Greater Selection
-
కొరకరాని కొయ్యలా మారిన రాజాసింగ్
హైదరాబాద్ : నగర బీజేపీలో ముసలం పుట్టింది. నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకొంటున్నారు. గ్రేటర్ పరిధిలో 5 నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నా... పార్టీ కార్యక్రమాల్లో మాత్రం నలుగురే దర్శన మిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల వేడి ఊపందుకున్న తరుణంలో ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథా పార్టీ కార్యక్రమాలకు దూరం గా ఉంటుండటం పార్టీశ్రేణుల్లో అయోమయాన్ని రేకెత్తిస్తోంది. మిత్రపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘గ్రేటర్ ఎన్నికల శంఖారావం’ భారీ బహిరంగ సభకు సైతం ఎమ్మెల్యే గైర్హాజరుకావడం, వేదికపై ఆయన ఫొటో లేకపోవడంపై కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. తన నియోజకవర్గంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇటీవల నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి కూడా రాజాసింగ్ గైర్హాజరుకాకపోవడం పార్టీలోని విబేధాలను వెల్లడిస్తోంది. దీనికితోడు ఏకంగా పార్టీ అధ్యక్షుడిపైనే విమర్శనాస్త్రాలు సంధించడంతో నేతల మధ్య అంతరం మరింత పెరిగింది. అయి తే... గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆయనపై ఏవిధమైన చర్య తీసుకొన్నా పార్టీకే నష్టం అన్న ఉద్దేశంతో అగ్రనాయకులు కక్క లేక... మింగ లేక అన్నట్లుగా సర్దుకుపోతున్నారు.ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికల్లో తన నియోజకవర్గ పరి ధిలో తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలని, లేని పక్షంలో వారిని స్వతంత్రులుగా బరిలోకి దింపుతానని ఇప్పటికే ఆయన పార్టీకి అల్టిమేటం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థులకు సీట్లు ఇస్తారా..? లేక పార్టీ నిర్ణయం మేరకు అభ్యర్థులను ఖరా రు చేస్తారా..? అన్న విషయం తేలడం లేదు. దీంతో ఆయా డివిజన్లలో సీట్లు ఆశిస్తున్న అభ్యర్థులు సైతం అయోమయంలో పడ్డారు. ఒకవేళ పార్టీ ఎమ్మెల్యే ప్రతి పాదనలకు అనుకూలంగా నిర్ణయం తీసుకొంటే దీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న తమ పరిస్థితి ఏంటి..? తమ కు గుర్తింపు ఉంటుందా..?అని స్థానిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే... తొందర పడకుండా పార్టీ నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూడాలని భావిస్తున్నారు. -
టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలు ప్రమాదకరం
మాటల గారడీలను నమ్మొద్దు కేంద్రం నిధులిస్తేనే డబుల్ బెడ్రూం ఇళ్ల పూర్తి కేంద్ర మంత్రి దత్తాత్రేయ అంబర్‌పేట : టీఆర్ఎస్, ఎంఐ ఎం పార్టీలు హైదరాబాద్ నగరానికి ప్రమాదకరమని గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ది చెప్పాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. టీఆర్ఎస్ నాయకులు మాటల గారడీ, పేరడీ కథలతో ప్రజల ను మభ్యపెడుతున్నారని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివా రం గోల్నాక అశోక్ ఫంక్షన్హాల్లో అంబర్‌పేట నియోజకవర్గ బీజేపీ, టీడీపీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభు త్వ భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం పథకానికి కేంద్ర ప్రభుత్వాన్ని రూ. 