టీఆర్‌ఎస్-ఎంఐఎం పార్టీలు ప్రమాదకరం
మాటల గారడీలను నమ్మొద్దు
కేంద్రం నిధులిస్తేనే డబుల్ బెడ్‌రూం ఇళ్ల పూర్తి
కేంద్ర మంత్రి దత్తాత్రేయ
అంబర్‌పేట : టీఆర్‌ఎస్, ఎంఐ ఎం పార్టీలు హైదరాబాద్ నగరానికి ప్రమాదకరమని గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ది చెప్పాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. టీఆర్‌ఎస్ నాయకులు మాటల గారడీ, పేరడీ కథలతో ప్రజల ను మభ్యపెడుతున్నారని వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆదివా రం గోల్నాక అశోక్ ఫంక్షన్‌హాల్‌లో అంబర్‌పేట నియోజకవర్గ బీజేపీ, టీడీపీ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభు త్వ భాగస్వామ్యం ఉందన్న విషయాన్ని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో డబుల్ బెడ్ రూం పథకానికి కేంద్ర ప్రభుత్వాన్ని రూ. 3వేల కోట్లు నిధులు కోరిందని, కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తేనే పథకం పూర్తవుతుందన్నారు. రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ జెండాలు, కండువాలు మార్చే నాయకులకు గట్టి గుణపాఠం చెప్పాలన్నారు. పేదలకు టీడీపీ, బీజేపీ అండగా ఉంటాయన్నారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయంలోనే హైదరాబాద్ మహానగరంగా అభివృద్ధి చెందిందన్నారు. టీఆర్‌ఎస్ వద్ద అధికారం ఉంటే బీజేపీ, టీడీపీ వద్ద నైతిక విలువలు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ప్రణాళికల అమలుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. హైదరాబాద్‌ను స్మార్ట్ సిటీగా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే టీఆర్‌ఎస్ దానిని కరీంనగర్‌కు తరలించిందన్నారు. తాము నిత్యం ప్రజల్లో ఉంటే టీఆర్‌ఎస్ నాయకులు ఎన్నికల కోసమే గల్లీలోకి వస్తున్నారన్నారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేయకపోతే పింఛన్‌లు, డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు రావనే ప్రచారం జరుగుతుందని వాటిని టీఆర్‌ఎస్ నాయకులు తమ జేబుల్లోనుంచి ఇవ్వడం లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకట్‌రెడ్డి, ఎక్కాల నందు, దిడ్డి రాంబాబు, ఆనంద్‌గౌడ్, సాంబశివగౌడ్, కన్నెరమేష్‌యాదవ్, రాంచందర్, నర్సింగ్‌రావు యాదవ్, అచ్చిని రమేష్, గోవర్ధన్‌రెడ్డి, వనం రమేష్, అడపా చంద్రమౌళి, చిట్టి శ్రీధర్, పెంటం రాజు, రాజుగుప్త తదితరులు పాల్గొన్నారు.