గ్రీన్ఫీల్డ్ నివేదిక ఆలస్యంపై మంత్రి సుజాత సీరియస్
కాకినాడ: గ్రీన్ ఫీల్డ్ ఘటన నివేదిక తయారీలో విద్యాశాఖ ఉన్నతాధికారులు అనుసరిస్తున్న వైఖరీపై ఆంధ్రప్రదేశ్ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన జరిగి అయిదురోజులు అయిన ఇప్పటి వరకు నివేదిక అందజేయకపోవడంపై సదరు ఉన్నతాధికారులపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం అచ్చంపేట జంక్షన్ సమీపంలోని గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఎన్.చినరాజప్పతో కలసి పీతల సుజాత సందర్శించారు. ఈ ఘటన జరిగి వారం రోజులు కావస్తున్న ఎందుకు నివేదికను తయారు చేయలేదని ఈ సందర్బంగా సుజాత ఉన్నతాధికారులను ప్రశ్నించారు. నివేదికను వెంటనే అందజేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఈ నెల 18న గ్రీన్ఫీల్డ్ అంధుల పాఠశాలలో అల్లరి చేస్తున్న ముగ్గురు విద్యార్థులపై ఆ పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్లు తీవ్రంగా కొట్టారు. ఆ ఘటను సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించి మీడియాకు అందజేశారు. దాంతో ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఆ ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని మంత్రి సుజాత విద్యాశాఖ ఉన్నతాధికరులను ఆదేశించింది. అయితే ఆ ఘటన జరిగి అయిదు రోజులు జరిగిన ఇప్పటి వరకు నివేదిక అందజేయకపోవడంతో సదరు అధికారులపై మంత్రి పీతల సుజాత నిప్పులు చెరిగారు.