3వేల కోట్లు నిధులు కోరిందని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే పథకం పూర్తవుతుందన్నారు. రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ జెండాలు, కండువాలు మార్చే నాయకులకు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. పేదలకు టీడీపీ, బీజేపీ అండగా ఉంటాయన్నారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలోనే హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందిందన్నారు. టీఆర్ఎస్ వద్ద అధికారం ఉంటే బీజేపీ, టీడీపీ వద్ద నైతిక విలువలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రణాళికల అమలుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే టీఆర్ఎస్ దానిని కరీంనగర్‌కు తరలించిందన్నారు. తాము నిత్యం ప్రజల్లో ఉంటే టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల కోసమే గల్లీలోకి వస్తున్నారన్నారు. టీఆర్ఎస్కు ఓటు వేయకపోతే పింఛన్లు, డబుల్బెడ్రూమ్ ఇళ్లు రావనే ప్రచారం జరుగుతుందని వాటిని టీఆర్ఎస్ నాయకులు తమ జేబుల్లోనుంచి ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, ఎక్కాల నందు, దిడ్డి రాంబాబు, ఆనంద్‌గౌడ్, సాంబశివగౌడ్, కన్నెరమేష్యాదవ్, రాంచందర్, నర్సింగ్‌రావు యాదవ్, అచ్చిని రమేష్, గోవర్ధన్‌రెడ్డి, వనం రమేష్, అడపా చంద్రమౌళి, చిట్టి శ్రీధర్, పెంటం రాజు, రాజుగుప్త తదితరులు పాల్గొన్నారు. -
ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు
♦ కొన్ని పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయి: గడ్కరీ ♦ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపు ♦ రెండింతల నిధులిచ్చి అభివృద్ధి చేస్తామని హామీ సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు బీజేపీ వ్యతి రేకం కాదని, కానీ కొన్నిపార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పేవిధంగా బీజేపీ వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌కు రెండింతల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని ఏఓసీ రోడ్ల మూసివేత సమస్యను రక్షణ మంత్రితో చర్చించి పరిష్కరిస్తామని గడ్కరీ చెప్పారు. పౌరులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో బీజేపీ-టీడీపీ సంయుక్తంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దురదృష్టవశాత్తు కొంత మంది పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతున్నారని, అలాంటివారికి దేశప్రజల బాధ లు గుర్తుకు రావన్నారు. నెహ్రూ నుంచి రాజీవ్‌గాంధీ దాకా దేశాన్ని పాలించినా, పదేళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికన్నా.. మోదీ నేతృత్వంలో ఎన్డీయే ఎక్కు వ అభివృద్ధి చేసి చూపిస్తోందని కేంద్రమంత్రి చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలకు కాలం చెల్లిం దని, వారికి చివరకు ఎర్రజెండా మాత్రమే మిగిలిందని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో ఉపాధి లేకపోవడం వల్ల పట్టణాలకు వలసలు పెర గడంతో జనాభా విపరీతంగా పెరిగిపోతోం దని, పేదలకు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెంచేవిధంగా కేంద్రం పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఇక తెలంగాణ లో రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు గడ్కరీ ప్రకటించారు. టీఆర్ఎస్ మోసం చేస్తోంది కేంద్రం సహకారంతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో టీఆర్ఎస్ మోసం చేస్తోందని, ప్రతి ఇంటికి కేంద్రం రెండు లక్షలు ఇస్తేగానే నిర్మిం చడం లేదని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. తండ్రిని ముంచే కొడుకులా కేటీఆర్ తయారయ్యాడన్నారు. హిందువులను ఊచకోత కోస్తామన్న పార్టీతో పొత్తున్న టీఆర్ఎస్ను గ్రేటర్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఘన స్వాగతం రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగ తం పలికారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు స్వాగతం పలికారు. ఇక రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రూ.40,800 కోట్లను మంజూరు చేసిన గడ్కరీకి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలి పారు. రాష్ట్రంలో ఒకరోజు పర్యటించి భారీగా నిధులు మంజూరు చేశారని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రధాని మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు చేసేవారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు. -
