GPC
-
ఫార్మా జీసీసీలకు భారత్ హబ్!
అంతర్జాతీయ ఫార్మా దిగ్గజాలు భారత్‌లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లను (జీసీసీ) ఏర్పాటు చేయడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. చాలా మటుకు ఎకానమీలు నెమ్మదిస్తున్న తరుణంలో దేశీయంగా రాజకీయ స్థిరత్వం, వినియోగం పటిష్టంగా ఉండటం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఇటీవలి ఎర్న్స్ట్ అండ్ యంగ్ నివేదిక ప్రకారం 2,500 పైచిలుకు సెంటర్లు, 45 లక్షలకు పైగా నిపుణులతో భారత్‌లో జీసీసీ మార్కెట్ పరిమాణం త్వరలో 100 బిలియన్ డాలర్ల మార్కును అధిగమించనుంది. ఇక లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ (ఎల్ఎస్హెచ్సీ) సెగ్మెంట్లో 2024లో 100 సెంటర్లు ఉండగా 2030 నాటికి వీటి సంఖ్య 160కి చేరనుంది. వీటిలో ఉద్యోగుల సంఖ్య 4,20,000కి చేరనుంది. భారత్‌లో టెక్నాలజీ నిపుణుల లభ్యత గ్లోబల్ కంపెనీలకు ఆకర్షణీయంగా ఉంటుండగా, ఇక్కడి వర్ధమాన స్టార్టప్ వ్యవస్థ కూడా జీసీసీల ఏర్పాటుకు మరో సానుకూలాంశంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి. నియామకాల జోరు.. డిమాండ్, వ్యూహాత్మక ప్రాధాన్యం పెరుగుతుండటం వంటి అంశాల కారణంగా ఫార్మా దిగ్గజాలు భారత్‌లోని తమ హబ్‌లలో జోరుగా నియామకాలు చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆఖరు నాటికి సనోఫీ తమ సిబ్బంది సంఖ్యను 1,700 నుంచి 2,600కి పెంచుకునే యోచనలో ఉంది. అలాగే నోవో నార్డిస్క్ కూడా తమ ఉద్యోగుల సంఖ్యను వార్షికంగా సుమారు 20 శాతం పెంచుకోవాలనే ప్రణాళికల్లో ఉంది. మరోవైపు, టకెడా సంస్థ.. ఆసియాలోనే తమ తొలి ఇన్నోవేషన్ కేపబిలిటీ సెంటర్‌ను (ఐసీసీ) బెంగళూరులో ఏర్పాటు చేసింది. తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించే యోచనలో ఉంది. ఈ ఏడాది ఆఖరు నాటికి ఉద్యోగుల సంఖ్యను 770కి పెంచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం సిబ్బంది సంఖ్య 340గా ఉంది. కొన్నాళ్లుగా భారత్‌లోని జీసీసీలు కేవలం ఖర్చులను ఆదా చేసే కేంద్రాలుగా మాత్రమే కాకుండా అదనపు విలువను కూడా జోడించగలిగే సామర్థ్యాలున్న సెంటర్లుగా ఎదుగుతున్నాయి. కొత్త ఆవిష్కరణలు, డిజిటల్ పరివర్తన, అంతర్జాతీయ వ్యూహాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. నిర్వహణపరమైన మద్దతుతో పాటు ఆర్అండ్డీ, డేటా సైన్స్ వంటి అంశాల్లో అత్యుత్తమ హబ్‌లుగా మారుతున్నాయి. పలు గ్లోబల్ ఫార్మా కంపెనీలు భారత్ వైపు చూస్తున్నప్పటికీ, నిపుణులైన సిబ్బందిని అట్టే పెట్టుకోవడం సవాలుగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.పెద్ద సంఖ్యలో ఉద్యోగులు.. దిగ్గజ కంపెనీల జీసీసీల్లో నియామకాలు కూడా భారీగానే ఉంటున్నాయి. బెంగళూరులోని నోవో నార్డిస్క్ గ్లోబల్ బిజినెస్ సరీ్వసెస్ (జీబీఎస్) సెంటర్లో 4,500 మంది ఉద్యోగులు ఉన్నారు. 100 పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ టీమ్‌కి ఇది తోడ్పాటు అందిస్తోంది. ఇక సనోఫీకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలుగు కీలక జీసీసీల్లో హైదరాబాద్ సెంటర్ కూడా ఒకటిగా నిలుస్తోంది. తయారీ నుంచి ఏఐ, డేటా అనలిటిక్స్, కొత్త టెక్నాలజీస్ వరకు వివిధ కార్యకలాపాలకు సహాయ సహకారాలు అందిస్తోంది. ఇక ఎలై లిల్లీ సంస్థకు హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో కూడా జీసీసీలు ఉన్నాయి. ఈ రెండు సెంటర్లలో కలిపి 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెరికా తర్వాత కంపెనీకి భారత్ అతి పెద్ద కేంద్రంగా ఉంటోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
