రూ.2 కోట్లిస్తే... చెక్‌పోస్టులు ఎత్తేయిస్తా! | Rs 2 ... cekpostulu etteyista Kotli! | Sakshi
Sakshi News home page

రూ.2 కోట్లిస్తే... చెక్‌పోస్టులు ఎత్తేయిస్తా!

Published Mon, Oct 27 2014 3:05 AM | Last Updated on Sat, Aug 25 2018 6:13 PM

రూ.2 కోట్లిస్తే... చెక్‌పోస్టులు ఎత్తేయిస్తా! - Sakshi

రూ.2 కోట్లిస్తే... చెక్‌పోస్టులు ఎత్తేయిస్తా!

గ్రానైట్ వ్యాపారం వ్యాపారులకే కాదు.. రాజకీయ నాయకులకూ కాసులు కురిపిస్తోంది. తాజాగా అధికార పార్టీ ప్లీనరీకి రెండు కోట్ల రూపాయలివ్వాలని, జిల్లాలో ఏ చెక్‌పోస్టు లేకుండా ఎత్తివేయిస్తానని ఓ అమాత్యుడు వ్యాపారులను కోరగా... అడిగిందే  తడవుగా రూ.కోటి సమర్పించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ :
 ఈ చిత్రంలోని చెక్‌పోస్టు దృశ్యాలను చూశారా? గత నెల 16న జిల్లాలో మొత్తం 8 చోట్ల ఇలాంటి చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. నిజానికి రహదారులపై చెక్‌పోస్టుల ఏర్పాటు కొత్తేమీ కాదు. తనిఖీల్లో భాగంగా ఏర్పాటు చేసేవే. కానీ, ఈ 8 చెక్‌పోస్టుల ఏర్పాటు వెనుక మాత్రం మతలబు వేరే ఉందండోయ్. గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్, ఇతరత్రా అక్రమాలను అడ్డుకోవాలనే ప్రధాన ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్టుల వెనుక కోటి రూపాయల విలువైన కథ ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ కోటి రూపాయల కథా కమామిషు ఏమిటో ఒక్కసారి పరిశీలిద్దాం...

 గ్రానైట్ వార్
 గ్రానైట్ క్వారీలు, లారీల ఓవర్‌లోడ్ వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని, జిల్లాలో రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయని గత నెల 12న రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ సమక్షంలో జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు గొడవ చేశారు. తక్షణమే గ్రానైట్ పరిశ్రమ, లారీలపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అధికార పార్టీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోయారు. సమావేశానంతరం మైనింగ్ అధికారులను పిలిచిన మంత్రి గ్రానైట్ ఓవర్‌లోడ్ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 మూడు రోజుల్లో చెక్‌పోస్టుల ఏర్పాటు
 జెడ్పీ సమావేశం ముగిసిన మూడు రోజుల్లోనే గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్, ఇతరత్రా అక్రమాల నియంత్రణే ప్రధాన లక్ష్యంగా అధికారులు జిల్లాలో మొత్తం 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. మైనింగ్, రవాణాశాఖతోపాటు పోలీస్, రెవెన్యూ అధికారుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ చెక్‌పోస్టులకు సంబంధించిన నిర్వహణ వ్యయాన్ని మైనింగ్‌శాఖ భరించేలా ఆదేశాలు జారీ చేశారు. అనుకున్నదే తడవుగా అధికారులు వారం రోజుల్లోనే 37 కేసులు నమోదు చేశారు.

 ప్లీనరీ నిధులిస్తే ఎత్తేయిస్తా...
 గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రానైట్ లారీలపై కేసులు నమోదు చేస్తుండటంతో బెంబేలెత్తిన గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు జిల్లాకు చెందిన ఓ అమాత్యుడిని కలిసి లబోదిబోమన్నారు. వారు చెప్పిందంతా విన్న సదరు అమాత్యుడు ఈ నెల 9న ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్యే సోదరుడు, అసోసియేషన్‌కు చెందిన ఇద్దరు ముఖ్య నేతలతోపాటు మైనింగ్ ఉన్నతాధికారితో సమావేశమయ్యారు. అక్టోబర్ 11న పార్టీ ప్లీనరీ సమావేశం ఉన్నందున నిర్వహణ కోసం రూ.2 కోట్ల నిధులివ్వాలని ప్రతిపాదించారు.

తానెప్పుడూ గ్రానైట్ అసోషియేషన్‌ను డబ్బులు అడగలేదని, ప్లీనరీ నిర్వహణ, జనసమీకరణ తనకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున డబ్బులు అడుగుతున్నానని, 24 గంటల్లోనే ఆ మొత్తాన్ని సమకూర్చాలని చెప్పుకొచ్చారు. అమాత్యుడు చెప్పిందంతా విన్న అసోసియేషన్ ప్రతినిధులు రెండ్రోజుల తరువాత గ్రానైట్ యజమానులందరితో ప్రత్యేకంగా సమావేశమై అమాత్యుడి ప్రతిపాదనను ముందుంచారు. సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనప్పటికీ అంతిమంగా సదరు అమాత్యుడికి ప్లీనరీ ఖర్చు పేరిట కోటి రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు.

