కుప్పకూలిన భవనం శిథిలాల నుంచి ఆదిలక్ష్మిని బయటకు తీస్తున్న దృశ్యం
అది శిథిలమైన భవనమే.. దానిలోనే ఆ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదో రోజు అది కూలిపోయే ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఫలితం శూన్యం. ఆ పురాతన కట్టడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఆ భవనంలో ఓ భాగం శ్లాబు కుప్పకూలి దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగి ప్రాణాలు కోల్పోయింది. సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్(ఓఎస్)గా పనిచేస్తున్న మట్టపర్తి ఆదిలక్ష్మి(46) ఈ దురదృష్టకర సంఘటనకు బలైంది.
కొత్తపేట: బ్రిటిష్ పాలకులు నిర్మించిన వివిధ కార్యాలయాల భవన సముదాయం శ్లాబు బలహీన పడి శిథిలావస్థకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సబ్ ట్రెజరీ రెండో గది భాగం శ్లాబు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఆ గదిలో ఉన్న ఓఎస్ మట్టపర్తి ఆదిలక్ష్మి ఆ శ్లాబు శిథిలాల కింద ఇరుక్కుపోయింది. వెంటనే స్థానికులు, పక్కనే ఉన్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించి, ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు.
అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి చిన్నప్పటి నుంచి రెండు కాళ్లు పోలియోతో చంక కర్రల సాయంతో నడుస్తుంది. డిగ్రీ చదివిన ఆమె సుమారు పదేళ్ల నుంచి ఉద్యోగానికి ప్రయత్నించగా, 2016 జూలైలో ఉపాధి కల్పన శాఖ పీహెచ్‌సీ కోటాలో సబ్ ట్రెజరీకి ఎంపిక చేసింది. కొత్తపేట సబ్ ట్రెజరీలో ఓఎస్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన రెండేళ్లకు ఈ విధంగా ఆమె తనువు చాలించడం విచారకరం.
వర్షం నీటి చెమ్మతో తప్పిన పెను ప్రమాదం
ఆ కార్యాలయంలో ఎస్‌టీఓతో పాటు ఎనిమిది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండే పలువురు ఉద్యోగులు మధ్యాహ్న భోజనానికి తమ ఇళ్లకు వెళ్లగా, మిగిలిన వారు కార్యాలయంలో ప్రమాదం జరిగిన గదిలోనే భోజనం చేసి సేద తీరేవారు. కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నందున నీరు కారుతూ చెమ్మగిల్లింది. దాంతో ఓఎస్ ఆదిలక్ష్మి మినహా మిగిలిన వారందరూ మొదటి గది, లోపలి గదిలో వారివారి టేబుళ్ల వద్ద భోజనం చేసి కూర్చున్నారు. ఆదిలక్ష్మి మాత్రం ఆ గదిలోనే భోజనం చేసి కూర్చుంది. అదే సమయంలో ఒక్కసారిగా శ్లాబు కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోయింది.
నాలుగేళ్లుగా ‘సాక్షి’ హెచ్చరిçస్తూనే ఉన్నా..
1898లో అప్పటి బ్రిటిష్ పాలకులు తాలూకా పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం రాతి కట్టుబడితో మద్రాస్ టెర్రస్ (గానుగు సున్నం) శ్లాబుతో నిర్మించారు. దానిలో తహసీల్దార్, సబ్ ట్రెజరీ, ప్రస్తుతం అగ్నిమాపక కేంద్ర కార్యాలయాలున్నాయి. గతంలో అగ్నిమాపక కేంద్రం విభాగాన్ని ఆ శాఖ వారు ఆధునికీకరించుకోగా, రెవెన్యూ, సబ్ ట్రెజరీ కార్యాలయాల విభాగాలు నీరుకారుతూ శిథిలావస్థకు చేరాయి. ఏమాత్రం వర్షం కురిసినా నీరు కారుతోంది. సీలింగ్‌కు టార్పాలిన్, సంచులు కట్టుకుని వర్షం నీటి నుంచి రక్షణ పొందుతూ, రికార్డులను భద్రపరుచుకుంటూ ఆయా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. నాలుగేళ్లుగా ఆధునికీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడమే తప్ప వాటికి మోక్షం లభించలేదు. గత ఏడాది సెప్టెంబర్ 15న సాక్షిలో ‘పరిరక్షించుకుంటే పదిలం’, గత నెల 12న ‘పురాతన భవనాన్ని పదిలం చేద్దాం’ శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఫలితంగా ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment