JNU student community
-
విమానంలో కన్హయ్యపై దాడి!
ముంబై: విమానంలో తోటి ప్రయాణికుడు తన పీకనులిమి చంపబోయాడంటూ జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ ఆదివారం తెలిపారు. ‘ఈ సారి విమానంలో దాడి. ఒక వ్యక్తి నా పీకనులిమాడు. నాపై దాడి చేసిన వారిపై విమాన సిబ్బంది ఏ చర్యలూ తీసుకోలేదు’అని ట్విటర్లో పేర్కొన్నారు. ముంబై నుంచి పుణెకు వెళ్లడానికి కన్హయ్య జెట్ ఎయిర్వేస్ విమానం ఎక్కిన సందర్భంలో ఈ ఘటన జరిగింది. దీంతో భద్రతా కారణాల రీత్యా కన్హయ్యను విమానం నుంచి దింపి రోడ్డుమార్గంలో విమాన సిబ్బంది పుణెకు పంపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దాడి చేసిన వ్యక్తిని పుణె టీసీఎల్‌లో పనిచేసే ఉద్యోగి మనస్ జ్యోతి డేక(33)గా గుర్తించారు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి కేసు పెట్టారు. ప్రాథమిక ఆధారాలను బట్టి సీటు కోసం ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగిందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. ఈ సంఘటనపై ఇరు పక్షాలు ఫిర్యాదు చేశాయన్నారు. పబ్లిసిటీ కోసం కన్హయ్య చేసిన చీప్ ట్రిక్ అని మనస్ ఆరోపించాడు. కాలు నొప్పి నుంచి ఉపశమనం కోసం కదలగా తన చేయి కన్హయ్య మెడను రాసుకుందన్నాడు. అసలు కన్హయ్య అనే అతను ఎవరో తనకు తెలియదన్నాడు. కాగా, కేరళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సహచర విద్యార్థి తరఫున కన్హయ్య ప్రచారం చేయనున్నారు. మోదీ ప్రభుత్వం వెనుక ఆరెస్సెస్ దాగి ఉందని, వారి హయాంలో దేశం మతతత్వ, దళిత వ్యతిరేక ప్రయోగశాలగా మారిందని కన్హయ్య ఆరోపించారు. -
హైదరాబాద్ రానున్న కన్హయ్య కుమార్
హెచ్‌సీయూలో రోహిత్ స్మారకానికి నివాళి హైదరాబాద్: రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రెండు సభల్లో పాల్గొనేందుకు ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ హైదరాబాద్‌కు రానున్నట్లు సీపీఐ గ్రేటర్ కార్యదర్శి డాక్టర్ సుధాకర్ తెలిపారు. సభలకు సంబంధించిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సు పోస్టర్లను మంగళవారం నగరంలోని మఖ్దూం భవన్లో పలు సంఘాల నాయకులతో కలసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కన్హయ్య బుధవారం సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకుని హెచ్సీయూకు వెళతారన్నారు. అక్కడ రోహిత్ స్మారక స్తూపానికి నివాళి అర్పించి రోహిత్ తల్లికి సంఘీభావం ప్రకటిస్తారన్నారు. అనంతరం హెచ్‌సీయూలో జరిగే సభలో ఆయన ప్రసంగిస్తారన్నారు. గురువారం ఉదయం 10.30 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సదస్సులో కన్హయ్య ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రజలను చైతన్యపరుస్తారన్నారు. దేశంలో మోదీ ప్రభుత్వం ఓ మతానికి మొగ్గు చూపుతూ భావ స్వేచ్ఛను అరికడుతోందని సుధాకర్ ఆరోపించారు. వీటన్నింటిపై కన్హయ్య ప్రసంగిస్తారని ఆయన వివరించారు. -
రేపు మహాధర్నా
కన్హయ్య విడుదల కోరుతూ వామపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాల పిలుపు సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలని, జేఎన్‌యూ విద్యార్థిసంఘం నేత కన్హయ్యకుమార్పై పెట్టిన దేశద్రోహం కేసును ఉపసంహరించి ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలని వామపక్షాలు, ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశా రు. పటియాలా కోర్టులో జర్నలిస్టులు, విద్యార్థులు, లాయర్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వర్సిటీ ల్లో కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, హెచ్‌సీయూ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఉదంతంలో వీసీని తొలగించాలని కోరారు. కన్హయ్యను విడుదల చేయాలని, రాజ్యాంగ హక్కులను పరిరక్షించాలనే డిమాండ్లతో గురువారం ఇందిరాపార్కు వద్ద పది వామపక్షాలు, వివిధ ప్రజా, విద్యార్థి సంఘా లు తలపెట్టిన మహా ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం మఖ్దూం భవన్లో మహాధర్నా పోస్టర్‌ను తమ్మినేని వీరభద్రం, జి.రాములు(సీపీఎం), చాడ వెంకటరెడ్డి, సుధాకర్(సీపీఐ), వేములపల్లి వెంకటరామయ్య, ఝాన్సీ(న్యూడెమొక్రసీ-రాయల), జానకిరాములు, గోవింద్ (రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ), మురహరి(ఎస్‌యూసీఐ), నరేందర, శ్రీనివాస్ (ఫార్వర్డ్‌బ్లాక్),కిరణ్, అనురాధ(ఐఎఫ్‌టీ యూ), ప్రదీప్(పీడీఎస్‌యూ),హన్మేష్(పీవైఎల్),రచయిత కాలువ మల్లయ్యలు విడుదల చేశారు. ఈ సంద ర్భంగా తమ్మినేని, చాడ మాట్లాడుతూ... బీజేపీ, సంఘ్‌పరివార్ శక్తుల దాడులకు వ్యతిరేకంగా మేధావులు, కవులు, కళాకారులు కలసి వచ్చి ధర్నాను విజయవంతం చేయాలని కోరా రు. ఛాందస, అభివృద్ధి నిరోధక ఆలోచనలు విస్తృతంగా ప్రచారంలోకి తేవడానికి బీజేపీ భావజాలం గట్టిగా పనిచేస్తుండగా, టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ దానికి మద్దతునిస్తున్నారన్నారు. బీజేపీతో అవగాహన కుదుర్చుకుని, కేంద్రం కేబినెట్లో చేరేందుకు టీఆర్ఎస్ ఉవ్విళ్లూరుతోందన్నారు. అందుకే జేఎన్‌యూ పరిణామాలపై ప్రభుత్వం నోరు మెదపలేదన్నారు.