గ్రేట్‌బ్యాచ్ ఆపిల్...
జయసూర్యలు, ఆఫ్రిదిలు, సెహ్వాగ్‌లు రాక ముందే పవర్ ప్లేలో మెరుపు బ్యాటింగ్ ఏమిటో చూపించిన మార్క్ గ్రేట్‌బ్యాచ్ గుర్తున్నాడా...పించ్ హిట్టర్ పదానికి తొలి సారి గుర్తింపు తెచ్చిన ఈ న్యూజిలాండ్ క్రికెటర్ 1992 వరల్డ్ కప్‌లో చెలరేగిన తీరు ఎవరు మరచిపోగలరు. కివీస్ తరఫున 41 టెస్టులు, 84 వన్డేలు ఆడిన ఈ క్రికెటర్ ఆ తర్వాత తనకిష్టమైన వ్యాపారంలోకి దిగిపోయాడు.
ఆటగాళ్లు వ్యాపారం చేయడం కొత్త కాదు కానీ గ్రేట్‌బ్యాచ్ ఇందులోనూ తన ప్రత్యేకత చూపించాడు. అతనికి ఆపిల్ పళ్లంటే మహా ఇష్టం. ఆ ఇష్టంలోనే అతను తన బిజినెస్‌నూ చూసుకున్నాడు. అందుకే పెద్ద సంఖ్యలో ఆపిల్ తోటలు కొనేశాడు. అక్కడ స్వయంగా ఆపిల్స్ పండిస్తూ తన వ్యాపారం కొనసాగించాడు. ఫెర్న్ రిడ్జ్ అనే కంపెనీతో కలసి దీనిని విస్తరించాడు.
క్రికెటర్ల ఫొటోలతో...
గ్రేట్‌బ్యాచ్ కంపెనీ మొత్తం 12 రకాల ఆపిల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది. అయితే వీటిలో రాయల్ గాలా ఆపిల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడే గ్రేట్‌బ్యాచ్ తన క్రికెట్ తెలివి చూపించాడు. ఈ ఆపిల్స్కు ప్రచారం కల్పించేందుకు క్రికెటర్లనే వాడుకున్నాడు. ఈ బ్రాండ్ ఆపిల్స్‌పై స్టిక్కర్లు ముద్రించి ఉంటాయి కదా. 1992 వరల్డ్ కప్ ఆడిన న్యూజిలాండ్ క్రికెటర్ల ఫొటోలతోనే ఈ స్టిక్కర్లు తయారు చేయించాడు.
ఆ టోర్నీ జెర్సీలోనే స్వయంగా గ్రేట్బ్యాచ్తో పాటు కెప్టెన్ మార్టిన్ క్రో, దీపక్ పటేల్, ఇయాన్ స్మిత్ తదితర ఆటగాళ్లు మనకు కనిపిస్తారు. అన్నట్లు భారత్‌లో కూడా రాయల్ గాలాకు మంచి గిరాకీ ఉంది ‘భారతీయులు క్రికెట్‌ను ప్రేమించినంతగా మా ఆపిల్స్‌ను కూడా ప్రేమిస్తారు‘ అనే క్యాప్షన్‌తో ఇక్కడికి ఎగుమతి చేస్తున్నాడు గ్రేట్‌బ్యాచ్. మీరెప్పుడైనా ఈ రకం ఆపిల్స్ తింటుంటే 1992 ప్రపంచకప్‌లో కివీస్ జోరు గుర్తుకొస్తుందేమో చూడండి.