అతనిలో ఉన్న నైపుణ్యం తపాలా శాఖలో ఉద్యోగిగా మార్చింది. కొన్ని సంవత్సరాల పాటు ఆ ఉద్యోగంలో కొనసాగాడు. అదే సమయంలో కారుణ్య నియమాకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓ ఉద్యోగాన్ని సమకూర్చింది. రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వచ్చాడు. అనుకోని విధంగా కొందరు ఫిర్యాదు చేయడంతో సమస్యల్లో కూరుకుపోయాడు. కేంద్ర ప్రభుత్వ కొలువును వదులుకున్నా... ఫలితం లేకుండా పోయింది. దర్యాప్తు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ప్రస్తుతం అతని కుటుంబం రోడ్డున పడింది. దీర్ఘకాలిక వ్యాధుల బారినపడ్డ అతను మంచానికే పరిమితమయ్యాడు. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో మార్పు రాలేదు.
అనంతపురం: కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండలం గొంచిరెడ్డిపల్లికి చెందిన నగేష్‌రెడ్డి 1981లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన తపాల శాఖలో బ్రాంచ్ పోస్టమాస్టర్‌గా పనిలో చేరాడు. అప్పటి నుంచి 2012 వరకు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ వచ్చాడు. 2008లో కారుణ్య నియామాకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అతనికి బ్రహ్మసముద్రం మండల వీఆర్వోగా ఎంపిక చేసింది. నాలుగేళ్ల పాటు బీపీఎం, వీఆర్వోగా ఆయన రెండు ఉద్యోగాలు చేస్తూ వచ్చాడు.
ఒకటి వదులుకున్నా...
ఒకే వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడం తప్పే కావచ్చు. అయితే మొదటి ఉద్యోగం చేస్తున్న విషయం తెలుసుకోకుండా రెండవ ఉద్యోగాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కూడా విమర్శలకు దారితీస్తోంది. 2012లో ఈ విషయాన్ని ఉన్నతాధికారులు గుర్తించి, విచారణ చేపట్టడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి ఆయన రాజీనామా చేశాడు. అదే సమయంలో వీఆర్వో ఉద్యోగం నుంచి నగేష్‌రెడ్డిని అప్పటి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న మొత్తం వేతనాన్ని వెనక్కు చెల్లిస్తే తిరిగి వీఆర్వోగా విధుల్లో చేరే అవకాశం కల్పిస్తామంటూ అప్పట్లో అధికారులు హామీనిచ్చారు. దీంతో పోస్టల్ శాఖ నుంచి తాను పొందిన మొత్తం వేతనాన్ని ఆయన వెనక్కు చెల్లించాడు. అప్పటి నుంచి తన సస్పెన్షన్‌ను తొలగించాలంటూ అధికారులను వేడుకుంటూ వచ్చాడు. వారు కరుణించలేదు. జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. ఫలితం దక్కలేదు. తన భార్య, ఇద్దరు పిల్లలు వీధిన పడుతున్నారని, సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ కన్నీటితో వేడుకున్నాడు. అధికారులు పట్టించుకోలేదు.
ప్రస్తుతం పరిస్థితి విషమించి....
ప్రస్తుతం నగేష్‌రెడ్డి పరిస్థితి విషమించింది. అతనిపై ఉన్న సస్పెన్షన్‌ను ఎత్తివేసినా ఉద్యోగం చేయలేసి అసహాయ స్థితిలో ఉన్నాడు. మధుమేహ(షుగర్) వ్యాధి బారిన పడ్డ అతను సరైన చికిత్సలు చేయించుకోలేకపోయాడు. దీంతో వ్యాధి బాగా ముదిరిపోయింది. రెండు కిడ్నీలూ చెడిపోయాయి. ఒకరి సాయం లేనిదే సొంత పనులూ చేసుకోలేని అసహాయ స్థితిలో ఉన్నాడు. వైద్య చికిత్సలకు సైతం చేతిలో చిల్లిగవ్వలేక మంచానపడ్డాడు. తన దుస్థితిపై ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇంటర్‌మీడియట్ చదువుతున్న తన ఇద్దరు కూతుళ్లకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ వేడుకుంటున్నాడు. ఇంతటి దుర్భర స్థితిలో ఉన్న నగేష్‌రెడ్డి కుటుంబాన్ని ఆదుకునేందుకు అధికారులు స్పందిస్తారో... లేదో వేచి చూడాలి.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఉద్యోగి కష్టాలు..
Published Thu, Jun 16 2016 9:18 AM | Last Updated on Mon, Sep 4 2017 2:38 AM
Advertisement
Advertisement