కొరకరాని కొయ్యలా మారిన రాజాసింగ్
హైదరాబాద్ : నగర బీజేపీలో ముసలం పుట్టింది. నేతల మధ్య విభేదాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఏ చిన్న అవకాశం దొరికినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకొంటున్నారు. గ్రేటర్ పరిధిలో 5 నియోజకవర్గాల్లో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నా... పార్టీ కార్యక్రమాల్లో మాత్రం నలుగురే దర్శన మిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ ఎన్నికల వేడి ఊపందుకున్న తరుణంలో ఘోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ లోథా పార్టీ కార్యక్రమాలకు దూరం గా ఉంటుండటం పార్టీశ్రేణుల్లో అయోమయాన్ని రేకెత్తిస్తోంది.
మిత్రపక్షాల ఆధ్వర్యంలో మంగళవారం నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో నిర్వహించిన ‘గ్రేటర్ ఎన్నికల శంఖారావం’ భారీ బహిరంగ సభకు సైతం ఎమ్మెల్యే గైర్హాజరుకావడం, వేదికపై ఆయన ఫొటో లేకపోవడంపై కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. తన నియోజకవర్గంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఇటీవల నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి కూడా రాజాసింగ్ గైర్హాజరుకాకపోవడం పార్టీలోని విబేధాలను వెల్లడిస్తోంది. దీనికితోడు ఏకంగా పార్టీ అధ్యక్షుడిపైనే విమర్శనాస్త్రాలు సంధించడంతో నేతల మధ్య అంతరం మరింత పెరిగింది.
అయి తే... గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో ఆయనపై ఏవిధమైన చర్య తీసుకొన్నా పార్టీకే నష్టం అన్న ఉద్దేశంతో అగ్రనాయకులు కక్క లేక... మింగ లేక అన్నట్లుగా సర్దుకుపోతున్నారు.ఇదిలా ఉండగా గ్రేటర్ ఎన్నికల్లో తన నియోజకవర్గ పరి ధిలో తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వాలని, లేని పక్షంలో వారిని స్వతంత్రులుగా బరిలోకి దింపుతానని ఇప్పటికే ఆయన పార్టీకి అల్టిమేటం ఇచ్చారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రతిపాదించిన అభ్యర్థులకు సీట్లు ఇస్తారా..? లేక పార్టీ నిర్ణయం మేరకు అభ్యర్థులను ఖరా రు చేస్తారా..? అన్న విషయం తేలడం లేదు. దీంతో ఆయా డివిజన్లలో సీట్లు ఆశిస్తున్న అభ్యర్థులు సైతం అయోమయంలో పడ్డారు. ఒకవేళ పార్టీ ఎమ్మెల్యే ప్రతి పాదనలకు అనుకూలంగా నిర్ణయం తీసుకొంటే దీర్ఘకాలంగా పార్టీలో పనిచేస్తున్న తమ పరిస్థితి ఏంటి..? తమ కు గుర్తింపు ఉంటుందా..?అని స్థానిక కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే... తొందర పడకుండా పార్టీ నిర్ణయం వెలువడేంత వరకు వేచి చూడాలని భావిస్తున్నారు.