granite business
-
ఈడీ నోటీసులు.. సంబంధం లేదన్న గంగుల
సాక్షి, కరీంనగర్: తన కుటుంబ సభ్యులకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు అందించిందన్న పరిణామంపై రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు. తనకు నోటీసులేవీ రాలేదని.. నోటీసులు అందుకున్నట్లుగా చెబుతున్న శ్వేతా గ్రానైట్స్‌తో తనకేలాంటి సంబంధం లేదని అంటున్నారాయన. గంగుల కుటుంబ సభ్యుల కు చెందిన శ్వేతా గ్రానైట్స్ విదేశాలకు ఎగుమతుల విష యంలో ఫెమా నిబంధనలను ఉల్లంఘించిందన్న ఆరోపణలపై ఈడీ నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఈ అంశంపై ఈడీ వివరణ కోరినట్లు తెలియవచ్చింది. గతేడాది నవంబర్‌లో శ్వేతా గ్రానైట్స్ సంస్థలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించడం తెలిసిందే. చైనాకు గ్రానైట్ ఎగుమతుల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం రూ. 4.8 కోట్ల మేర ఫెమా నిబంధనల ఉల్లంఘనతోపాటు ప్రభుత్వానికి రూ. 50 కోట్లు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 3 కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఈ అంశంపై మంత్రి గంగుల మంగళవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ఈడీకి సంబంధించి తనకు నోటీసులేవీ రాలేదని, శ్వేతా గ్రానైట్స్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారమే శ్వేతా గ్రానైట్స్ లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. శ్వేతా గ్రానైట్స్‌కు ఈడీ నోటీసులనేవి 2008 నుంచి కొనసాగుతున్నవేనన్నారు. ఈ విషయంలో ఆ సంస్థ వ్యాపారం గురించి లేదా తన గురించి ఈడీకి ఎలాంటి సమాచారమైనా ఇస్తానని, పూర్తిగా సహకరిస్తానని మంత్రి సమాధానమిచ్చారు. ఇదీ చదవండి: ప్రసవాల్లో రికార్డు -
మంత్రి గుంగుల ఇంటికి సీబీఐ బృందం.. ఢిల్లీకి రావాలని సమన్లు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/ సాక్షి, న్యూఢిల్లీ: ‘నకిలీ సీబీఐ అధికారి’ వ్యవహారంలో విచారణకు హాజరు కావాలంటూ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో గురువారం ఢిల్లీలో అధికారుల ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. తాను సీబీఐ అధికారినంటూ తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యా ప్తంగా పలు ప్రాంతాల్లో మోసాలకు పాల్పడిన కొవి రెడ్డి శ్రీనివాసరావు లీలలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి వస్తున్న విషయం తెలిసిందే. అతడికి తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో సంబంధాలపై సీబీఐ ఆరా తీస్తోంది. ఈ క్రమంలో మంత్రి గంగుల, ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ వ్యాపారి, ఎంపీ వద్దిరాజు రవిచంద్రలతో పరిచయం ఉందని గుర్తించడంతో విచారణకు రావాలని ఆదేశించింది. బుధవారం ఉదయం ఇద్దరు సీబీఐ అధికారులు కరీంనగర్‌లోని గంగుల నివాసానికి వచ్చి సమన్లు అందించారు. రాష్ట్రంలో సీబీఐకి ఎంట్రీ లేదంటూ ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 51 జారీ చేసిన నేపథ్యంలో.. సీబీఐ అధికారులు రాష్ట్రంలో ప్రముఖులకు సమన్లు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కులం పేరుతో కుచ్చుటోపీ! విశాఖపట్టణంలోని చినవాల్తేరు కిర్లంపూడికి చెందిన కొవిరెడ్డి తాను ఐపీఎస్ అధికారినని, సీబీఐలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పుకొంటూ తిరిగేవాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులతో కులం పేరు చెప్పుకుని పరి చయం పెంచుకున్నాడు. తమ కులంవ్యక్తి కావడం, అతడి పటాటోపం చూసి ఒకరి వెనుక మరొకరు నమ్మేశారు. అందులో ఎంపీలు, మంత్రులు, ఎమ్మె ల్యేలూ ఉన్నారు. అయితే శ్రీనివాసరావు ఢిల్లీలో వ్యాపారాలు, ఇతర అవసరాలున్న వారిని ఎంచుకునేవాడు. ఢిల్లీలో తనకు మంచి పరిచయాలు ఉన్నాయని.. కొలువులు, పర్మిట్లు