మహిళ అనుమానాస్పద మృతి కేసులో నిందితుడి అరెస్టు
కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్, నాగార్జుననగర్ కాలనీ రోడ్డు నెంబరు–5లో గత శనివారం వెలుగుచూసిన మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భార్యపై అనుమానంతోనే హతమార్చి సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించి పరారయ్యాడు. సోమవారం ఎస్సై వెంకన్న కేసు వివరాలను వెల్లడించారు.
కాచిగూడకు చెందిన సచిన్ సత్యనారాయణ, టూగూర్ స్నేహలు 2021లో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమై 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బాబు పుట్టి చనిపోయాడు. ఈ క్రమంలో వారి మధ్య గొడవల కారణంగా కొద్ది రోజుల పాటు వేరుగా ఉండి నెల రోజుల క్రితమే తిరిగి నాగార్జుననగర్ కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య 7 నెలల గర్భవతి అని తెలుసుకున్న భర్త ఆమెను అనుమానించాడు. శారీరకంగా దూరంగా ఉన్నా గర్భం రావడంపై అనుమానం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో ఈనెల 16న తెల్లవారు జామున 5 గంటల సమయంలో మంచంపై పడుకున్న భార్య ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఘటన స్థలంలో సిలిండర్ ఆన్‌చేసి సహజమరణంగా చిత్రీకరించేందుకు యత్నించి పరారయ్యాడు. ఆమె మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు సోమవారం మృతురాలి భర్తను కాచిగూడలోని అతడి ఇంట్లో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తానే హతమార్చినట్లు నేరం అంగీకరించినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment