థితిలో ఉన్న నగేష్రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు అధికారులు స్పందిస్తారో... లేదో వేచి చూడాలి.