ముస్లింలకు బీజేపీ వ్యతిరేకం కాదు
♦ కొన్ని పార్టీలు విష ప్రచారం చేస్తున్నాయి: గడ్కరీ
♦ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపు
♦ రెండింతల నిధులిచ్చి అభివృద్ధి చేస్తామని హామీ
సాక్షి, హైదరాబాద్: ముస్లింలకు బీజేపీ వ్యతి రేకం కాదని, కానీ కొన్నిపార్టీలు విష ప్రచారం చేస్తున్నాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పేవిధంగా బీజేపీ వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించారు. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌కు రెండింతల నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ ప్రాంతంలోని ఏఓసీ రోడ్ల మూసివేత సమస్యను రక్షణ మంత్రితో చర్చించి పరిష్కరిస్తామని గడ్కరీ చెప్పారు. పౌరులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.
సోమవారం హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో బీజేపీ-టీడీపీ సంయుక్తంగా నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. దురదృష్టవశాత్తు కొంత మంది పాకిస్తాన్‌కు వత్తాసు పలుకుతున్నారని, అలాంటివారికి దేశప్రజల బాధ లు గుర్తుకు రావన్నారు. నెహ్రూ నుంచి రాజీవ్‌గాంధీ దాకా దేశాన్ని పాలించినా, పదేళ్ల యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికన్నా.. మోదీ నేతృత్వంలో ఎన్డీయే ఎక్కు వ అభివృద్ధి చేసి చూపిస్తోందని కేంద్రమంత్రి చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలకు కాలం చెల్లిం దని, వారికి చివరకు ఎర్రజెండా మాత్రమే మిగిలిందని ఎద్దేవా చేశారు. గ్రామాల్లో ఉపాధి లేకపోవడం వల్ల పట్టణాలకు వలసలు పెర గడంతో జనాభా విపరీతంగా పెరిగిపోతోం దని, పేదలకు, చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు పెంచేవిధంగా కేంద్రం పథకాలను అమలు చేస్తోందని చెప్పారు. ఇక తెలంగాణ లో రోడ్ల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు గడ్కరీ ప్రకటించారు.
టీఆర్‌ఎస్ మోసం చేస్తోంది
కేంద్రం సహకారంతోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో టీఆర్‌ఎస్ మోసం చేస్తోందని, ప్రతి ఇంటికి కేంద్రం రెండు లక్షలు ఇస్తేగానే నిర్మిం చడం లేదని విమర్శించారు. గ్రేటర్ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ మాయమాటలు చెబుతున్నారని, ప్రజలు వాటిని నమ్మవద్దని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అన్నారు. తండ్రిని ముంచే కొడుకులా కేటీఆర్ తయారయ్యాడన్నారు. హిందువులను ఊచకోత కోస్తామన్న పార్టీతో పొత్తున్న టీఆర్‌ఎస్‌ను గ్రేటర్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు.
హైదరాబాద్‌లో ఘన స్వాగతం
రాష్ట్రానికి వచ్చిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర నేతలు ఘన స్వాగ తం పలికారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు స్వాగతం పలికారు. ఇక రాష్ట్రంలో రహదారుల నిర్మాణానికి రూ.40,800 కోట్లను మంజూరు చేసిన గడ్కరీకి కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలి పారు. రాష్ట్రంలో ఒకరోజు పర్యటించి భారీగా నిధులు మంజూరు చేశారని, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. ప్రధాని మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై అవాస్తవ ఆరోపణలు చేసేవారు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని సూచించారు.