sub treasury officer
-
పింఛన్ సొమ్ములు..మింగేశారు!
బందరు సబ్‌ట్రెజరీ ఆఫీసు... అవినీతికి చిరునామా! ఇక్కడ ఏ పనికైనా ఓ ఫిక్స్డ్ రేటు. అదివ్వకుంటే సిబ్బంది కనికరించరు. ఆఖరకు చనిపోయిన వారి పింఛన్లు బొక్కేయడానికీ సిగ్గుపడరు. ఎరియర్స్ రూపంలో అదనంగా జమయ్యే సొమ్ములు సైతం పక్కదారి పట్టించడంలోనూ అస్సలు మొహమాటపడరు. పింఛన్ మంజూరు చేయాలన్నా, బిల్లులు పాస్ కావాలన్నా ఇక్కడి సిబ్బందికి ‘పర్సంటేజీ’ లిచ్చి సంతృప్తిపరిస్తేనే! ఇవే విషయాలు ఏసీబీ అధికారులకు అవగతమయ్యాయి. కార్యాలయంపై దాడి చేస్తే ఎన్నో విషయాలూ వెలుగుచూశాయి. ఇక అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయిన ఎస్టీఓలు సబ్బినేని నాగమల్లేశ్వరరావు, గుమ్మడి శేషుకుమార్లపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ సస్పెన్షన్ వేటు వేసింది. వీరి హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై ఏసీబీతో పాటు శాఖాపరమైన విచారణ సాగుతోంది. సాక్షి, మచిలీపట్నం: స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ ట్రెజరీ కార్యాలయ పరిధిలో 5500 మందికి పైగా పెన్షనర్స్ ఉన్నారు. సర్వీస్ పెన్షన్లను ఎస్టీఓ నాగమల్లేశ్వర రావు, ఫ్యామిలీ పెన్షన్లను శేషుకుమారి చూస్తుంటారు. ఇక్కడ గడిచిన నాలుగేళ్లుగా పింఛన్ మంజూరులోనే కాదు.. ప్రతి పనికి పర్సంటేజ్‌లు దండుకుంటున్నారనే ఆరోపణలు వాస్తవమేనని ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 3వ తేదీన ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నాగమల్లేశ్వరరావు, శేషుకుమార్‌ల వద్ద అవినీతి సొమ్మును స్వా«దీనం చేసుకున్నారు. రికార్డులు సీజ్ చేసి లోతైన విచారణ చేపట్టారు. ఎలా పక్కదారి పట్టించే వారంటే... సాధారణంగా పెన్షనర్ చినిపోయినప్పుడు అతని కుటుంబ సభ్యులు ఆ సమాచారాన్ని సకాలంలో ట్రెజరీకి తెలియజేయరు. రెండు మూడు నెలల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కన్వర్షన్ కోసం వస్తారు. సరీ్వస్ పెన్షన్ నుంచి ఫ్యామిలీ ఫెన్ష న్ మార్చుకుంటారు. అయితే చనిపోయిన ఆ రిటైర్ ఉద్యోగి ఖాతాలో జమయ్యే సర్వీస్ పెన్షన్ మొత్తాన్ని సదరు బ్యాంక్ నుంచి డీడీ రూపంలో రికవరీ చేస్తారు. భార్య, భర్తలిద్దరూ ఉద్యోగులై ఒకరు చనిపోతే రెండో వ్యక్తికి సరీ్వస్ పెన్షన్‌తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా వస్తుంది. ఇలా రెండు పెన్షన్లు పొందే వారికి ఒకటే డీఏ జమవ్వాలి. కానీ నెలలు, కొన్ని కేసుల్లో ఏళ్ల తరబడి రెండు డీఎలు జమవుతుంటాయి. ఇక పే ఫిక్సేషన్లో జరిగే పొరపాట్ల వల్ల కొంతమందికి ఎక్కువగా జమవుతుంది. ఆ మేరకు డీఏ, హెచ్‌ఆర్‌ఎలు కూడా అదనంగా జమవుతుంటాయి. ఇలా జరిగిన పొరపాట్లను ఆడిటింగ్, ఉన్నతాధికారుల తనిఖీల్లో గుర్తిస్తారు. రికవరీకి పెడతారు. కొంతమందికి ఆర్నెల్లకు, ఏడాదికి జమయ్యే ఎరియర్స్‌లో కూడా ఎక్సెస్ జమవు తుంటాయి. ఇలా జమయ్యే మొత్తాలను కూడా వారి నుంచి రికవరీ చేస్తారు. ఎస్టీవో నాగమల్లేశ్వర రావును విచారిస్తున్న ఏసీబీ ఏఎస్పీ కే.ఎం.