స్మృతి.. తప్పుకోవాలి
కన్హయ్య డిమాండ్.. ఢిల్లీలో జేఎన్‌యూ భారీ ర్యాలీ
న్యూఢిల్లీ: రాజద్రోహం కేసులో అరెస్టయిన విద్యార్థులు ఖాలిద్, అనిర్బన్‌ల విడుదల కోరుతూ.. జేఎన్‌యూ విద్యార్థులు ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. తర్వాత జంతర్‌మంతర్ వద్ద సభను ఏర్పాటు చేశారు. ‘విద్యాసంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ రాజీనామా చేయాలి. మీవి మొసలి కన్నీళ్లు, మీ నవ్వు, ఏడుపు అన్నీ అబద్ధాలే’ అని ఈ సందర్భంగా కన్హయ్య అన్నారు. కాగా, వేదిక సమీపంలో నలుగురు యువకులు కన్హయ్యపై దాడికి ప్రయత్నించగా పోలీసులు వీరిని అరెస్టు చేశారు. కాగా, రాజద్రోహం కేసులో బెయిల్‌పై వచ్చిన కన్హయ్య.. నిబంధలనకు విరుద్ధంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన బెయిల్ రద్దుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. బుధవారం ఈ కేసును విచారించనుంది.
కాగా, దేశ వ్యతిరేక నినాదాల విషయంలో జేఎన్‌యూ నుంచి కన్హయ్య, ఖాలిద్, అనిర్బన్‌తోపాటు 21మంది విద్యార్థులను బహిష్కరించటంపై వారినుంచి సమాధానం వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని యూనివర్సిటీ ఏర్పాటుచేసిన అత్యున్నత స్థాయి కమిటీ తేల్చింది. ఖాలిద్, అనిర్బన్ వర్సిటీలో సామరస్య వాతావరణం చెడిపోయేందుకు కారణమయ్యారని స్పష్టం చేసింది. అయితే.. నోటీసులందుకున్న విద్యార్థులందరూ చర్చించాకే.. నోటీసులకు సమాధానం ఇవ్వాలా వద్దా అనే అంశాన్ని నిర్ణయిస్తామని విద్యార్థులు తెలిపారు. మరోవైపు, రాజద్రోహం కేసులో బెయిల్ ఇవ్వాలంటూ.. ఖాలిద్, అనిర్బన్ పెట్టుకున్న పిటిషన్‌ను బుధవారం ఢిల్లీ కోర్టు విచారించనుంది. ఈ ఇద్దరి జ్యుడీషియల్ రిమాండును మార్చి 29 వరకు పొడిగించింది.