ఇంట్లో గాలి కాలుష్యాన్ని కనుక్కోవచ్చు ఇలా..!
రోజూ మనం ఇంట్లో పీల్చుకునే గాలి ఎంత స్వచ్చమైనదో తెలుసుకునేందుకు.. భారతీయ సంతతి వ్యక్తితో కూడిన జపాన్ శాస్త్రజ్ఞుల బృందం కనుగొంది. గ్రాఫైన్ తయారుచేసిన ఈ సెన్సార్ తక్కువ శక్తిని వినియోగించుకుని మన ఇంట్లోని గాలి ఎంత కలుషితమయిందో తెలియజేస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇళ్లు, ఆఫీస్, స్కూళ్లలో గాలి కాలుష్యం వల్ల కలిగే జబ్బులు పెరిగిపోతున్నాయి. దీనిపై జపాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ శాస్త్రజ్ఞులు పరిశోధనలు చేశారు.
ఎలా పనిచేస్తుంది..?
ఇంటిలో ఉన్న వస్తువుల నుంచి విడుదలవుతున్న వాయువులు, కార్బన్ డై ఆక్సైడ్, వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్ గ్యాస్ అణువులు, బిల్డింగ్ ఇంటీరియర్స్ నుంచి విడుదలయ్యే అణువులను సెన్సార్‌ను ఉపయోగించి పసిగడుతుంది. ఈ సెన్సార్‌లో వాడిన టెక్నాలజీ వల్ల పీపీఎమ్ల్లో ఉండే అణువులను సైతం ఇది కనిపెడుతుంది. తాము తయారుచేసిన సెన్సార్ ఎంత బాగా పనిచేస్తుందో పరీక్షించడానికి ఒక గదిలో సెన్సార్‌ను ఉంచి కొద్ది మొత్తంలో కార్బన్ డై ఆక్సైడ్‌ను విడుదల చేసిన కొద్ది సెకన్లలోనే సెన్సార్ అలర్ట్ చేయడం ప్రారంభించింది.
వీటితో పాటు అతి తక్కువ విద్యుత్తును తీసుకుని పనిచేసే స్విచ్‌లను ఈ శాస్త్రవేత్తల బృందం కనుగొంది. ఈ రెండు ఆవిష్కరణలను కలిపి అల్ట్రా లో పవర్ సెన్సార్ సిస్టంను తయారు చేసేందుకు ఈ బృందం అడుగులు వేస్తోంది. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలను సైన్స్ అడ్వాన్సెస్ జర్నల్‌లో ప్రచురించారు.