ఇప్పిస్తానని, కేసులు మాఫీ చేయిస్తానని నమ్మించేవాడు. ‘పని’ కావాలంటే ఖర్చవుతుందని చెప్పి విలువైన కాను కలు తీసుకునేవాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఢిల్లీలో పోర్టర్ అనే కంపెనీకి చెందిన దాదాపు 2వేల వాహనాలకు ఢిల్లీలో ‘నో ఎంట్రీ’ నిబంధనలు లేకుండా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ కేసులోనే శ్రీనివాసరావును ఢిల్లీలోని తమిళనాడు భవన్లో సీబీఐ అరెస్టు చేసింది. రాష్ట్ర నేతల పరిచయాలతో.. తెలుగు రాష్ట్రాల్లో ఓ కులానికి సంబంధించిన నేత లను బాగా నమ్మింపజేసిన శ్రీనివాసరావు.. వారిలో కొందరు ప్రముఖుల నుంచి భారీగా బంగారం, నగదు తీసుకున్నట్టు సీబీఐ గుర్తించింది. ఈ క్రమంలో అతడి ఫోన్లో వద్దిరాజు రవిచంద్ర, ఆయనకు బంధువైన మంత్రి గంగుల కమలాకర్‌లతో కలిసి తీసుకున్న ఫొటోలు లభించినట్టు సమాచారం. దీనికితోడు గతంలో ఈడీ అధికారిని అంటూ మంత్రి గంగుల కమలాకర్‌ను ఓ అజ్ఞాత వ్యక్తి మోసం చేసేందుకు ప్రయత్నించిన విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో ఏవైనా లావాదేవీలు నడిచాయా అని సీబీఐ అనుమానిస్తోందని సమాచారం. శ్రీనివాసరావుతో నాకేం సంబంధం లేదు ఇటీవల కొన్ని వేదికలపై శ్రీనివాసరావు కలిశాడే తప్ప అతడితో తనకేం సంబంధం లేదని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. సదరు శ్రీనివాసరావు తాను ఐపీఎస్ అధికారిని అంటూ పరిచయం చేసుకున్నాడని వివరించారు. ఢిల్లీ వెళ్లి ఇదే విషయాన్ని సీబీఐ ఆఫీసర్లకు చెబుతానన్నారు. చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. విచారణలో నందు పొంతనలేని సమాధానాలు -
ED Raids Telangana: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: గ్రానైట్ కంపెనీల్లో సోదాలపై ఈడీ కీలక ప్రకటన చేసింది. శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్, పీఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద్ గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీస్‌లో రెండు రోజులు సోదాలు జరిపినట్లు వెల్లడించింది. హైదరాబాద్, కరీంనగర్‌లోని పలుచోట్ల సోదాలు చేసినట్లు పేర్కొంది. ఫెమా నిబంధనల ఉల్లంఘనపై ఈడీ సోదాలు నిర్వహించింది. రాయల్టీ చెల్లించిన దానికంటే ఎక్కువ గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేసినట్టు ఈడీ గుర్తించింది. సోదాల్లో రూ.1.8 కోట్ల నగదు ఈడీ సీజ్ చేసింది. ఉద్యోగులతో బినామీ అకౌంట్లు తెరిచినట్లు అధికారులు గుర్తించారు. పదేళ్లుగా భారీగా హవాలా లావాదేవీలు జరిపినట్లు తేలింది. చైనా, హాంకాంగ్‌కు చెందిన కంపెనీల పాత్రపై ఈడీ ఆరాతీసింది. ఎలాంటి పత్రాలు లేకుండా చైనా సంస్థల నుంచి నగదు మళ్లించడాన్ని గుర్తించినట్టు ఈడీ వెల్లడించింది. చదవండి: మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే -
కర్రలతో కొట్టి.. బండరాయితో మోది..
సాక్షి, కోదాడ రూరల్/ఖమ్మం : అర్ధరాత్రి ముగ్గురు దుండగులు దురాఘతానికి తెగబడ్డారు. ఓ గ్రానైట్ క్వారీ వ్యాపారిని కర్రలతో కొట్టి.. బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్ శివారులో చోటుచేసుకుంది. ఓ మహిళ, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన వెనిశెట్టి రంగనాథ్ (43) గ్రానైట్ క్వారీ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరి కుటుంబం 35 ఏళ్ల క్రితం తమిళనాడు నుంచి వలస వచ్చి ఖమ్మం జిల్లా కేంద్రంలోని వీడీవోస్ కాలనీలో స్థిరపడింది. కాగా రంగనాథ్ బొలేరో వాహనంలో సమీప బంధువైన ఓ మహిళతో ఆదివారం రాత్రి 10గంటల సమయంలో శాంతినగర్ నుంచి అనంతగిరికి వెళ్లే మార్గంలోని ఓ బండ సమీపంలోకి చేరుకున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా ముగ్గురు దుండగులు వచ్చి రంగనాథ్‌తో గొడవ పడుతూ కర్రలతో దాడి చేశారు. దీంతో భయాందోళన చెందిన