గేట్లో మెరిసిన తెలుగుతేజం
సక్సెస్ స్పీక్స్
అందరూ నడిచే దారిలో నడకసాగించటం సాధారణం. కొత్త మార్గానికి బాటలు వేయాలనుకోవడం సాహసం. అదే తన విజయరహస్యం అంటున్నాడు మన తెలుగు తేజం గేట్ టాపర్ గోపు భరత్‌రెడ్డి. ఇటీవల ప్రకటించిన గ్రాడ్యూయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)-2014లో మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో మొదటిర్యాంకు సాధించాడు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రం ధన్‌బాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిష్టాత్మక పోటీ పరీక్ష గేట్లోటాప్ ర్యాంకు సాధించటంపై స్పందిస్తూ.. తన విజయ రహస్యాలను సాక్షితో పంచుకున్నారు.
ఊహించని ర్యాంకు
మంచిర్యాంకు వస్తుందనుకున్నా. టాప్ ర్యాంక్ రావటం చాలా సంతోషంగా ఉంది. ప్రణాళిక ప్రకారం ప్రిపరేషన్, సబ్జెక్టులపై పూర్తిస్థాయి పట్టుతో దీన్ని సాధించగలిగా. ఈ ర్యాంకు కెరీర్లో మరింత దూసుకెళ్లేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం ఇస్తుందని భావిస్తున్నా. చదువులో నేను మొదట్నుంచీ బెస్ట్స్టూడెంట్నే.
పేరెంట్స్.. బెస్ట్ ఫ్రెండ్స్
మాది కరీంనగర్ పట్టణంలోని రాంనగర్. నాన్న ఇంద్రసేనారెడ్డి బిల్డింగ్ మెటీరియల్ కాంట్రాక్టర్. అమ్మ లక్ష్మి గృహిణి. తమ్ముడు భార్గవ ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్నాడు. నేను పదో తరగతి వరకూ కరీంనగర్‌లోనే చదివా. ఇంటర్‌కు హైదరాబాద్ వచ్చా. ప్రస్తుతం ఇంజనీరింగ్ ఫైనలియర్ జార్ఖండ్‌లో చేస్తున్నా. ఫెయిల్యూర్.. సక్సెస్‌లలో అమ్మానాన్న ఇచ్చే మద్దతు చాలా ముఖ్యం. మా ఇంట్లో అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహమే మమ్మల్ని విజయం వైపు నడిపిస్తుంది. మాది మధ్య తరగతి కుటుంబం. అందుకే సంపదకన్నా చదువే విలువైనదనే భావన పెంచారు. పదోతరగతిలో 552/600, ఇంటర్ 946/1000 మార్కులు వచ్చాయి. జేఈఈలో 5,900 ర్యాంకుతో జార్ఖండ్ ఐఐటీలో సీటొచ్చింది. మొదట్నుంచి ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచన ఉండేది. అందుకే మైనింగ్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌లో చేరా.
కోచింగ్ తీసుకోలేదు
మొదటి సంవత్సరం నుంచే సబ్జెక్టులపై పట్టుసాధించేందుకు కృషి చేశా. ఏ రోజు సిలబస్‌ను ఆ రోజే పూర్తిచేసేవాణ్ని. వాయిదా వేయటం మరింత బద్దకాన్ని పెంచుతుందనేది నా నమ్మకం. అదే గేట్లో మంచిస్కోరు చేసేందుకు ఉపకరించింది. గేట్ కోసం ఎక్కడా కోచింగ్ తీసుకోలేదు. గతేడాది జాతీయస్థాయిలో 6వ ర్యాంకు సాధించిన నా సీనియర్ లీలాకృష్ణ సూచనలు ఉపకరించాయి.పరీక్షలో అధికశాతం ప్రశ్నలు మైనింగ్ సబ్జెక్టు నుంచే ఇచ్చారు. ఎక్స్‌ప్లోజివ్స్, కోల్డ్మైనింగ్, సేఫ్టీ, రాక్మెకానిజం వంటి అంశాల నుంచి ఇచ్చారు. జెమిన్, రతన్ తాటియా రాసిన బుక్స్ చదివా.
ప్రాక్టీసు చేయాలి
పోటీ పరీక్షల ప్రిపరేషన్ ఎప్పుడూ ఎగ్జామ్ ఓరియెంటెడ్‌గా ఉండాలి. సబ్జెక్టుపై కమాండింగ్తోనే మార్కులు సాధించాలనుకోవద్దు. థియరీపై అవగాహన పెంచుకుంటూ ప్రాబ్లమ్స్‌ను ఎక్కువ ప్రాక్టీసు చేయాలి. వీటన్నింటినీ మించి పాజిటివ్ థింకింగ్ ఎప్పుడూ కొత్త ఎనర్జీని అందిస్తుంది. ఫెయిల్యూర్స్ ఎదురైనపుడు ఆత్మవిశ్వాసాన్ని చెక్కుచెదరనీయకుండా చూసుకోవాలి.
మైనింగ్‌తో కెరీర్ అద్భుతం
దేశ, విదేశాల్లో పుష్కలమైన అవకాశాలున్న కోర్సు.. మైనింగ్ ఇంజనీరింగ్. మా సీనియర్లు చాలామంది ఉన్నత సంస్థల్లో మంచి హోదాలో పనిచేస్తున్నారు. పారిశ్రామిక రంగంలో కూడా కెరీర్‌ను ఉన్నతంగా మలచుకునే వీలున్న కోర్సు ఇది. గేట్ ర్యాంకుతో పీజీ, ఖరగ్‌పూర్ ఐఐటీలో చేరాలనుంది. ఎన్ ఎంబీసీ, జిందాల్, బిర్లా, కోల్ ఇండియా వంటి సంస్థలు మైనింగ్ కోర్సు పూర్తికాగానే జాబ్ ఆఫర్స్ ఇస్తున్నాయి. పోటీ పరీక్షలకు చదువుతూ వాటిల్లో విజయం సాధించి కెరీర్లో ఉన్నతంగా స్ధిరపడాలన్నదే నా లక్ష్యం!