రేపు మహాధర్నా
కన్హయ్య విడుదల కోరుతూ వామపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాల పిలుపు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని, జేఎన్‌యూ విద్యార్థిసంఘం నేత కన్హయ్యకుమార్‌పై పెట్టిన దేశద్రోహం కేసును ఉపసంహరించి ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలని వామపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశా రు. పటియాలా కోర్టులో జర్నలిస్టులు, విద్యార్థులు, లాయర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వర్సిటీ ల్లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, హెచ్‌సీయూ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఉదంతంలో వీసీని తొలగించాలని కోరారు. కన్హయ్యను విడుదల చేయాలని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలనే డిమాండ్లతో గురువారం ఇందిరాపార్కు వద్ద పది వామపక్షాలు, వివిధ ప్రజా, విద్యార్థి సంఘా లు తలపెట్టిన మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మంగళవారం మఖ్దూం భవన్‌లో మహాధర్నా పోస్టర్‌ను తమ్మినేని వీరభద్రం, జి.రాములు(సీపీఎం), చాడ వెంకటరెడ్డి, సుధాకర్(సీపీఐ), వేములపల్లి వెంకటరామయ్య, ఝాన్సీ(న్యూడెమొక్రసీ-రాయల), జానకిరాములు, గోవింద్ (రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ), మురహరి(ఎస్‌యూసీఐ), నరేందర, శ్రీనివాస్ (ఫార్వర్డ్‌బ్లాక్),కిరణ్, అనురాధ(ఐఎఫ్‌టీ యూ), ప్రదీప్(పీడీఎస్‌యూ),హన్మేష్(పీవైఎల్),రచయిత కాలువ మల్లయ్యలు విడుదల చేశారు. ఈ సంద ర్భంగా తమ్మినేని, చాడ మాట్లాడుతూ... బీజేపీ, సంఘ్‌పరివార్ శక్తుల దాడులకు వ్యతిరేకంగా మేధావులు, కవులు, కళాకారులు కలసి వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరా రు. ఛాందస, అభివృద్ధి నిరోధక ఆలోచనలు విస్తృతంగా ప్రచారంలోకి తేవడానికి బీజేపీ భావజాలం గట్టిగా పనిచేస్తుండగా, టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ దానికి మద్దతునిస్తున్నారన్నారు. బీజేపీతో అవగాహన కుదుర్చుకుని, కేంద్రం కేబినెట్‌లో చేరేందుకు టీఆర్‌ఎస్ ఉవ్విళ్లూరుతోందన్నారు. అందుకే జేఎన్‌యూ పరిణామాలపై ప్రభుత్వం నోరు మెదపలేదన్నారు.