మహిళ అక్కడనుంచి పరుగులు తీసింది. దుండుగుల నుంచి తప్పించుకునేందుకు రంగనాథ్ పొలాల గుండా పరిగెత్తినట్లు ఘటన స్థలి పరిశీలిస్తే అవగతమవుతోంది. బండరాయితో తలపై మోదడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతిచెందినట్లు తెలుస్తోంది. పోలీసుల అదుపులో మహిళ.. ఆదివారం రాత్రి రంగనాథ్‌తో వచ్చిన మహిళ సోమవారం ఉదయం అదే దారిలో వచ్చి వెతుకుతూ జనం గుమిగూడిన ప్రదేశానికి చేరుకుంది. రంగనాథ్ మృతదేహాన్ని చూసి బోరుమంటూ రాత్రి జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించింది. ఆమె చెప్పిన వివరాలతో బంధువులు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరింత సమాచారం రాబట్టేందుకు సదరు మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుండగులెవరో ఎవరో తనకు తెలియదని ఆమె చెప్తున్నట్లు సమాచారం. రంగనాథ్ కాల్‌లిస్ట్‌లో నంబర్ల ఆధారంగా కూడా విచారణ చేస్తున్నారు. హత్యకు కారణ ం వివాహేతర సంబంధమా..? వ్యాపార లావాదేవీలా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా రంగనాథ్‌తో ఉన్న మహిళ ఆదివారం రాత్రే కోదాడ బస్టాండ్ సమీపంలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆ ప్రాంతం తమ పరిధి కాదని, అనంతగిరి ఠాణాలో ఫిర్యాదు చేయాలని పట్టణ పోలీసులు చెప్పడంతో వెళ్లిపోయినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రైతులు గమనించి.. బండరాయిపై ధాన్యం ఆరబోసిన రైతులు సోమవారం ఉదయం అక్కడికి వచ్చారు. మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రూరల్ సీఐ శివరాంరెడ్డి, ఎస్ఐ సైదులు, చిలుకూరు ఎస్ఐ నాగభూషణరావు, సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. హతుడు ఖమ్మం జిల్లాకు చెందిన గ్రానైట్ క్వారీ వ్యాపారి వెనిశెట్టి రంగనాథ్‌గా గుర్తించారు. నల్లగొండ నుంచి క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఘటన స్థలంలో మద్యం బాటిళ్లను, హత్యకు ఉపయోగించిన కర్రలు, తలపై మోదిన రాయిని స్వాధీనం చేసుకున్నారు. రక్తపు మరకల వాసన చూసిన అనంతరం జాగిలం శాంతినగర్ నుంచి మొగలాయికోట దారి వరకు వెళ్లి ఆగిపోయింది. మృతుడి కుమారుడు బాలాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కోవిడ్-19తో కరీంనగర్ గ్రానైట్‌కు దెబ్బ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనాను అతలాకుతలం చేస్తున్న కోవిడ్ (కరోనా) వైరస్ ప్రభావం కరీంనగర్‌పై పడింది. ప్రతినెలా చైనాకు రూ.100 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్‌లను ఎగుమతి చేసే కరీంనగర్ వ్యాపారులు.. అక్కడ వైరస్ విజృంభించడంతో వ్యాపారం ఆగిపోయి ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ నుంచి గత డిసెంబర్ వరకు ఎగుమతి అయిన గ్రానైట్ రాయికి సంబంధించిన చెల్లింపులు జనవరి 20వ తేదీ నుంచి నిలిచిపోయాయి. చైనా నూతన సంవత్సరం జనవరి 24వ తేదీ కావడంతో.. ఆ దేశంలో జనవరి 20 నుంచి 15 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. పరిశ్రమలకు సెలవులు కావడంతో కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులకు చెల్లింపులు ఆగిపోయాయి. (చదవండి: ప్రపంచంపై పిడుగు) సెలవులు ముగిసి యథావిధిగా కార్యకలాపాలు సాగాల్సి ఉన్నప్పటికీ.. కోవిడ్ వైరస్ ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో అక్కడి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కాగా కోవిడ్ వైరస్ మరింత పెచ్చుమీరి మృతుల సంఖ్య వెయ్యి దాటడం, వైరస్ సోకిన వారి సంఖ్య లక్షకు సమీపిస్తుండటం తో ఫిబ్రవరి 13వ తేదీ నుంచి సెలవులను నిరవధికంగా పొడిగించారు. ఆ ప్రభావం కరీంనగర్ గ్రానైట్ వ్యాపారంపై పడింది. ఇప్పటికే కరీంనగర్‌కు సంబంధించి మన దేశ కరెన్సీలో సుమారు రూ.120 కోట్ల వరకు చెల్లింపులు ఆగిపోయినట్లు