భావప్రకటనా స్వేచ్ఛ మీకేనా?: నారాయణ
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛ బీజేపీకో, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికో పరిమితం కాదని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ ధ్వజమెత్తారు. వర్సిటీల ప్రాంగణాల్లో రాజకీయం వద్దని చెబుతున్న వెంకయ్య తన గతాన్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే భావప్రకటన అంటే ‘అదేదో వారి గుత్తసొత్తు’గా ఉన్నట్టు అర్థమవుతుందని విమర్శించారు.
కన్హయ్యను చూస్తే బెదురెందుకు?: రామకృష్ణ
సాక్షి, విజయవాడ బ్యూరో: కేంద్రంలో అధికారం ఉందని విర్రవీగుతున్న బీజేపీకి జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్యను చూస్తే భయమెందుకని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడిని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రశ్నించారు. కమ్యూనిజంలో నిజాలు లేవని, వారి గురించి మాట్లాడడం అనవసరమని రెండు రోజుల క్రితం విజయవాడ సభలో వెంకయ్య వ్యాఖ్యానించడాన్ని రామకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో తప్పుబట్టారు. కన్హయ్యకుమార్ సభలను చూసి జడిసి, సిద్ధార్థ అకాడమీలో సభకు అనుమతిని వెంకయ్య రద్దు చేయించారన్నారు.