విద్యార్థినుల తాగునీటి కష్టాలకు తెర
నందిగాం, న్యూస్‌లైన్: ఖమ్మం నగరానికి చెందిన వైద్యుడు జి.రఘుకిషోర్ దాతృత్వంతో నందిగాంలోని బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినుల తాగునీటి కష్టాలు తీరాయి. తన మాతృమూర్తి తోటకూర రజని స్మారకార్థం ఏర్పాటు చేసిన ‘నేను సైతం’ ఫౌండేషన్ ద్వారా సుమారు రూ.1.75 లక్షల వ్యయంతో పాఠశాలలో తాగునీటి పథకం నిర్మించారు.
ఆదివారం ఈ పథకాన్ని స్వయంగా ఆయన ప్రారంభించారు. ఈ సత్కార్యానికి ఫిబ్రవరి 4న సాక్షి ప్రధాన సంచికలో ‘నీటి కోసం కోటి కష్టాలు’ శీర్షికన వచ్చిన కథనం కారణమవటం విశేషం. విద్యార్థినులు ఎదుర్కొంటున్న కష్టాల గురించి ఈ కథనం ద్వారా తెలుసుకున్న రఘుకిషోర్ చలించిపోయారు. వెంటనే స్పందించి పాఠశాల ఆవరణలో రెండు బోర్లు, మోటారు, పైపులైను, ట్యాంకు నిర్మింపజేశారు.
సాయం చేయడంలో ఎంతో ఆనందం..
పాఠశాలలో నిర్మించిన తాగునీటి పథకాన్ని భగత్‌సింగ్ వర్థంతి సందర్భంగా ఆదివారం డాక్టర్ రఘుకిషోర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘సమాజం మనకేమిచ్చిందనేది ముఖ్యం కాదు.. సమాజానికి మనమేం చేశామన్నదే ముఖ్యం. ఉన్నంతలో ఇతరులకు సాయం చేయడంలో ఎంతో ఆనందం ఉంది’ అని చెప్పారు. మనం బాగుండాలి.. ఇతరులు బాగుండాలని తలచిననాడే ఎదుటివారికి సాయం చేయగలమన్నారు.
సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం చదివాక విద్యార్థినుల సమస్య తీర్చాలని సంకల్పించానని వివరించారు. అందుకే ఇంతదూరం వచ్చి పథకాన్ని ప్రారంభించానని తెలిపారు. విద్య, వైద్యం, పరిశుభ్రత కార్యక్రమాలకు సహాయమందిస్తుంటానని, ఏడాది కాలంగా విశాఖ, ఖమ్మం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో పలు కార్యక్రమాలు చేపట్టామని వివరించారు.
ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే సేవాగుణం అలవర్చుకోవాలని కోరారు. టెక్కలి ఆర్డీవో ఎ.శ్యామ్‌ప్రసాద్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా పాల్వంచలో తను పనిచేసినపుడు డాక్టర్ రఘుకిషోర్తో పరిచయముందని, ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఆనందం కలిగిస్తోందని చెప్పారు. కార్యక్రమంలో గురుకుల పాఠశాలల ఉపకార్యదర్శి(విశాఖ) టి.సరోజ, జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ బి.చంద్రావతి, ప్రిన్సిపాల్ కె.శ్రీదేవి, వైస్‌ప్రిన్సిపాల్ కె.వైకుంఠరావు పాల్గొన్నారు.