బోధన వృత్తి.. తాత ఇచ్చిన ఆస్తి
చిరునవ్వుల స్నేహశీలి సర్వేపల్లి
ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): పరిచయం అవసరం లేని వ్యక్తిత్వం.. అధ్యాపక వృత్తికే వన్నె తెచ్చిన ప్రతిభ.. భారతదేశానికి రాష్ట్రపతిగా పనిచేసిన గొప్ప తత్వవేత్త సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా ఆయన పనిచేశారు. సర్వేపల్లి మనుమడు గౌతమ్ రాధాకృష్ణన్ గురువారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. తాతతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ విశేషాలను ఆయన మాటల్లోనే విందాం.
బోధన వృత్తి.. తాత ఇచ్చిన ఆస్తి
తాత అధ్యాపకుడిగా ప్రపంచానికి పరిచయం అయ్యారు. మాలో 12 మంది వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నేనొక్కడినే అధ్యాపక వృత్తిలోకి వచ్చాను. ఆయన నుంచి నాకు వచ్చిన ఆస్తి అధ్యాపక వృత్తే.
వ్యక్తిగత జీవితం వేరు
మా తాతకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. మొత్తం 13 మంది మనుమలం. ఒకరు చనిపోగా ప్రస్తుతం 12 మంది ఉన్నాం. నేను చిన్న కుమార్తె కుమారుడిని. తాత వ్యక్తిగత జీవితానికి, వృత్తి పరమైన జీవితానికి వ్యత్యాసం ఉండేది. రెండింటికీ తగిన సమయం కేటాయించేవారు.
ఆడంబరాలకు దూరం
తాత ఎక్కువగా మాకు దగ్గరవడానికే ప్రయత్నించే వారు. ఎప్పుడూ మీరు అని సంభోదించడానికి ఇష్టపడే వారు కాదు. నువ్వు అని పిలవమనే వారు. సాధారణంగా ఉండాలని కోరుకునేవారు. ఏనాడూ ఆడంబరాలకు పోలేదు.
రూపాయి వేతనం తీసుకునే వారు
తాత రాష్ట్రపతిగా పనిచేసిన సమయంలో కేవలం ఒక రూపాయి వేతనంగా తీసుకునేవారు. రాష్ట్రపతి భవన్ లో ఒక పాత కారు ఉండేది. మా కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరు వచ్చినా స్టేషన్ నుంచి ఆ పాత కారులోనే తీసుకువచ్చేవారు. కారు తరచూ మరమ్మత్తులకు గురవుతున్నప్పటికీ.. అధికారిక వాహనాలను కుటుంబ అవసరాలకు ఎప్పుడూ వాడలేదు. ప్రత్యేకంగా వంటగది, వ్యక్తిగత వంట మనిషి ఉండేవారు. తాత వాడిన పాత కారు డ్రైవర్‌కు సొంతంగా వేతనం ఇచ్చేవారు.
తాతలో చిరునవ్వే చూశాను
ఆయనలో ఎప్పుడూ కోపం చూడలేదు. హాస్యంతో అందరినీ ఆనంద పరిచేవారు. గంభీరమైన సందర్భాలను సైతం ఆయన ఎంతో నవ్వుతూ స్వీకరించేవారు. ఆయనను నేను చాలా దగ్గరగా చూశాను. కుటుంబసభ్యుల పైనే కాదు.. ఎవ్వరిపైనా కోపగించుకోవడం నా జీవితంలో చూడలేదు. నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో మూడు దశాబ్దాల పైగా పనిచేశాను. దశాబ్ద కాలం వరకు నేను సర్వేపల్లి మనవడిననే విషయం ఎవ్వరికి తెలియదు.
అన్నం, చారు, అప్పడం
నేను చూసిన రోజుల్లో తాత ఎప్పుడూ భోజన ప్రియుడిగా కనిపించలేదు. ఎక్కడికైనా పార్టీలకు వెళ్లాల్సి ఉన్నా ఇంటిలో వండిన అన్నం, చారు, అప్పడం వంటి వాటితో భోజనం ముగించేవారు. సభా మర్యాద కోసం అందిరితో కలసి భోజనం వద్ద కూర్చునేవారు. ఎన్ని ఆహార పదార్థాలు ఉన్నా.. ఆయన మాత్రం పరిమితంగానే తినేవారు.
ఎక్కువగా గడిపా..తాతతో
చిన్నతనంలో ఎక్కువ సమయం తాతతో గడిపే అవకాశం వచ్చింది. నాకు ఊహ తెలిసిన నాటి నుంచి సుమారు 15 ఏళ్ల కాలం తాతను దగ్గరగా చూశాను. తాత వాస్తవిక దృక్పథం ఉన్న వ్యక్తి. రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ప్రసంగ పాఠాన్ని ఆయనే తయారు చేసుకునేవారు. ఒక రోజు గుండె సంబంధిత ప్రసంగం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. నేను అనుకోకుండా తాత గదిలోనికి వెళ్లాను. వెంటనే గుండె జబ్బులు ఎందుకు వస్తాయి అంటూ ప్రశ్నించారు. గుండె ఎలా పని చేస్తుంది, గుండె సమస్యలు ఎలా వస్తాయి అనే విషయాలు తెలియజేశారు. ఆయన పరిశోధన ఆసక్తికి ఈ సంఘటన నిదర్శనం.