గ్రానైట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చెల్లింపులు జరిగితే తప్ప ఇక్కడ గ్రానైట్ క్వారీలు, స్టోన్ కట్టింగ్ యూనిట్ల వ్యాపారం నడిచే పరిస్థితి లేదు. డబ్బుల రొటేషన్ లేక ఉత్పత్తి నిలిచిపోవడం గ్రానైట్ రంగానికి పెద్ద దెబ్బగా వ్యాపారులు పేర్కొంటున్నారు. బయ్యర్లు వస్తేనే వ్యాపారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని చొప్పదండి, కరీంనగర్, పెద్దపల్లి, మానకొండూరు, హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో గ్రానైట్ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. సుమారు 200 మందికి పైగా క్వారీ యజమానులు ఈ వ్యాపారంలో ఉన్నారు. ఇక్కడ లభించే గ్రానైట్ రాయిని బ్లాక్‌లుగా కట్ చేసి చైనాకు తరలిస్తారు. చైనాలోని ‘షియామిన్’నుంచి వచ్చే బయ్యర్లు ఇక్కడి రాయిని పరీక్షించి, తమకు అవసరమైన మేర బ్లాక్‌లకు ఆర్డర్ చేసి, అడ్వాన్స్‌లు చెల్లించి వెళతారు. ఇలా ప్రతి నెలా 25 మంది చైనా నుంచి బయ్యర్లు కరీంనగర్ రావడం, కరీంనగర్ నుంచి గ్రానైట్ వ్యాపారులు చైనా వెళ్లడం జరుగుతుంది. ఈ రాకపోకల వల్ల ప్రతినెలా సగటున 2 లక్షల టన్నుల గ్రానైట్ రాయి చైనాకు తరలుతోంది. భారత మార్కెట్లో రూ. 80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఇక్కడ వ్యాపారం జరుగుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం కోవిడ్ ఎఫెక్ట్‌తో చైనా, భారత్‌లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద దెబ్బ కోవిడ్ వైరస్ ఎఫెక్ట్‌తో చైనాలో నిర్మాణ రంగం కుదేలైంది. చైనాకు రాకపోకలు లేకపోవడం, కొంత వ్యాపారం జరిగే హాంకాంగ్‌లో సైతం ఇదే పరిస్థితి ఉండటంతో కరీంనగర్ క్వారీల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ వైరస్ ప్రభావంతో.. గ్రానైట్ వ్యాపారం ఇప్పట్లో కుదుటపడే పరిస్థితి లేదని కరీంనగర్ గ్రానైట్ వ్యాపారుల సంఘం నాయకుడు రాచకొండ తిరుపతి గౌడ్ ‘సాక్షి’తో చెప్పారు. కరీంనగర్‌కు చెల్లింపులు జరిగితేనే వ్యాపారం సాగుతోందని, లేకుంటే అథోగతి పాలవడం ఖాయమని వైష్ణవి గ్రానైట్స్ యజమాని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు. -
కదులుతున్న అక్రమాల డొంక
సాక్షి.మార్టూరు(ప్రకాశం) : మండల కేంద్రం మార్టూరులో పది రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో నకిలీ వేబిల్లుల వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మార్టూరు బైనీడి కాలనీలోని ఓ యువకుడికి చెందిన గ్రానైట్ ముడిరాయి లారీని గత గురువారం సంతమాగులూరు పోలీసులు స్వాధీనం చేసుకుని తనిఖీ చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా తెలంగాణ రాష్ట్రానికి వెళ్తున్నట్లు గుర్తిం చి వాహనానికి చెందిన యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. అధికారుల విచారణలో ఆ యువకుడు పది మందికి చీకటి వ్యాపారుల వివరాలు చెప్పడంతో తీగ లాగితే మార్టూరు, బల్లికురవ మండలాల్లో డొంక కదలడం ప్రారంభించింది. అంతేగాక ఆ యువకుడు తనను పోలీసు కేసు నుంచి తప్పించకుంటే ఈ వ్యాపారంలో ము ఖ్యులైన వారి అసలు రంగు బయట పెడతానని బెదిరించడంతో కొందరు ముఖ్యులు అండర్ గ్రౌండ్‌కు వెళ్లినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు అత్యంత సన్నిహితుడు, ఆయన స్వగ్రామం కోనంకికి చెందిన ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ యువకుడి సోదరి శనివారం సాయంత్రం స్థానిక పోలీసుస్టేషన్ వద్ద హల్చల్ చేయబోయి సర్దుకుంది. ఏలూరి తమ అనుచరుడిపై అధికార పార్టీ తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేస్తుందనే కోణంలో రగడ చేసేందుకు రంగం సిద్ధం చేయబోతున్నట్లు సమాచారం. పోలీసుల వలలో త్వరలో కొన్ని తిమింగలాలు పడనున్నట్లు మార్టూరులో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
గ్రానైట్ వాణిజ్యంతో ఖజానాకు గండి