వెంటనే అమాత్యుడిని కలిసిన గ్రానైట్ అసోషియేషన్ ప్రతినిధులు గ్రానైట్ ఉత్పత్తి వ్యయం పెంపు, కరెంట్ కోతలతోపాటు చైనా మార్కెట్‌లో డిమాండ్ పడిపోవడంతో ఈ ఏడాది గ్రానైట్ పరిశ్రమ కుదేలైందని వివరించారు. ఈ తరుణంలో రూ.కోటికి మించి సాయం చేయలేమని విన్నవించుకున్నారు. కేసుల పేరిట వేధించడం సబబు కాదని వాపోయారు. అంతా విన్న సదరు అమాత్యుడు ప్లీనరీ ఫండ్ పేరిట కోటి రూపాయలు తీసుకునేందుకు అంగీకరించారు. డబ్బులు అందిన వెంటనే సీఎంతో మాట్లాడి చెక్‌పోస్టులు ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు.

 ప్లీనరీ వాయిదా.. ఆగిన చెల్లింపులు
 అమాత్యుడితో భేటీ అనంతరం గ్రానైట్ యజమానుల్లోని ముఖ్యులంతా సమావేశమై ఎవరెంత డబ్బులివ్వాలనే అంశంపై చర్చించారు. ఐదు బడా గ్రానైట్ సంస్థల యజమానులు ఒక్కొక్కరు రూ.5 లక్షలు, అంతకంటే తక్కువ టర్నోవర్ కలిగిన మరో 10 సంస్థల యజమానులు రూ.3 లక్షలు, మరో 6 సంస్థలు రూ.2 లక్షలు, మిగిలిన చిన్న చిన్న సంస్థల యజమానులు ఒక్కొక్కరు రూ.లక్ష, రూ.50 వేలు, రూ.25 వేల చొప్పున ఇచ్చేలా తీర్మానం చేసుకున్నారు.

అనుకున్నదే తడవుగా రూ.80 లక్షలు పోగుచేశారు. అక్టోబర్ 11న జరగాల్సిన ప్లీనరీ సమావేశం 18కి వాయిదా పడటం, అమాత్యుడు అందుబాటులో లేకపోవడంతో చెల్లింపులు జరగలేదు. ఆ తరువాత కొద్దిరోజులకే 18న జరగాల్సిన ప్లీనరీని కూడా వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన వెలువడడంతో సదరు గ్రానైట్ ప్రతినిధులు ఆ మొత్తాన్ని తమ వద్దే ఉంచుకున్నారు. మొత్తం కోటి రూపాయలు జమయ్యాక అమాత్యుడిని కలవాలనే యోచనలో ఉన్నారు.

 కొనసాగుతున్న చెక్‌పోస్టులు
 గ్రానైట్ యజమానులతో అమాత్యుడి ఒప్పందం చేసుకున్న తరువాత కొద్ది రోజులపాటు చెక్‌పోస్టుల వద్ద గ్రానైట్ లారీల ఓవర్‌లోడ్ వ్యవహారాన్ని చూసీచూడనట్లు వ్యవహరించారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు అక్కడికి రావడమే మానేశారు. పోలీసులు, రవాణాశాఖ అధికారులు విధులు నిర్వహిస్తూ నామమాత్రంగా కేసులు నమోదు చేశారు. ప్లీనరీ వాయిదా పడటం, నిధుల చెల్లింపు ఆగిపోవడంతో తాజాగా మళ్లీ కేసుల నమోదును వేగవంతం చేశారు. దీంతో నెలరోజుల్లోనే 206 కేసులు నమోదు చేయగా, అందులో 146 కేసులు గ్రానైట్ లారీలకు సంబంధించినవే కావడం గమనార్హం.

కేసుల పేరిట మొత్తం రూ.23 లక్షలు జరిమానా విధించగా, అందులో రూ.20 లక్షలు మైనింగ్‌కు సంబంధించినవే కావడం విశేషం. గ్రానైట్ యజమానులు మాత్రం డబ్బులు పోగు చేసిన తర్వాత కూడా కేసులు పెట్టి వేధించడమేంటని లబోదిబోమంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు... ఒకటి, రెండ్రోజుల్లో సదరు అమాత్యుడిని గ్రానైట్ ప్రతినిధులు కలిసి ఆ మొత్తాన్ని అందజేసి చెక్‌పోస్టులు ఎత్తివేయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement