సాక్షి ప్రతినిధి, కరీంనగర్: చైనాను అతలాకుతలం చేస్తున్న కోవిడ్ (కరోనా) వైరస్ ప్రభావం కరీంనగర్‌పై పడింది. ప్రతినెలా చైనాకు రూ.100 కోట్ల విలువైన గ్రానైట్ బ్లాక్‌లను ఎగుమతి చేసే కరీంనగర్ వ్యాపారులు.. అక్కడ వైరస్ విజృంభించడంతో వ్యాపారం ఆగిపోయి ఆందోళన చెందుతున్నారు. కరీంనగర్ నుంచి గత డిసెంబర్ వరకు ఎగుమతి అయిన గ్రానైట్ రాయికి సంబంధించిన చెల్లింపులు జనవరి 20వ తేదీ నుంచి నిలిచిపోయాయి. చైనా నూతన సంవత్సరం జనవరి 24వ తేదీ కావడంతో.. ఆ దేశంలో జనవరి 20 నుంచి 15 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. పరిశ్రమలకు సెలవులు కావడంతో కరీంనగర్ గ్రానైట్ వ్యాపారులకు చెల్లింపులు ఆగిపోయాయి.
(చదవండి: ప్రపంచంపై పిడుగు)
సెలవులు ముగిసి యథావిధిగా కార్యకలాపాలు సాగాల్సి ఉన్నప్పటికీ.. కోవిడ్ వైరస్ ప్రభావం తీవ్రరూపం దాల్చడంతో అక్కడి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కాగా కోవిడ్ వైరస్ మరింత పెచ్చుమీరి మృతుల సంఖ్య వెయ్యి దాటడం, వైరస్ సోకిన వారి సంఖ్య లక్షకు సమీపిస్తుండటం తో ఫిబ్రవరి 13వ తేదీ నుంచి సెలవులను నిరవధికంగా పొడిగించారు. ఆ ప్రభావం కరీంనగర్ గ్రానైట్ వ్యాపారంపై పడింది. ఇప్పటికే కరీంనగర్‌కు సంబంధించి మన దేశ కరెన్సీలో సుమారు రూ.120 కోట్ల వరకు చెల్లింపులు ఆగిపోయినట్లు గ్రానైట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చెల్లింపులు జరిగితే తప్ప ఇక్కడ గ్రానైట్ క్వారీలు, స్టోన్ కట్టింగ్ యూనిట్ల వ్యాపారం నడిచే పరిస్థితి లేదు. డబ్బుల రొటేషన్ లేక ఉత్పత్తి నిలిచిపోవడం గ్రానైట్ రంగానికి పెద్ద దెబ్బగా వ్యాపారులు పేర్కొంటున్నారు.
బయ్యర్లు వస్తేనే వ్యాపారం
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని చొప్పదండి, కరీంనగర్, పెద్దపల్లి, మానకొండూరు, హుస్నాబాద్, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో గ్రానైట్ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. సుమారు 200 మందికి పైగా క్వారీ యజమానులు ఈ వ్యాపారంలో ఉన్నారు. ఇక్కడ లభించే గ్రానైట్ రాయిని బ్లాక్‌లుగా కట్ చేసి చైనాకు తరలిస్తారు. చైనాలోని ‘షియామిన్’నుంచి వచ్చే బయ్యర్లు ఇక్కడి రాయిని పరీక్షించి, తమకు అవసరమైన మేర బ్లాక్‌లకు ఆర్డర్ చేసి, అడ్వాన్స్‌లు చెల్లించి వెళతారు. ఇలా ప్రతి నెలా 25 మంది చైనా నుంచి బయ్యర్లు కరీంనగర్ రావడం, కరీంనగర్ నుంచి గ్రానైట్ వ్యాపారులు చైనా వెళ్లడం జరుగుతుంది. ఈ రాకపోకల వల్ల ప్రతినెలా సగటున 2 లక్షల టన్నుల గ్రానైట్ రాయి చైనాకు తరలుతోంది. భారత మార్కెట్‌లో రూ. 80 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు ఇక్కడ వ్యాపారం జరుగుతోందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం కోవిడ్ ఎఫెక్ట్‌తో చైనా, భారత్‌లకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు.
ఇదే పరిస్థితి కొనసాగితే పెద్ద దెబ్బ
కోవిడ్ వైరస్ ఎఫెక్ట్‌తో చైనాలో నిర్మాణ రంగం కుదేలైంది. చైనాకు రాకపోకలు లేకపోవడం, కొంత వ్యాపారం జరిగే హాంకాంగ్‌లో సైతం ఇదే పరిస్థితి ఉండటంతో కరీంనగర్ క్వారీల యజమానులు ఆందోళన చెందుతున్నారు. కోవిడ్ వైరస్ ప్రభావంతో.. గ్రానైట్ వ్యాపారం ఇప్పట్లో కుదుటపడే పరిస్థితి లేదని కరీంనగర్ గ్రానైట్ వ్యాపారుల సంఘం నాయకుడు రాచకొండ తిరుపతి గౌడ్ ‘సాక్షి’తో చెప్పారు. కరీంనగర్‌కు చెల్లింపులు జరిగితేనే వ్యాపారం సాగుతోందని, లేకుంటే అథోగతి పాలవడం ఖాయమని వైష్ణవి గ్రానైట్స్ యజమాని శ్రీకాంత్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment