పౌరసేవలకు చిరునామా.. పోస్టాఫీస్!
- సేవల విస్తరణకు 55 వేల మంది గ్రామీణ్ డాక్ సేవక్స్ నియామకం
- తపాలా శాఖ కార్యదర్శి బి.వి.సుధాకర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: నిత్యం జనజీవనంతో ముడిపడిన చాలా వ్యవహారాలను నిర్వహించేందుకు తపాలా శాఖ సిద్ధంగా ఉందని తపాలాశాఖ కార్యదర్శి బి.వి.సుధాకర్ తెలిపారు. మందులు, పాఠ్యపుస్తకాల నుంచి నిరుద్యోగ అభ్యర్థుల వివరాల నమోదు, పాస్‌పోర్టు, ఆధార్‌కార్డు, బిల్లుల చెల్లింపు వరకు అన్నీ తపాలా కార్యాలయాల్లోనే అందుబాటులో ఉంచడం ద్వారా పోస్టాఫీసులను ప్రజలకు మరింత చేరువ చేయబోతున్నామని పేర్కొన్నారు. సోమవారం డాక్‌సదన్‌లో మాట్లాడుతూ గ్రామీణ్ డాక్ సేవక్స్ రూపంలో పోస్టాఫీసుల్లో కొత్తగా 55 వేల మందిని నియమిస్తున్నామని, తెలంగాణ, ఏపీకి చెందిన 1,800 మంది అభ్యర్థులు త్వరలో రాబోతున్నారని పేర్కొన్నారు. సెప్టెంబర్ నాటికి అన్ని ప్రధాన, ఉప తపాలా కార్యాలయాల్లో పోస్టల్ పేమెంట్ బ్యాంకులను అందుబాటులోకి తేనున్నట్టు వెల్లడించారు. తపాలా కార్యాలయాలను మినీ ఏటీఎంలుగా మారుస్తున్నా మని చెప్పారు.
స్పీడ్‌పోస్టు సేవలను 1,29,346 బ్రాంచి పోస్టాఫీసులకు విస్తరించనున్నామని పేర్కొన్నారు. వచ్చే మార్చి నాటికి 811 ప్రధాన తపాలా కార్యాలయాల్లో పాస్‌పోర్టుల జారీ ప్రారంభిస్తామని చెప్పారు. ఎంప్లాయిమెంట్ ఎక్సే్చంజీ కేంద్రాలుగా సేవలు ప్రారంభించామని, ఇప్పటికి 5,775 మంది వివరాలు నమోదు చేసుకున్నారని పేర్కొన్నారు. సొంతభవనాలున్న పోస్టాఫీసుల పైభాగంలో సోలార్ ప్యానెల్స్ ద్వారా సౌరవిద్యుత్ సమకూర్చుకుని కరెంటు బిల్లుల ఖర్చు తగ్గించే ప్రయత్నం చేస్తామన్నారు. పోస్టాఫీసుల్లో డిపాజిట్లను పెంచేందుకు ప్రజల్లోకి వెళ్తున్నామని చెప్పారు. తపాలా సిబ్బందికి కొత్త యూనిఫామ్ రూపొందించామని చెప్పారు. 50 పైసల పోస్టుకార్డుపై తపాలా రూ.9 మేర ఖర్చు చేస్తోందని, ధరల పెంపుపై అధ్యయనం చేస్తామని చెప్పారు.