స్మార్ట్ వ్యూహం
ఆర్‌డబ్ల్యూఏలతో ప్రత్యేక సదస్సు నలుగురు మంత్రులు హాజరు గ్రేటర్ ఎన్నికల కోసమేనా? సిటీబ్యూరో: ఒకే దెబ్బకు రెండు పిట్టలు. అటు స్మార్ట్‌సిటీ గా తొలి జాబితాలో ఎంపికకు.. ఇటు రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో అధికార పార్టీకి ఉపకరించేందుకు అవసరమైన చర్యలను జీహెచ్ఎంసీ చేపట్టింది. ఇందులో భాగంగా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల (ఆర్డబ్ల్యూఏ)తో సోమవారం కూకట్‌పల్లిలో భారీ స్థాయిలో సదస్సు నిర్వహించింది. జీహెచ్ఎంసీ చేపట్టబోయే అన్ని పనుల్లో (ఇంటింటికీ చెత్త డబ్బాలు, మల్టీలెవెల్ ఫంక్షన్‌హాళ్లు, ఫ్లై ఓవర్లు తదితరమైనవి) ఆర్డబ్ల్యూఏలు ముఖ్య భూమిక పోషించాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్అలీతో పాటు మంత్రులు నాయిని నరసింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. క్షేత్ర స్థాయిలో క్యాడర్ బలం లేకపోవడంతో ఆర్‌డబ్ల్యూఏల సహకారంతో ఎన్నికల్లో నెగ్గాలనేది సర్కారు యోచనగా కనిపిస్తోంది. ముఖ్యంగా కూకట్పల్లి ప్రాంతంలో సెటిలర్స్ ఎక్కువ కావడంతో తొలుత అక్కడ దృష్టి కేంద్రీకరించింది. ఆర్డబ్ల్యూయేల సహకారంతో ఏదైనా సాధించవచ్చునని చెబుతూ పరోక్షంగా అన్ని పనుల బాధ్యతలను వారికే అప్పగిస్తామనే సంకేతాలు పంపింది. హైదరాబాద్‌లో ఉంటున్న వారంతా తమవారేనని, ఎవరిపైనా పక్షపాతం లేదని హోం మంత్రి నాయిని చెప్పడాన్ని బట్టి అందరి మద్దతు కూడగట్టేందుకు దీన్ని వేదికగా చేసుకున్నట్లు రాజకీయ పరిశీలకుల అంచనా. మరోవైపు స్మార్ట్‌సిటీలలో తొలిస్థానాలు దక్కేందుకు స్థానిక సంఘాల భాగస్వామ్యం అవసరం. అందులో భాగంగా ప్రాధాన్య క్రమంలో చేపట్టాల్సిన పనులు తెలియజేయాల్సిందిగా సంబంధిత ఫారాలను వారికి అందజేశారు. ఇలా.. ఇటు స్మార్ట్‌సిటీ, అటు జీహెచ్ఎంసీ ఎన్నికలు లక్ష్యంగా ఈ సభ జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తొందరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు రానున్నాయనే అభిప్రాయాలకు ఈ వేదిక బలం చేకూర్చింది. అయితే ఇంకా డీలిమిటేషన్ ముసాయిదా ప్రజల ముందుకు రాకపోవం సందేహాలకు తావిస్తోంది. సభలో రభస కూకట్పల్లి: ఈ సదస్సులో పాల్గొన్నశేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అభివృద్ధి పనులపై విమర్శలు సంధిస్తుండగా టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. టీడీపీ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమావేశం రసాభాసగా మారింది. ఆ సమయంలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కల్పించుకొని ఇరువర్గాలను శాంతింపజేశారు. ప్రజల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే అంశంపై ప్రసంగించాలేగానీ గొడవలకు దిగొద్దన్నారు. అసోసియేషన్ల పాత్రపై సూచనలు చేయాలని ఆయన ఎమ్మెల్యేకు సూచించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమైన లోటుపాట్లు ఉంటే మంత్రులు, ప్రజా ప్రతిధులు కలిసి మాట్లాడుకోవాలని తెలిపారు. ఆర్డబ్ల్యూఏ ప్రతినిధుల నిరసన సమావేశానికి పిలిపించి కనీసం తమ అభిప్రాయాలను తెలుసుకునేందుకు సమయం కేటాయించకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు వారి ప్రసంగాలే వినిపించారని వెల్ఫేర్ అసోసియేషన్ల సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ఏ మాత్రం తెలుసుకోకుండా ప్రసంగించి వె ళ్లడం వల్ల ఒరిగేదేమిటని ప్రశ్నించారు.