మహేశ్వరరాజు (ఫైల్) దర్జాగా దారిమళ్లించారు! కానీ ఇలాంటి కేసుల్లో ఎస్టీఓల పేరిట డీడీ రూపంలో వసూలు చేసే మొత్తాలను ప్రభుత్వ ఖాతా (పద్దు 2071)కు జమ చేయకుండా తన పేరిట ఉన్న కరెంట్ ఖాతాకు మళ్లించి దర్జాగా డ్రా చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు విచారణలో గుర్తించారు. ఇలా కేవలం ఏడాది వ్యవధిలోనే ప్రభుత్వ ఖాతాకు జమ కావాల్సిన రూ.29 లక్షలు, ఎస్టీఒ నాగమల్లేశ్వరరావు తన ఖాతాకు మళ్లించుకుని డ్రా చేసుకున్నట్టుగా లెక్క తేల్చారు. ఒక్క ఏడాదిలోనే ఇంతపెద్ద మొత్తంలో అవినీతి బయటపడితే ఇక ఆయన ఇక్కడకు వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తే కనీసం కోటిన్నరకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దీని వెనుక జిల్లా ట్రెజరీ ఉన్నతాధి కారి హస్తం కూడా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. సదరు ఉన్నతాధికారి ఏసీబీ అధికారులకు సహకరించడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు. లోతైన విచారణ జరుపుతున్నాం తమకు అందిన ఫిర్యాదులపైనే బందరు ఎస్టీఒ కార్యాలయంలోతనిఖీలు చేశాం. స్వా«దీనం చేసుకున్న రికార్డులను పరిశీలిస్తే కేవలం ఏడాదిలోనే రూ.29 లక్షలు పక్కదారి పట్టినట్టుగా గుర్తించాం. గడిచిన నాలుగేళ్ల రికార్డులను పరిశీలించాలని నిర్ణయించాం. –కె.ఎం.మల్లేశ్వరరాజు, ఏసీబీ ఏఎస్పీ దర్యాప్తు చేపట్టాల్సి ఉంది ఏసీబీ దాడి నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఆదేశాల మేరకు ఎస్టీఒలిద్దర్నీ సస్పెండ్ చేశాం. శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. సదరు ఖాతాలకు సంబంధించి బ్యాంకుల నుంచి రికార్డులను తీసుకుని విచారణ చేపడతాం. –నాగమహేష్, డీడీ, జిల్లా ట్రెజరీస్ -
నిర్లక్ష్యానికి నిండుప్రాణం బలి..
అది శిథిలమైన భవనమే.. దానిలోనే ఆ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఏదో రోజు అది కూలిపోయే ప్రమాదం ఉందని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే ఫలితం శూన్యం. ఆ పురాతన కట్టడంపై ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. ఆ భవనంలో ఓ భాగం శ్లాబు కుప్పకూలి దివ్యాంగురాలైన మహిళా ఉద్యోగి ప్రాణాలు కోల్పోయింది. సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్(ఓఎస్)గా పనిచేస్తున్న మట్టపర్తి ఆదిలక్ష్మి(46) ఈ దురదృష్టకర సంఘటనకు బలైంది. కొత్తపేట: బ్రిటిష్ పాలకులు నిర్మించిన వివిధ కార్యాలయాల భవన సముదాయం శ్లాబు బలహీన పడి శిథిలావస్థకు చేరింది. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సబ్ ట్రెజరీ రెండో గది భాగం శ్లాబు ఒక్కసారిగా కుప్పకూలింది. ఆ సమయంలో ఆ గదిలో ఉన్న ఓఎస్ మట్టపర్తి ఆదిలక్ష్మి ఆ శ్లాబు శిథిలాల కింద ఇరుక్కుపోయింది. వెంటనే స్థానికులు, పక్కనే ఉన్న ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించి, ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారం గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి చిన్నప్పటి నుంచి రెండు కాళ్లు పోలియోతో చంక కర్రల సాయంతో నడుస్తుంది. డిగ్రీ చదివిన ఆమె సుమారు పదేళ్ల నుంచి ఉద్యోగానికి ప్రయత్నించగా, 2016 జూలైలో ఉపాధి కల్పన శాఖ పీహెచ్సీ కోటాలో సబ్ ట్రెజరీకి ఎంపిక చేసింది. కొత్తపేట సబ్ ట్రెజరీలో ఓఎస్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఉద్యోగంలో చేరిన రెండేళ్లకు ఈ విధంగా ఆమె తనువు చాలించడం విచారకరం. వర్షం నీటి చెమ్మతో తప్పిన పెను ప్రమాదం ఆ కార్యాలయంలో