సాక్షి, విజయవాడ: వాణిజ్యపన్నులశాఖలో క్రిందస్థాయి సిబ్బంది చేతివాటం ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. రాజధాని ప్రాంతంలో వసూలు కావాల్సిన లక్షలాది రూపాయలు పక్కదారి పడుతున్నాయి. నగరం మీదగా వెళ్లే లారీలను తనిఖీ చేసి వేబిల్లులు సరిగా లేని, పన్నుల చెల్లించని లారీలపై కేసులు నమోదు చేసి భారీగా జరిమానాలు వేసేందుకు అధికారులు ప్రయత్నింస్తుంటే.. తమకున్న అనుభవంతో అధికారుల కళ్లు కప్పి లారీలను ఈశాఖలో పనిచేసే డ్రైవర్లు, అటెండర్లు తప్పిస్తున్నారు. రూ. 6 లక్షల గ్రానైట్ ఎగుమతి ఒంగోలు నుంచి మహారాష్ట్రకు గ్రానైట్ భారీగా ఎగుమతి అవుతుంది. ప్రతి నిత్యం పది నుంచి 15 లారీల్లో గ్రానైట్ రవాణా జరుగుతుంది. ఒక్కో లారీలో కనీసం రూ.6 లక్షలు విలువైన గ్రానైట్ రాళ్లు ఎగుమతి జరుగుతాయి. గ్రానైట్‌పై జీఎస్టీ 18శాతం. ఈ లెక్కన కనీసం ఒక్కో లారీకి రూ.లక్ష వరకు పన్ను వసూలు కావాలి . అయితే అంత పన్ను చెల్లించడానికి డీలర్లు సుముఖంగా వుండటం లేదు. దీంతో దొడ్డిదారిలో సరుకు పంపేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికారులు స్వాధీనం చేసుకున్న గ్రానైట్ లారీలు (ఫైల్) ‘కోటీ’శ్వరుడు తలుచుకుంటే.... వాణిజ్యపన్నులశాఖలో అధికారులు వద్ద ఒక డ్రైవర్ ఎంతోకాలంగా పనిచేస్తున్నాడు. ఆయన డిపార్టుమెంట్లో తాత్కాలిక ఉద్యోగులు, డ్రైవర్లు, అటెండర్లతో ఒక టీమ్‌ను తయారు చేశారు. ఈ కోటీశ్వరుడు తలుచుకుంటే చాలు... గ్రానైట్ తో పాటు ఏ సరుకు రవాణా చేసే లారీనైనా సురక్షితంగా జిల్లాను దాటిస్తారని డీలర్ల నమ్మకం. ఒంగోలు, గుంటూరు మీదగా తాడేపల్లికి వచ్చే లారీల డ్రైవర్లు ముందుగా ఈ టీమ్‌లోని వారి సమాచారం అందిస్తారు. వారి ద్వారా టీమ్ లీడర్‌కు సమాచారం అందుతుంది. ఆ రోజు ఏ అధికారి ఎక్కడ వాహనాలు తనిఖీ (వీటీ) చేస్తున్నారో తెలుసుకుని ఆ మార్గంలో కాకుండా మరోక మార్గంలో లారీలను కంచికచర్ల, పెనుగంచిప్రోలు వరకు తప్పిస్తారు. అక్కడ నుంచి హైదరాబాద్ రూట్లో మహారాష్ట్ర వెళ్లేలా ఏర్పాటు చేస్తారు. తాడేపల్లి నుంచి ఒక్కక్క లారీని కాకుండా ఆరేడు లారీలను ఒకేసారి తీసుకువచ్చి తప్పిస్తారని ఆశాఖలోనే చర్చించుకుంటున్నారు. కాగా అధికారులు అనుమానం రాకుండా ఒకటి రెండు లారీలను ఈ రూట్లోకి పంపుతారు. మిగిలిన వాటిని మరో మార్గంలో తప్పిస్తారు. గతంలో ఇదే తరహాలో పట్టుకున్న వ్యాన్‌ను తప్పించగా.. ఆగ్రహించిన డీసీటీవో ఒకరు పోలీసుస్టేషన్లో ఫిర్యాదుకు సిద్ధమయ్యారు. దీంతో అధికారులు కన్ను గప్పి తప్పిపోయిన వ్యాన్‌ను వెంటనే వెనక్కు రప్పించిన ఘనత ఈటీమ్ నాయకుడుకు ఉంది. లారీ యజమానులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి లారీని పట్టిస్తారని, అలాగే తప్పిస్తారని చెబుతున్నారు. ప్రతిదానికీ ఒకో రేటు ఒక్కో గ్రానైట్ లారీని సురక్షితంగా తప్పిస్తే రూ.5వేలు వరకు వసూలు చేస్తారు. ఈ విధంగా ఆ డ్రైవర్ ‘కోటీశ్వరుడు’ అయ్యారని వాణిజ్యపన్నులశాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు తన వద్ద టీమ్‌ను మెయిటెన్ చేస్తూ రోజుకు ఐదు నుంచి 8 లారీల వరకు తప్పిస్తారని చెబుతున్నారు. కేవలం గ్రానైట్ కాకుండా నగరానికి వచ్చే రెడీమేడ్, ఎలక్రిక్టల్, ఎలక్ట్రానిక్ వంటి వస్తువుల లారీలను తప్పిస్తారు. అయితే ప్రతిదానికి ఒక రేటు ఉంటుంది. లారీలను అధికారులు పట్టుకున్నప్పుడు తక్కువ జరిమానాతో బయట పడే మార్గాన్ని చెబుతారని సమాచారం. తానే వీటీలు చేయిస్తూ.... అధికారులు అప్రమత్తంగా లేని సమయంలోనూ, నగరంలో వాహనాలు తనిఖీ(వీటీ)లు జరగనప్పడు ఆయనే ఒక మహిళను ఒక కారులో కూర్చుబోట్టి డీసీటీఓగా కారులో ఉన్నారంటూ లారీలను ఆపి తనిఖీలు చేసి వారి వద్ద మామూళ్లు తీసుకుని వదిలివేస్తారని సమాచారం. కాగా ఈ టీమ్‌లోని సభ్యుల ఫోన్ నెంబర్లు ట్రాకింగ్‌పెడితే అనేక వాస్తవాలు వెల్లడవుతాయని ఆశాఖ సిబ్బందే చెబుతున్నారు. -
గ‘లీజు’ !
