ఆ షోకు వెళితే రెప్పవాల్చరేమో?
బీజింగ్: మీరెప్పుడైనా చైనా వెళతారా.. వెళితే అక్కడ లింగ్షాన్ గ్రాండ్ బుద్ధ సెనిక్ ప్రాంతానికి తప్పక వెళ్లండి. ఎందుకంటే జ్ఞాన బుద్ధుడి ప్రతిమలు దర్శనం ఇవ్వడమే కాకుండా అబ్బురపరిచే దృశ్యాలు కనువిందు చేస్తాయి. ముఖ్యంగా అక్కడ ఉన్న ఒక పెద్ద కొలను నడిమధ్య లో ప్రత్యేకంగా రూపొందించిన తామరతో కూడిన పూర్ణకుంబంలాంటి ఆకృతి కనిపిస్తుంది. ఆ తామర రేకులు విచ్చుకుంటుండగా అందులో నుంచి బుద్ధుడు దర్శనమిస్తాడు. అలా కనిపిస్తూ నాలుగు దిక్కులు తిరుగుతుంటాడు. అలా బుద్ధ విగ్రహం తిరుగుతున్న క్రమంలో ఆ కొలనులోనే కింద ఏర్పాటుచేసిన తొమ్మిది డ్రాగన్లు బుద్ధుడికి స్నానం చేయిస్తాయి.
బుద్ధ బగవానుడికి పక్కనే మరో దేవదూత తన చంటి బిడ్డను చేతిలో పట్టుకొని దర్శనమిస్తుంది. అక్కడ కూడా నీటి దారలు రివ్వున ఎగిసి ఆ విగ్రహాన్ని తాకుతుంటాయి. ఆ వెంటనే ఈ రెండు విగ్రహాల నడుమ దూరంగా ఓ కొండల మద్యలో మరో విగ్రహం నుంచి భారీ లైటింగ్ వస్తుంది. అలా లైటింగ్ రావడంతోనే మొదలవుతుంది అసలైన లేజర్ షో.. దాన్ని చూసే ఎవ్వరైనా ముగ్దుల్వాల్సిందే. ప్రపంచంలోని ఎన్నో చోట్ల జరిగే లేజర్ షోల కంటే చైనాలోని ఇక్కడ జరిగే లేజర్ షోకే, స్థానికులు, పర్యాటకులు కుప్పలుగా వెళుతుంటారు. ఈ బుద్ధుడికి సఖ్యముని అని పేరు.