కాంగ్రెస్ ఓటమే లక్ష్యం కుమారస్వామి ప్రకటన
బెంగళూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించడమే తన లక్ష్యమని, దీని కోసం ఎవరితోనైనా పొత్తులకు సిద్ధమని ప్రతిపక్ష నాయకుడు కుమారస్వామి ప్రకటించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను నాలుగైదు స్థానాలకు పరిమితం చేస్తామని ప్రతినబూనారు. బెంగళూరు గ్రామీణ లోక్‌సభ స్థానానికి ఈ నెల 21 జరుగనున్న ఉప ఎన్నికలో తన సతీమణి అనితకు మద్దతునివ్వాల్సిందిగా కోరడానికి హెచ్ఎస్ఆర్ లేఔట్‌లోని బీజేపీకి చెందిన మాజీ మంత్రి ఏ. నారాయణ స్వామి నివాసానికి మంగళవారం వచ్చారు. ఈ సందర్భంగా కుమార విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడు నెలలైనా కాకముందే అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.
ఉప ఎన్నికలు జరుగనున్న మండ్య, బెంగళూరు గ్రామీణల్లో ఇది కనబడుతోందని తెలిపారు. అడ్డదార్లలో గెలుపును సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్నారు. తమ అభ్యర్థికి మద్దుతునివ్వాలని బీజేపీ కార్యకర్తలను కోరినప్పుడు, తమ నాయకుని అనుమతి కావాలని చెప్పారని తెలిపారు. అందుకనే నారాయణ స్వామిని కలవడానికి వచ్చానన్నారు. బీజేపీ అభ్యర్థి రంగంలో లేనందున, తమ అభ్యర్థికి మద్దుతునివ్వాలని ఆ పార్టీ కార్యకర్తలు నిర్ణయించారని తెలిపారు. అంతేకానీ పొత్తులు లాంటివి ఏమీ లేవన్నారు. కాంగ్రెస్‌లో ఇప్పటికే వర్గ పోరు మొదలైందని, ఏడాదిలోగా ముఖ్యమంత్రి మారడమో లేక ప్రభుత్వం పడిపోవడమో సంభవిస్తుందని చెప్పారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించడానికి ఎవరెవరితో అవగాహన కుదుర్చుకోవాలో ఇంకా నిర్ణయించుకోలేదన్నారు.
నారాయణ స్వామి మాట్లాడుతూ తమ పార్టీకి జేడీఎస్‌తో ఎటువంటి పొత్తు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించడానికి ఇరు పార్టీల కార్యకర్తలు కలసి పని చేస్తున్నారని చెప్పారు. అనంతరం కుమారస్వామి అక్కడే అల్పాహారం తీసుకుని ప్రచారానికి బయల్దేరారు. ఈ సందర్భంగా బీజేపీ, జేడీఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో గుమికూడారు.