భీంగల్ మండలంలో ఎంతో విలువైన కలర్ గ్రానైట్ నిల్వలున్నాయి. ఇక్కడే ప్రత్యేకంగా లభించే ఈ గ్రానైట్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. చైనా వంటి దేశాలకు గ్రానైట్ ఎగుమతి అవుతుంది. దీంతో మండలంలోని మెండోరా శివారులో గ్రానైట్ తవ్వకం లీజు కోసం 2012లో ఓ బడా కంపెనీ దరఖాస్తు చేసుకుంది. ఎన్ఓసీ ఇచ్చేందుకు స్థలాన్ని పరిశీలించిన రెవెన్యూ అధికారులు అక్కడ వ్యవసాయ భూములు, పంట పొలాలు దెబ్బతింటాయని, సమీపంలోనే గుడి, పాఠశాల కూడా ఉండటంతో గ్రానైట్ తవ్వకానికి వీలు లేదని నివేదిక ఇచ్చింది. దీంతో ఫైల్ పెండింగ్ పడిపోయింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఇదే లీజు కోసం ఆ బడా గ్రానైట్ కంపెనీ పావులు కదుపుతోంది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : గ్రానైట్ తవ్వకాల్లో రూ.కోట్లు దండుకోవడానికి అలవాటుపడిన బడా కంపెనీ లీజు కోసం పట్టు వదలని ప్రయత్నం చేస్తోంది. అక్కడ గ్రానైట్ తవ్వడానికి వీలు పడదని అధికారులు తేల్చి చెప్పి, నివేదిక ఇచ్చినప్పటికీ., అదే క్వారీ లీజు కోసం ఈ కంపెనీ ఆరేళ్ల తర్వాత కూడా మళ్లీ ప్రయత్నాలు సాగిస్తుండటం భూగర్భ గనుల శాఖలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. రూ.కోట్లు విలువ చేసే కలర్ గ్రానైట్‌ను ఎలాగైనా తవ్వుకుని తీసుకెళ్లేందుకు కంపెనీ సామ, ధాన, దండోపాయాలను వినియోగిస్తోంది. జిల్లాలోని భీంగల్ మండలంలో ఎంతో విలువైన కలర్ గ్రానైట్ నిల్వలున్నాయి. కేవలం నిజామాబాద్ జిల్లాలోనే ప్రత్యేకంగా లభించే ఈ గ్రానైట్‌కు పెద్ద ఎత్తున డిమాండ్ ఉంటుంది. చైనా వంటి దేశాలకు గ్రానైట్ ఎగుమతి అవుతుంది. ఇప్పటికే జిల్లాలో పలు బడా కంపెనీలు ఏళ్ల తరబడి గ్రానైట్ తవ్వకాలు సాగిస్తున్నాయి. వీటికి తోడు మరికొన్ని కంపెనీలు కూడా కొత్త లీజుల కోసం ప్రయత్నాలు చేశాయి. ఇందులో భాగంగా భీంగల్ మండలం మెండోరా శివారులో ఉన్న ఓ లీజు కోసం 2012లో ఓ బడా కంపెనీ దరఖాస్తు చేసుకుంది. దరఖాస్తును పరిశీలించిన భుగర్భ గనుల శాఖ అధికారులు ఎన్ఓసీ కోసం రెవెన్యూ అధికారులకు రాశారు. స్థలాన్ని పరిశీలించిన ఆ శాఖ అధికారులు అక్కడ గ్రానైట్ తవ్వకాలు జరపడానికి వీలులేదని (ఎఫెక్టెడ్) నివేదిక ఇచ్చారు. అలా తవ్వితే చుట్టుపక్కన ఉన్న వ్యవసాయభూములు, పంట పొలాలు దెబ్బతింటాయని నివేదికలో పేర్కొన్నారు. సమీపంలోనే గుడి ఉందని, తద్వారా గుడికి వచ్చే భక్తులకు ఇబ్బందులు వస్తాయని తేల్చింది. విద్యార్థులు చదువుకునే పాఠశాల కూడా ఉండటంతో ఇక్కడ తవ్వడం నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. సుమారు ఆరేళ్ల క్రితం నివేదిక ఇవ్వడంతో లీజు మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా ఇప్పుడు ఇదే లీజు కోసం బడా గ్రానైట్ కంపెనీ పావులు కదుపుతోంది. ఎలాగైనా తమకు లీజు మంజూరు చేసేందుకు గల మార్గాలను అన్వేషిస్తోంది. ఆరేళ్ల తర్వాత.. సుమారు ఆరేళ్ల క్రితం తిరస్కరించిన గ్రానైట్ లీజు దరఖాస్తు ఫైలును ఆ శాఖ అధికారులు పక్కనబెట్టేశారు. తాజాగా ఈ బడా కంపెనీ లీజు కోసం ప్రయత్నాలు ప్రారంభించడంతో ఫైలుకు కాల్లోచ్చాయి. కదలిక షురువైంది. గతంలో తిరస్కరించిన లీజును ఎలాగైనా మంజూరు చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఏదైనా దొడ్డి దారిన లీజు పొందేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయ ఒత్తిడి.. ఈ గ్రానైట్ లీజు మంజూరు కోసం బడా కంపెనీ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తోంది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ కీలక ప్రజాప్రతిని«ధి సహాయంతో లీజు పొందేందుకు పెద్ద స్థాయిలో పావులు కదుపుతోంది. మొత్తం మీద