వైఎస్ ఫొటో తిరిగి పెట్టనక్కర్లేదు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ లాంజ్ నుంచి తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటాన్ని యథాస్థానంలో పెట్టాల్సిన అవసరం లేదని శాసనసభ సాధారణ వ్యవహారాల కమిటీ(జీపీసీ) నిర్ణయించింది. శాసనసభలో ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ లేకుండా అధికార టీడీపీ, దాని మిత్రపక్ష బీజేపీ సభ్యులతో కూడిన జనరల్ పర్పసెస్ కమిటీ ఈ మేరకు తీర్మానించింది. మంగళవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసనసభ లాంజ్‌లో ఈ సమావేశం జరిగింది. అసెంబ్లీ లాంజ్‌లో ఏర్పాటు చేసిన దివంగత వైఎస్సార్ చిత్రపటాన్ని త్వరలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో తొలగించిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఈ అంశంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ రాయగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ నిరసనను తెలియజేశారు. ప్రతిపక్షానికి తగిన ప్రాతినిథ్యం కల్పించకపోవడమే కాకుండా లేని అంశాన్ని తెరమీదకు తెచ్చి కావాలని రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వెంటనే ఆ ఫోటోను యథాస్థానంలో పెట్టాలని డిమాండ్ చేశారు. 25 మంది సభ్యులున్న కమిటీలో ముగ్గురు ప్రతిపక్ష సభ్యులకే స్థానం కల్పించినందుకు నిరసనగా సమావేశాన్ని వైఎస్సార్సీపీ బహిష్కరించింది. ఈ విషయంలో విమర్శలు రాకుండా ఉండేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడిన కమిటీని నియమించి ఒక సంప్రదాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని పలువురు చేసిన సూచనలను కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. వైఎస్ ఫోటోను ఏకపక్షంగా తొలగించిన తీరు తప్పుడు సంకేతాలిచ్చాయని వ్యాఖ్యానించిన కొందరు సభ్యుల అభిప్రాయాన్ని తోసిపుచ్చారు. అధికార పార్టీకి చెందిన మెజారిటీ సభ్యులు వైఎస్ ఫొటోను తిరిగి యధాస్థానంలో పెట్టాల్సిన అవసరం లేదన్న మాటకు సమావేశం ఆమోదం తెలపడంతోపాటు తొలగించడాన్ని సమర్థించింది. కమిటీని నిరసిస్తూ జగన్మోహన్రెడ్డి రాసిన లేఖను సమావేశంలో సభ్యులందరికీ పంపిణీ చేశారు. సమావేశం అనంతరం చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ లాంజ్‌లో స్పీకర్ల ఫోటోలు తప్ప మరెవరి ఫోటోలను పెట్టొద్దని కోరినట్టు చెప్పారు. శాసనసభ లాంజ్‌లో వైఎస్సార్ చిత్రపటాన్ని నిబంధనలకు విరుద్ధంగా చేశారన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అసెంబ్లీ భవనాన్ని రెండు రాష్ట్రాలకు విభజించారని తెలిపారు. ఆ సమయంలో తెలంగాణకు వెళ్లిన కమిటీ హాళ్లలో ఉన్న పొట్టి శ్రీరాములు, టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటాలను ఆ రాష్ర్ట సిబ్బంది తొలగించి ఏపీకి అప్పగించారని, వాటి మాదిరిగానే మేకు ఊడిపోయిన వైఎస్ చిత్రపటాన్ని కూడా స్టోర్ రూమ్‌లో భద్రపరిచారని చెప్పారు. ఇంటి అద్దె పెంచండి ప్రస్తుతం హైదరాబాద్‌లో తాము నివాసం ఉండేందుకు ఇస్తున్న ఇంటి అద్దెను పెంచాల్సిందిగా స్పీకర్ కోడెలకు శాసనసభ్యులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యేల ఇళ్లకు రూ. 25 వేలు అద్దెగా చెల్లిస్తున్నారు. ఆ మొత్తాన్ని రూ. 50 వేలకు పెంచాల్సిందిగా ఎమ్మెల్యేలు కోరారు. తమకు కేటాయించిన గృహాల్లో సౌకర్యాలు సరిగా లేవని, వాటి మరమ్మతులకే ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోందని మంగళవారం జరిగిన జీపీసీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పారు. ఏపీ నూతన రాజధానిలో తమకు ఇంటి స్థలాలు కేటాయించాలని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు స్పీకర్‌ను కోరారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా విష్ణుకుమార్ రాజుకు స్పీకర్ సూచించారు.