ఎస్టీఓతో పాటు ఎనిమిది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉండే పలువురు ఉద్యోగులు మధ్యాహ్న భోజనానికి తమ ఇళ్లకు వెళ్లగా, మిగిలిన వారు కార్యాలయంలో ప్రమాదం జరిగిన గదిలోనే భోజనం చేసి సేద తీరేవారు. కొన్ని రోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నందున నీరు కారుతూ చెమ్మగిల్లింది. దాంతో ఓఎస్ ఆదిలక్ష్మి మినహా మిగిలిన వారందరూ మొదటి గది, లోపలి గదిలో వారివారి టేబుళ్ల వద్ద భోజనం చేసి కూర్చున్నారు. ఆదిలక్ష్మి మాత్రం ఆ గదిలోనే భోజనం చేసి కూర్చుంది. అదే సమయంలో ఒక్కసారిగా శ్లాబు కుప్పకూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోయింది. నాలుగేళ్లుగా ‘సాక్షి’ హెచ్చరిçస్తూనే ఉన్నా.. 1898లో అప్పటి బ్రిటిష్ పాలకులు తాలూకా పరిధిలో పరిపాలనా సౌలభ్యం కోసం రాతి కట్టుబడితో మద్రాస్ టెర్రస్ (గానుగు సున్నం) శ్లాబుతో నిర్మించారు. దానిలో తహసీల్దార్, సబ్ ట్రెజరీ, ప్రస్తుతం అగ్నిమాపక కేంద్ర కార్యాలయాలున్నాయి. గతంలో అగ్నిమాపక కేంద్రం విభాగాన్ని ఆ శాఖ వారు ఆధునికీకరించుకోగా, రెవెన్యూ, సబ్ ట్రెజరీ కార్యాలయాల విభాగాలు నీరుకారుతూ శిథిలావస్థకు చేరాయి. ఏమాత్రం వర్షం కురిసినా నీరు కారుతోంది. సీలింగ్‌కు టార్పాలిన్, సంచులు కట్టుకుని వర్షం నీటి నుంచి రక్షణ పొందుతూ, రికార్డులను భద్రపరుచుకుంటూ ఆయా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. నాలుగేళ్లుగా ఆధునికీకరణకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడమే తప్ప వాటికి మోక్షం లభించలేదు. గత ఏడాది సెప్టెంబర్ 15న సాక్షిలో ‘పరిరక్షించుకుంటే పదిలం’, గత నెల 12న ‘పురాతన భవనాన్ని పదిలం చేద్దాం’ శీర్షికన కథనాలు ప్రచురితమయ్యాయి. అయినా ప్రభుత్వం స్పందించలేదు. ఫలితంగా ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. -
శ్రీశైలం ఎస్టీఓ ఆచూకీ లభ్యం
కర్నూలు(అగ్రికల్చర్): శ్రీశైలం సబ్ ట్రెజరీ అధికారిణి నాగసవిత ఆచూకీ లభించింది. వారం రోజుల క్రితం ఈమె అదృశ్యమయ్యింది. ఈ మేరకు పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదైంది. నిజాయితీగా పనిచేస్తున్న తన మీద అభియోగాలు నమోదు కావడం, డైరెక్టర్ చార్జిమెమో జారీ చేసినందుకు మనస్తాపం చెందిన ఆమె అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. దీనిపై కొద్ది రోజులుగా దళిత ఉద్యోగ సంఘాలు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నాయి. ట్రెజరీ ఏడీ వేధింపులే ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోవడానికి కారణమని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. ఆమె తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఉన్నట్లు సమాచారం. బుధవారం కర్నూలుకు తీసుకురానున్నట్లు తెలిసింది. -
ఏసీబీకి చిక్కిన సబ్ ట్రెజరీ ఆఫీసర్
విజయవాడ: లంచం తీసుకుంటూ ఓ సబ్ ట్రెజరీ అధికారి ఏసీబీ అధికారులకు చిక్కాడు. విజయవాడలో సబ్ ట్రెజరీ ఆఫీసర్‌గా పని చేస్తున్న బండారు మోహన్‌రావు ఓ వ్యక్తి నుంచి రూ. 3,500 లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధకశాఖ అధికారులు ఆదివారం వలవేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో అధికారులు మరింత సమాచారం కోసం విచారణ జరుపుతున్నారు.