బందరు సబ్‌ట్రెజరీ ఆఫీసు... అవినీతికి చిరునామా! ఇక్కడ ఏ పనికైనా ఓ ఫిక్స్‌డ్ రేటు. అదివ్వకుంటే సిబ్బంది కనికరించరు. ఆఖరకు చనిపోయిన వారి పింఛన్లు బొక్కేయడానికీ సిగ్గుపడరు. ఎరియర్స్ రూపంలో అదనంగా జమయ్యే సొమ్ములు సైతం పక్కదారి పట్టించడంలోనూ అస్సలు మొహమాటపడరు. పింఛన్ మంజూరు చేయాలన్నా, బిల్లులు పాస్ కావాలన్నా ఇక్కడి సిబ్బందికి ‘పర్సంటేజీ’ లిచ్చి సంతృప్తిపరిస్తేనే! ఇవే విషయాలు ఏసీబీ అధికారులకు అవగతమయ్యాయి. కార్యాలయంపై దాడి చేస్తే ఎన్నో విషయాలూ వెలుగుచూశాయి. ఇక అవినీతి సొమ్ముతో అడ్డంగా దొరికిపోయిన ఎస్‌టీఓలు సబ్బినేని నాగమల్లేశ్వరరావు, గుమ్మడి శేషుకుమార్‌లపై డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ సస్పెన్షన్ వేటు వేసింది. వీరి హయాంలో జరిగిన అవినీతి, అవకతవకలపై ఏసీబీతో పాటు శాఖాపరమైన విచారణ సాగుతోంది.
సాక్షి, మచిలీపట్నం: స్థానిక సబ్ ట్రెజరీ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. ఈ ట్రెజరీ కార్యాలయ పరిధిలో 5500 మందికి పైగా పెన్షనర్స్ ఉన్నారు. సర్వీస్ పెన్షన్లను ఎస్‌టీఓ నాగమల్లేశ్వర రావు, ఫ్యామిలీ పెన్షన్లను శేషుకుమారి చూస్తుంటారు. ఇక్కడ గడిచిన నాలుగేళ్లుగా పింఛన్ మంజూరులోనే కాదు.. ప్రతి పనికి పర్సంటేజ్‌లు దండుకుంటున్నారనే ఆరోపణలు వాస్తవమేనని ఏసీబీ అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ నెల 3వ తేదీన ఏసీబీ అధికారులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నాగమల్లేశ్వరరావు, శేషుకుమార్‌ల వద్ద అవినీతి సొమ్మును స్వా«దీనం చేసుకున్నారు. రికార్డులు సీజ్ చేసి లోతైన విచారణ చేపట్టారు.
ఎలా పక్కదారి పట్టించే వారంటే...
సాధారణంగా పెన్షనర్ చినిపోయినప్పుడు అతని కుటుంబ సభ్యులు ఆ సమాచారాన్ని సకాలంలో ట్రెజరీకి తెలియజేయరు. రెండు మూడు నెలల తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ కన్వర్షన్ కోసం వస్తారు. సరీ్వస్ పెన్షన్ నుంచి ఫ్యామిలీ ఫెన్ష న్ మార్చుకుంటారు. అయితే చనిపోయిన ఆ రిటైర్ ఉద్యోగి ఖాతాలో జమయ్యే సర్వీస్ పెన్షన్ మొత్తాన్ని సదరు బ్యాంక్ నుంచి డీడీ రూపంలో రికవరీ చేస్తారు.
భార్య, భర్తలిద్దరూ ఉద్యోగులై ఒకరు చనిపోతే రెండో వ్యక్తికి సరీ్వస్ పెన్షన్‌తో పాటు ఫ్యామిలీ పెన్షన్ కూడా వస్తుంది. ఇలా రెండు పెన్షన్లు పొందే వారికి ఒకటే డీఏ జమవ్వాలి. కానీ నెలలు, కొన్ని కేసుల్లో ఏళ్ల తరబడి రెండు డీఎలు జమవుతుంటాయి. ఇక పే ఫిక్సేషన్‌లో జరిగే పొరపాట్ల వల్ల కొంతమందికి ఎక్కువగా జమవుతుంది. ఆ మేరకు డీఏ, హెచ్‌ఆర్‌ఎలు కూడా అదనంగా జమవుతుంటాయి. ఇలా జరిగిన పొరపాట్లను ఆడిటింగ్, ఉన్నతాధికారుల తనిఖీల్లో గుర్తిస్తారు. రికవరీకి పెడతారు. కొంతమందికి ఆర్నెల్లకు, ఏడాదికి జమయ్యే ఎరియర్స్‌లో కూడా ఎక్సెస్ జమవు తుంటాయి. ఇలా జమయ్యే మొత్తాలను కూడా వారి నుంచి రికవరీ చేస్తారు.
ఎస్టీవో నాగమల్లేశ్వర రావును విచారిస్తున్న ఏసీబీ ఏఎస్పీ కే.ఎం.మహేశ్వరరాజు (ఫైల్)
దర్జాగా దారిమళ్లించారు!
కానీ ఇలాంటి కేసుల్లో ఎస్‌టీఓల పేరిట డీడీ రూపంలో వసూలు చేసే మొత్తాలను ప్రభుత్వ ఖాతా (పద్దు 2071)కు జమ చేయకుండా తన పేరిట ఉన్న కరెంట్ ఖాతాకు మళ్లించి దర్జాగా డ్రా చేస్తున్నట్టుగా ఏసీబీ అధికారులు విచారణలో గుర్తించారు. ఇలా కేవలం ఏడాది వ్యవధిలోనే ప్రభుత్వ ఖాతాకు జమ కావాల్సిన రూ.29 లక్షలు, ఎస్టీఒ నాగమల్లేశ్వరరావు తన ఖాతాకు మళ్లించుకుని డ్రా చేసుకున్నట్టుగా లెక్క తేల్చారు.
ఒక్క ఏడాదిలోనే ఇంతపెద్ద మొత్తంలో అవినీతి బయటపడితే ఇక ఆయన ఇక్కడకు వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తే కనీసం కోటిన్నరకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దీని వెనుక జిల్లా ట్రెజరీ ఉన్నతాధి కారి హస్తం కూడా ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. సదరు ఉన్నతాధికారి ఏసీబీ అధికారులకు సహకరించడం లేదన్న ఆరోపణలు లేకపోలేదు.
లోతైన విచారణ జరుపుతున్నాం
తమకు అందిన ఫిర్యాదులపైనే బందరు ఎస్టీఒ కార్యాలయంలోతనిఖీలు చేశాం. స్వా«దీనం చేసుకున్న రికార్డులను పరిశీలిస్తే కేవలం ఏడాదిలోనే రూ.29 లక్షలు పక్కదారి పట్టినట్టుగా గుర్తించాం. గడిచిన నాలుగేళ్ల రికార్డులను పరిశీలించాలని నిర్ణయించాం.
–కె.ఎం.మల్లేశ్వరరాజు, ఏసీబీ ఏఎస్పీ
దర్యాప్తు చేపట్టాల్సి ఉంది
ఏసీబీ దాడి నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ ఆదేశాల మేరకు ఎస్టీఒలిద్దర్నీ సస్పెండ్ చేశాం. శాఖాపరమైన దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. సదరు ఖాతాలకు సంబంధించి బ్యాంకుల నుంచి రికార్డులను తీసుకుని విచారణ చేపడతాం.
–నాగమహేష్, డీడీ, జిల్లా ట్రెజరీస్
Comments
Please login to add a commentAdd a comment