స్థానిక గ్రామ ప్రజల జీవనానికి ప్రశ్నార్థకంగా మారే ఈ గ్రానైట్ లీజు మంజూరు విషయంలో అధికారులు ఎలా వ్యవహరిస్తారో అనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ విషయమై ‘సాక్షి’ప్రతినిధి భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణను సమాచారం ఇవ్వాలని కోరగా ఆయన స్పందించేందుకు నిరాకరించారు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే కార్యాలయం సమాచారం ఇవ్వడం కుదరదని, ఈ విషయంలో తామేమీ మాట్లాడేందుకు వీలు లేదని, ఏదైనా ఉంటే జిల్లా కలెక్టర్‌ను సంప్రదించాలని సెలవిచ్చారు. -
రూ.2 కోట్లిస్తే... చెక్‌పోస్టులు ఎత్తేయిస్తా!
గ్రానైట్ వ్యాపారం వ్యాపారులకే కాదు.. రాజకీయ నాయకులకూ కాసులు కురిపిస్తోంది. తాజాగా అధికార పార్టీ ప్లీనరీకి రెండు కోట్ల రూపాయలివ్వాలని, జిల్లాలో ఏ చెక్‌పోస్టు లేకుండా ఎత్తివేయిస్తానని ఓ అమాత్యుడు వ్యాపారులను కోరగా... అడిగిందే తడవుగా రూ.కోటి సమర్పించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ఈ చిత్రంలోని చెక్‌పోస్టు దృశ్యాలను చూశారా? గత నెల 16న జిల్లాలో మొత్తం 8 చోట్ల ఇలాంటి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నిజానికి రహదారులపై చెక్‌పోస్టుల ఏర్పాటు కొత్తేమీ కాదు. తనిఖీల్లో భాగంగా ఏర్పాటు చేసేవే. కానీ, ఈ 8 చెక్‌పోస్టుల ఏర్పాటు వెనుక మాత్రం మతలబు వేరే ఉందండోయ్. గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్, ఇతరత్రా అక్రమాలను అడ్డుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్టుల వెనుక కోటి రూపాయల విలువైన కథ ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కోటి రూపాయల కథా కమామిషు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం... గ్రానైట్ వార్ గ్రానైట్ క్వారీలు, లారీల ఓవర్‌లోడ్ వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని, జిల్లాలో రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయని గత నెల 12న రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు గొడవ చేశారు. తక్షణమే గ్రానైట్ పరిశ్రమ, లారీలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అధికార పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. సమావేశానంతరం మైనింగ్ అధికారులను పిలిచిన మంత్రి గ్రానైట్ ఓవర్‌లోడ్ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మూడు రోజుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు జెడ్పీ సమావేశం ముగిసిన మూడు రోజుల్లోనే గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్, ఇతరత్రా అక్రమాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా అధికారులు జిల్లాలో మొత్తం 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మైనింగ్, రవాణాశాఖతోపాటు పోలీస్, రెవెన్యూ అధికారుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్టులకు సంబంధించిన నిర్వహణ వ్యయాన్ని మైనింగ్‌శాఖ భరించేలా ఆదేశాలు జారీ చేశారు. అనుకున్నదే తడవుగా అధికారులు వారం రోజుల్లోనే 37 కేసులు నమోదు చేశారు. ప్లీనరీ నిధులిస్తే ఎత్తేయిస్తా... గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రానైట్ లారీలపై కేసులు నమోదు చేస్తుండటంతో బెంబేలెత్తిన గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లాకు చెందిన ఓ అమాత్యుడిని కలిసి లబోదిబోమన్నారు. వారు చెప్పిందంతా విన్న సదరు అమాత్యుడు ఈ నెల 9న ఆర్అండ్బీ అతిథిగృహంలో పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే సోదరుడు, అసోసియేషన్‌కు చెందిన ఇద్దరు ముఖ్య నేతలతోపాటు మైనింగ్ ఉన్నతాధికారితో సమావేశమయ్యారు. అక్టోబర్ 11న పార్టీ ప్లీనరీ సమావేశం ఉన్నందున నిర్వహణ కోసం రూ.2 కోట్ల నిధులివ్వాలని ప్రతిపాదించారు. తానెప్పుడూ గ్రానైట్ అసోషియేషన్ను డబ్బులు అడగలేదని, ప్లీనరీ నిర్వహణ, జనసమీకరణ తనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున డబ్బులు అడుగుతున్నానని, 24 గంటల్లోనే ఆ మొత్తాన్ని సమకూర్చాలని చెప్పుకొచ్చారు. అమాత్యుడు చెప్పిందంతా విన్న అసోసియేషన్ ప్రతినిధులు రెండ్రోజుల తరువాత గ్రానైట్ యజమానులందరితో ప్రత్యేకంగా సమావేశమై అమాత్యుడి ప్రతిపాదనను ముందుంచారు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అంతిమంగా సదరు అమాత్యుడికి ప్లీనరీ ఖర్చు పేరిట కోటి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. వెంటనే అమాత్యుడిని కలిసిన గ్రానైట్ అసోషియేషన్ ప్రతినిధులు గ్రానైట్ ఉత్పత్తి వ్యయం పెంపు, కరెంట్ కోతలతోపాటు చైనా మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో ఈ ఏడాది గ్రానైట్ పరిశ్రమ కుదేలైందని వివరించారు. ఈ తరుణంలో రూ.కోటికి మించి సాయం చేయలేమని విన్నవించుకున్నారు. కేసుల పేరిట వేధించడం సబబు కాదని వాపోయారు. అంతా విన్న సదరు అమాత్యుడు ప్లీనరీ ఫండ్ పేరిట కోటి రూపాయలు తీసుకునేందుకు అంగీకరించారు. డబ్బులు అందిన వెంటనే సీఎంతో మాట్లాడి చెక్‌పోస్టులు ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు. ప్లీనరీ వాయిదా.. ఆగిన చెల్లింపులు అమాత్యుడితో భేటీ అనంతరం గ్రానైట్ యజమానుల్లోని ముఖ్యులంతా సమావేశమై ఎవరెంత డబ్బులివ్వాలనే అంశంపై చర్చించారు. ఐదు బడా గ్రానైట్ సంస్థల యజమానులు ఒక్కొక్కరు రూ.5 లక్షలు, అంతకంటే తక్కువ టర్నోవర్ కలిగిన మరో 10 సంస్థల యజమానులు రూ.3 లక్షలు, మరో 6 సంస్థలు రూ.2 లక్షలు, మిగిలిన చిన్న చిన్న సంస్థల యజమానులు ఒక్కొక్కరు రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల చొప్పున ఇచ్చేలా తీర్మానం చేసుకున్నారు. అనుకున్నదే తడవుగా రూ.80 లక్షలు పోగుచేశారు. అక్టోబర్ 11న జరగాల్సిన ప్లీనరీ సమావేశం 18కి వాయిదా పడటం, అమాత్యుడు అందుబాటులో లేకపోవడంతో చెల్లింపులు జరగలేదు. ఆ తరువాత కొద్దిరోజులకే 18న జరగాల్సిన ప్లీనరీని కూడా వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడడంతో సదరు గ్రానైట్ ప్రతినిధులు ఆ మొత్తాన్ని తమ వద్దే ఉంచుకున్నారు. మొత్తం కోటి రూపాయలు జమయ్యాక అమాత్యుడిని కలవాలనే యోచనలో ఉన్నారు. కొనసాగుతున్న చెక్‌పోస్టులు గ్రానైట్ యజమానులతో అమాత్యుడి ఒప్పందం చేసుకున్న తరువాత కొద్ది రోజులపాటు చెక్‌పోస్టుల వద్ద గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వ్యవహరించారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు అక్కడికి రావడమే మానేశారు. పోలీసులు, రవాణాశాఖ అధికారులు విధులు నిర్వహిస్తూ నామమాత్రంగా కేసులు నమోదు చేశారు. ప్లీనరీ వాయిదా పడటం, నిధుల చెల్లింపు ఆగిపోవడంతో తాజాగా మళ్లీ కేసుల నమోదును వేగవంతం చేశారు. దీంతో నెలరోజుల్లోనే 206 కేసులు నమోదు చేయగా, అందులో 146 కేసులు గ్రానైట్ లారీలకు సంబంధించినవే కావడం గమనార్హం. కేసుల పేరిట మొత్తం రూ.23 లక్షలు జరిమానా విధించగా, అందులో రూ.20 లక్షలు మైనింగ్‌కు సంబంధించినవే కావడం విశేషం. గ్రానైట్ యజమానులు మాత్రం డబ్బులు పోగు చేసిన తర్వాత కూడా కేసులు పెట్టి వేధించడమేంటని లబోదిబోమంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు... ఒకటి, రెండ్రోజుల్లో సదరు అమాత్యుడిని గ్రానైట్ ప్రతినిధులు కలిసి ఆ మొత్తాన్ని అందజేసి చెక్‌పోస్టులు ఎత్తివేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.