కన్హయ్యకుమార్‌పై బూట్ల దాడి
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఓ సదస్సులో ఘటన
{పసంగం ప్రారంభంలో బూట్లు విసిరిన వ్యక్తి
అడ్డుకుని చితకబాదిన వామపక్షాల కార్యకర్తలు, విద్యార్థులు.. ఇద్దరి అరెస్టు
హైదరాబాద్: జేఎన్‌యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్‌పై ఓ వ్యక్తి బూట్లు విసిరి దాడికి యత్నించాడు. దేశద్రోహి కన్హయ్యకు మాట్లాడే హక్కులేదంటూ నినాదాలు చేశాడు. అతను విసిరిన బూట్లు కన్హయ్య మీద కాకుండా.. అక్కడే ఉన్న వీడియో జర్నలిస్టుల మీద పడ్డాయి. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సులో కన్హయ్య ప్రసంగం ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. దాడికి పాల్పడిన వ్యక్తిని గోరక్షాదళ్ రాష్ట్ర అధ్యక్షుడిగా చెప్పుకొం టున్న అంతారం నరేశ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అతడిని, అతడితోపాటు వచ్చిన పవన్‌రెడ్డి అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
‘‘మిత్రులారా క్షమించండి. నాకు తెలుగు రాదు. తెలుగులో ‘గారు’ పదం ఒక్కటే తెలుసు. మీరందరూ నాకు గారు..’’ అంటూ కన్హయ్య హిందీలో ప్రసంగం ప్రారంభించారు. ఇంతలోనే ప్రేక్షకుల్లోంచి లేచిన నరేశ్ ఆయన వైపు రెండు బూట్లు విసిరాడు. దీంతో సదస్సులో కలకలం రేగింది. సమీపంలో కూర్చున్న కొందరు వ్యక్తులు నరేశ్‌ను అడ్డుకుని ప్రతిదాడికి దిగారు. ఆగ్రహంతో పిడిగుద్దులు కురిపించారు. అతడికి ఎలాంటి హానీ చేయకుండా వదిలేయాలని కన్హయ్య కోరారు. నరేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు నిమిషాల అనంతరం సదస్సు తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు మల్లేపల్లి లక్ష్మయ్య అక్కడున్న వారిని శాంతింపజేశారు. అల్లరి చేయడానికి ప్రయత్నిస్తారని, ఇంకా ఎవరైనా ఉంటే వారినీ లేచి, మాట్లాడనీయాలన్నారు. తమకు సమాధానం చెప్పే సత్తా, దమ్ము, ధైర్యం ఉన్నాయని.. ఎవరినీ ఏమీ అనవద్దంటూ వామపక్షాల కార్యకర్తలు,విద్యార్థులను శాంతింపజేశారు.
గాడ్సే దేశంగా ఎప్పటికీ మారదు: కన్హయ్య
అంతరాయం అనంతరం కన్హయ్యకుమార్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇది గాంధీ పుట్టిన దేశమని, గాడ్సే మందిరంగా ఎప్పటికీ మారదన్నారు. ఎవరు భయపెట్టినా భయపడనని, వంగదీస్తే వంగిపోనని వ్యాఖ్యానించారు. ‘‘వర్సిటీలో వెళ్లకుండా అడ్డుకుంటే రోహిత్ మాట ఎత్తనని అనుకుంటున్నారు. సదస్సులో చెప్పులతో కొడితే మాట్లాడకుండా ఉంటానని అనుకుంటున్నారు. భాయ్ సాబ్.. భయపడే వాళ్లం కాదు. ఏమైనా చేసుకోండి. మాట్లాడే స్వేచ్ఛ కోసం సంఘర్షిస్తున్నాం. మీరేమైనా చేస్తే అది మాకు ప్రచారాన్ని తెచ్చిపెడుతుంది. ఇందుకు ప్రధాని మోదీకి, పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా...’’ అని పేర్కొన్నారు. అగ్రకులాల వాళ్లు ఇళ్లు ఇవ్వకపోవడంతో అంబేడ్కర్ అబద్ధమాడి ఇళ్లు తీసుకునేవారని, దళితుడని తెలిసిన తర్వాత వారు ఆయన సామాన్లను బయటకి విసిరేసేవారని కన్హయ్య చెప్పారు. అయినా అంబేడ్కర్ ఆగ్రహానికి గురయ్యేవారు కాదని, అరవడం, కొట్టడం వంటివి చేసేవారు కాదని... అంబేడ్కర్‌ను నమ్మేవారైతే అరవడం, కొట్టడం చేయకూడదని పేర్కొన్నారు. సహనాన్ని కోల్పోవద్దని సూచించారు. హెచ్‌సీయూ వద్ద రాయి విసిరినా, జేఎన్‌యూలో చెంపదెబ్బ కొట్టినా, ఇప్పుడు బూట్లు విసిరినా సదరు వ్యక్తులతో తనకు బాధేమీ కలగలేదని పేర్కొన్నారు.