Greco-Roman
-
Zagreb Open 2023 wrestling: అశు ‘కంచు పట్టు’
జాగ్రెబ్ (క్రొయేషియా): యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ఆధ్వర్యంలో నిర్వహించిన జాగ్రెబ్ ఓపెన్ వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ టోర్నమెంట్లో పురుషుల గ్రీకో రోమన్ 67 కేజీల విభాగంలో భారత రెజ్లర్ అశు కాంస్య పతకాన్ని సాధించాడు. కాంస్య పతక పోరులో 23 ఏళ్ల అశు 5–0తో అడోమస్ గ్రిగాలియునస్ (లిథువేనియా)పై నెగ్గాడు. అశుకు 500 స్విస్ ఫ్రాంక్‌లు (రూ. 44 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో అశు 0–9తో రెజా అబ్బాసి (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. అయితే రెజా ఫైనల్ చేరుకోవడంతో... రెజా చేతిలో ఓడిపోయిన వారి మధ్య ‘రెపిచాజ్’ పద్ధతిలో అశుకు కాంస్య పతకం కోసం పోటీ పడే అవకాశం లభించింది. ‘రెపిచాజ్’ తొలి బౌట్లో అశు 8–0తో పోహిలెక్ (హంగేరి)పై... రెండో బౌట్లో 9–0తో హావర్డ్ (నార్వే)పై గెలుపొంది కాంస్య పతక బౌట్‌కు అర్హత సాధించాడు. -
World Wrestling:32 ఏళ్ల తర్వాత...
రోమ్ (ఇటలీ): సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. ప్రపంచ రెజ్లింగ్ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు 32 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో భారత యువ రెజ్లర్ సూరజ్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో సూరజ్ 11–0తో ఫరైమ్ ముస్తఫయెవ్ (అజర్బైజాన్)పై విజయం సాధించాడు. తద్వారా 1990లో పప్పూ యాదవ్ తర్వాత ప్రపంచ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో పసిడి పతకం నెగ్గిన భారత రెజ్లర్‌గా సూరజ్ గుర్తింపు పొందాడు. -
సుశీల్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా మృతి వ్యవహారంపై పోలీసుల విచారణ కీలక మలుపు తీసుకుంది. గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో జాతీయ జూనియర్ మాజీ చాంపియన్ అయిన 23 ఏళ్ల సాగర్ రాణాను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టడంతో అతను చనిపోయాడు. భారత రెజ్లర్లకు అడ్డాలాంటి ఛత్రశాల్ స్టేడియం బయట జరిగిన ఈ ఘటనలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందని వినిపిస్తోంది. అయితే అతను ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఈ నేపథ్యంలో సుశీల్ మామ, సీనియర్ కోచ్ సత్పాల్ సింగ్‌ను పోలీసులు విచారించారు. ‘సుశీల్ మామ సత్పాల్ సింగ్, అతని బావమరిదిలను సుమారు రెండు గంటల పాటు విచారించాం. మంగళవారం స్టేడియం పార్కింగ్ ఏరియా వద్ద జరిగిన గొడవలో సుశీల్, అజయ్, ప్రిన్స్ దలాల్, సోనూ మహల్, సాగర్ అమిత్ భాగంగా ఉన్నారని మా విచారణలో తేలింది. సుశీల్, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నాం’ అని అడిషనల్ డీసీపీ గురిక్బాల్ సింగ్ వెల్లడించారు. మరోవైపు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర సింగ్ రాసిన ఎఫ్ఐఆర్ కాపీలో ‘సుశీల్ పహిల్వాన్, అతని సహచరులు ఈ నేరం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది’ అని రాసి ఉంది. 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సత్పాల్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు కూడా లభించాయి. కెరీర్ తొలినాళ్ల నుంచి సత్పాల్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న సుశీల్ 2010లో సత్పాల్ సింగ్ కూతురు సావీని పెళ్లి చేసుకున్నాడు. -
భారత రెజ్లర్ల తీన్మార్...
న్యూఢిల్లీ: సొంతగడ్డపై భారత రెజ్లర్లు ఆకట్టుకున్నారు. ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు బుధవారం గ్రీకో రోమన్ శైలిలో అశు (67 కేజీలు), ఆదిత్య కుందు (72 కేజీలు), హర్దీప్ (97 కేజీలు) భారత్‌కు మూడు కాంస్య పతకాలను అందించారు. జ్ఞానేందర్ (60 కేజీలు) కాంస్య పతక పోరులో ఓడిపోయాడు. కాంస్యం కోసం జరిగిన బౌట్లలో అశు 8–1తో అబ్దుల్ కరీమ్ మొహమ్మద్ అల్ హసన్ (సిరియా)ను ఓడించగా... ఆదిత్య 8–0తో నవో కుసాకా (జపాన్)పై, హర్దీప్ 3–1తో బెక్సుల్తాన్ (కిర్గిస్తాన్)పై విజయం సాధించారు. జ్ఞానేందర్ 0–6తో బఖ్రమోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓటమి చవిచూశాడు. ఓవరాల్‌గా భారత్‌కు గ్రీకో రోమన్ విభాగంలో ఐదు పతకాలు లభించాయి. నేడు, రేపు మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ఆ తర్వాత శని, ఆదివారాల్లో పురుషుల ఫ్రీస్టయిల్ విభాగంలో పోటీలుంటాయి. -
గ్రీకో-రోమన్ కుస్తీలో భారత్‌కు తొలి పతకం
భారత కుస్తీ వీరుడు సందీప్ తులసీ యాదవ్ చరిత్ర సృష్టించాడు. గ్రీకో రోమన్ విభాగంలో భారత దేశానికి మొట్టమొదటి పతకం అందించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భాగంగా సెర్బియాకు చెందిన మాకిస్మోవిక్ అలెగ్జాండర్‌ను ఓడించి.. కాంస్యపతకం సాధించాడు. ఇన్నాళ్లూ కేవలం ఫ్రీస్టైల్ విభాగంలో మాత్రమే భారత రెజ్లర్లు తమ ప్రతిభ కనబరుస్తూ వచ్చారు. కానీ యాదవ్ ఇప్పుడు చరిత్రను తిరగరాసి, గ్రీకో రోమన్ విభాగంలోనూ తమ సత్తాకు ఎదురులేదని చాటాడు. కాంస్యపతకం కోసం జరిగిన పోరులో సెర్బియన్ ప్రత్యర్థిని 4-0 స్కోరు తేడాతో చిత్తుచేశాడు. ఎలిమినేషన్ రౌండులో సందీప్‌కు బై లభించింది. రెండో రౌండులో అతడు స్పానిష్ రెజ్లర్ నవర్రో సాంచెజ్ ఇసామెల్ను 5-0తోను, మూడో రౌండులో మాల్దీవ్స్‌కు చెందిన అకోస్నిసెను మిహాలీని 6-2 స్కోరుతోను ఓడించాడు. కానీ తర్వాతి రౌండులో మాత్రం కొరియన్ వీరుడు ర్యు హన్ సు చేతిలో 0-10 తేడాతో ఓడిపోయాడు. అయితే.. హన్ సు ఫైనల్లోకి వెళ్లడంతో కాంస్యపతకం రేసులోకి యాదవ్ దూసుకెళ్లాడు. ఈసారి ఏమాత్రం పొరపాటు చేయకుండా అలెగ్జాండర్‌ను 4-0 తేడాతో చిత్తుచేశాడు.