హంద్రీ–నీవా ఆయకట్టుకు నీరివ్వాల్సిందే
ఉరవకొండ మహాధర్నాలో ముక్తకంఠంతో డిమాండ్ చేసిన విపక్ష నేతలు
ధర్నాకు స్వచ్ఛందంగా, భారీగా తరలివచ్చిన నియోజకవర్గ రైతులు
90 శాతం పనులు ఎప్పుడో పూర్తయితే.. 10శాతం పూర్తి చేయలేకపోతున్నారని వైఎస్ జగన్ మండిపాటు
ఐదేళ్లుగా నీరొస్తున్నా ఆయకట్టుకు ఎందుకివ్వలేదని మాజీ ఎంపీ అనంత సూటి ప్రశ్న
హంద్రీ–నీవాపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఎమ్మెల్యే విశ్వ డిమాండ్
భూములు కోల్పోతున్నామనే వేదనతో గుండె ఆగి చనిపోయిన రైతు బాలునాయక్ కుటుంబానికి జగన్ పరామర్శ
తమ భూములను ప్రభుత్వం లాక్కోకుండా అండగా నిలవాలని జగన్‌తో మొరపెట్టుకున్న రైతులు
గొల్లపల్లి రిజర్వాయర్ పరిధిలో భూసేకరణను తప్పుబట్టిన ప్రతిపక్ష నేత
వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే తిరిగిస్తామని హామీ
‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో హంద్రీ–నీవా పనులు 90 శాతం పూర్తయ్యాయి.తక్కిన పది శాతం డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసి ఫేజ్–1 ఆయకట్టుకు నీళ్లివ్వలేకపోతున్నారు. ప్రభుత్వం ఆయకట్టుకు నీళ్లిచ్చేదాకా పోరాటం చేస్తాం. అప్పటికీ స్పందించకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రెండేళ్లలో పూర్తి చేస్తాం’’ అని విపక్షనేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. హంద్రీ–నీవా ఆయకట్టుకు నీళ్లివ్వాలనే ప్రధాన డిమాండ్‌తో ఉరవకొండలోని టవర్‌క్లాక్ సమీపంలో సోమవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. హంద్రీ–నీవా ఆయకట్టులో అధిక భాగం ఉరవకొండ నియోజకవర్గంలో ఉండటం, స్థానిక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సుదీర్ఘంగా పోరాటం చేస్తుండటంతో నీటి సాధనే లక్ష్యంగా రైతులంతా స్వచ్ఛందంగా, భారీగా తరలివచ్చి ధర్నాలో పాల్గొన్నారు. రైతులతో ఉరవకొండ ప్రధాన దారులతో పాటు వీధులన్నీ కిక్కిరిశాయి. రైతులనుద్దేశించి ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతూ జిల్లాలో సాగునీరు లేక, పంటలు పండక రైతులు భిక్షాటన చేస్తున్న దారుణ పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు. కళ్లెదుట ఉన్న నీటిని కూడా ఆయకట్టుకు ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. 10శాతం పనులు కూడా పూర్తి చేయలేని చేతకాని ముఖ్యమంత్రి ఉన్నందుకు సిగ్గుపడాలన్నారు. వెంటనే ఆయకట్టుకు నీరిచ్చి రైతులకు అండగా నిలవాలని, లేదంటే సుదీర్ఘపోరాటం చేస్తామఽని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకపోతే వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. హంద్రీ–నీవా ద్వారా జీడిపల్లికి ఐదేళ్లుగా కృష్ణాజలాలు వస్తున్నా ఆయకట్టు పనులు ఎందుకు చేపట్టలేదని మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి ప్రశ్నించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేతలు కూడా జిల్లా ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ..‘ ప్రాజెక్టు వస్తే నీళ్లొస్తాయి, కొంత భూమి పోయినా, ఉన్న భూమిలో బంగారు పంటలు పండించుకోవచ్చని రైతులు భూములను త్యాగం చేశారు. కానీ కళ్లెదుట నీళ్లున్నా ఆయకట్టుకు ఇవ్వకపోతే రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రభుత్వం ఆలోచించాల’ని సూచించారు. ఉద్యాన పంటలకు ‘అనంత’ అనువైన ప్రాంతమని, సాగునీరు అందుబాటులో ఉంటే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందంటూ వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ద్రాక్షగెలను తీసుకొచ్చి జగన్‌కు చూపించారు. వజ్రకరూరు లంబాడీ మహిళలు జగన్‌కు తలపాగా సమర్పించారు.
గొల్లపల్లి భూ బాధితులకు పరామర్శ
ఉరవకొండ ధర్నా అనంతరం జగన్ నేరుగా పెనుకొండ నియోజకవర్గంలోని గొల్లపల్లి రిజర్వాయర్ సమీపంలో ఉన్న మక్కాజిపల్లి తండా, అమ్మవారిపల్లికి వెళ్లారు. పారిశ్రామికవాడ పేరుతో భూములు లాక్కుంటున్నారన్న ఆవేదనతో గుండెపోటుకు గురై చనిపోయిన మక్కాజిపల్లి తండా రైతు బాలునాయక్ కుటుంబాన్ని జగన్ పరామర్శించారు. వేదన చెందొద్దని, వైఎస్సార్సీసీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అక్కడి నుంచి అమ్మవారిపల్లికి చేరుకున్నారు. జగన్‌ను కలిసి తమ గోడు చెప్పుకునేందుకు అప్పటికే రైతులంతా అక్కడ వేచి ఉన్నారు. వారిని జగన్ పలకరించారు. గొల్లపల్లికి నీళ్లొస్తే పంటలు పండుతాయని ఆశపడ్డామని, కానీ నీళ్లొచ్చి రెండు నెలలు కూడా కాకముందే పారిశ్రామికవాడ పేరుతో భూములు లాక్కుంటున్నారని వాసెచానే. దీనిపై స్పందించిన జగన్.. జిల్లా అభివృద్ధికి పరిశ్రమలు అవసరమే కానీ రిజర్వాయర్ పరిధిలోని భూములు తీసుకోవడం దారుణమని అన్నారు. దూరప్రాంతాల్లో వ్యవసాయ యోగ్యం కాని భూములను ప్రభుత్వం సేకరించాలన్నారు. భూములు కోల్పోతున్నందుకు ఎవరూ అధైర్యపడొద్దని, తమ ప్రభుత్వం రాగానే తిరిగిస్తామని హామీ ఇచ్చారు. పర్యటనలో పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, కోఆర్డినేటర్లు కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఉషశ్రీ చరణ్, తిప్పేస్వామి, సిద్దారెడ్డి, నవీన్ నిశ్చల్, జొన్నలగడ్డ పద్మావతి, వై. వెంకట్రామిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, యువజన , రైతు, సేవాదళ్, ట్రేడ్ యూనియన్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి, వెంకటచౌదరి, మిద్దె భాస్కర్‌రెడ్డి, ఆదినారాయణరెడ్డి, బోయ సుశీలమ్మ, మాజీ మేయర్ రాగేపరుశురాం, రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు మీసాల రంగన్న, నదీమ్ అహ్మద్, పార్టీ నేతలు వీరన్న, రమేశ్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి భరత్, రాయలసీమ అధ్యక్షుడు తరిమెల శరత్ చంద్రారెడ్డి, కేశవరెడ్డి, బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు పామిడి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.