Greenco firm
-
ఫలిస్తున్న వైఎస్ జగన్ కృషి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కోసం గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కృషి ఫలిస్తోంది. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో భాగంగా చేసుకున్న ఒప్పందాలు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లాలో ఏఎం గ్రీన్ (గ్రీన్కో గ్రూప్ సంస్థ) రూ.12,500 కోట్ల పెట్టుబడులపై తుది నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదికి మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి సామర్థ్యంతో ప్లాంట్ కార్యకలాపాలు 2026లో ప్రారంభం కానున్నాయి.ఇందుకోసం 1,300 మెగావాట్ల కార్బన్ రహిత విద్యుత్, 4,500 మెగావాట్ల సోలార్, 950 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్ట్, ఇతర వనరులను కంపెనీ సమకూర్చుకుంది. అదేవిధంగా ఇక్కడ ఉత్పత్తి అయ్యే అమ్మోనియాను యూరప్‌కు ఎగుమతి చేయనున్నారు. ఇందుకోసం యారా క్లీన్, కెప్పెల్, యూనిపర్ వంటి ప్రధాన సంస్థలతో ఏఎం గ్రీన్ సంస్థ ఒప్పందాలు సైతం ఇప్పటికే కుదుర్చుకుంది. మరోవైపు ఏడాదికి 5 మెట్రిక్ టన్నుల గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి లక్ష్యాన్ని 2030 నాటికి ఛేదించేలా దేశవ్యాప్తంగా ఉత్పత్తి కార్యకలాపాలను విస్తరించేందుకు గ్రీన్కో సంస్థ ఏర్పాట్లు చేసుకుంటోంది. -
బిట్స్ పిలానీ విల్ప్తో గ్రీన్కో ఒప్పందం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎనర్జీ స్టోరేజి సంస్థ గ్రీన్కో తాజాగా బిట్స్ పిలానీలో భాగమైన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ (విల్ప్) విభాగంతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం బిట్స్ పిలానీ అందించే వివిధ డిగ్రీ/సరి్టఫికేషన్ ప్రోగ్రామ్‌లలో గ్రీన్కో గ్రూప్ సిబ్బంది చేరవచ్చు. ఇంజినీరింగ్, టెక్నికల్, ఫంక్షనల్, మేనేజ్మెంట్ మొదలైనవి వీటిలో ఉంటాయి. ఎంప్లాయీ ప్రొఫెషనల్ అడ్వాన్స్మెంట్ విధానంలో భాగంగా తమ ఉద్యోగులను గ్రీన్కో స్పాన్సర్ చేస్తుంది. అత్యున్నత ప్రమాణాలతో విద్యను అందించే బిట్స్ పిలానీతో భాగస్వామ్యం .. తమ సిబ్బంది నైపుణ్యాలు మరింతగా మెరుగుపడేందుకు తోడ్పడగలదని గ్రీన్కో వ్యవస్థాపకుడు మహేష్ కొల్లి తెలిపారు. గ్రీన్కో సిబ్బందికి ఉపయుక్తమైన విద్యా కార్యక్రమాలను రూపొందించడంపై దృష్టి పెడుతున్నట్లు బిట్స్ పిలానీ ఆఫ్–క్యాంపస్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ జి. సుందర్ తెలిపారు. -
గ్రీన్కో రూ. 5,700 కోట్ల నిధుల సమీకరణ
న్యూఢిల్లీ: పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ గ్రీన్కో రూ.5,700 కోట్ల నిధులను సమీకరించింది. సింగపూర్‌కు చెందిన జీఐసీ, జపాన్ కంపెనీ ఓరిక్స్ కార్పొరేషన్, అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీతోపాటు (ఏడీఐఏ) సంస్థ వ్యవస్థాపకులు అనిల్ చలమలశెట్టి, మహేశ్ కొల్లి ఈ మొత్తాన్ని సమకూర్చినట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఈ ఈక్విటీ నిధులను 25 గిగావాట్ అవర్ కంటే అధిక నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉండే పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లకు ఉపయోగిస్తామని గ్రీన్కో గ్రూప్ జేఎండీ మహేశ్ కొల్లి వెల్లడించారు. తాజాగా అందుకున్న పెట్టుబడిలో జీఐసీ 51 శాతం, ఓరిక్స్ 16, ఏడీఐఏ 14, వ్యవస్థాపకులు 13 శాతం సమకూర్చినట్టు తెలిపారు. పునరుత్పాదక ఇంధన వనరుల రంగంలో ప్రముఖ సంస్థల్లో ఒకటైన గ్రీన్కో గ్రూప్ ఖాతాలో భారత్‌లో 15 రాష్ట్రాల్లో 7.5 గిగావాట్ల సామర్థ్యం గల సౌర, పవన, జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. -
తెలంగాణలో పవన విద్యుదుత్పత్తి
ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చిన గ్రీన్కో సంస్థ అవకాశాలను అధ్యయనం చేయాలని సీఎం ఆదేశం రూ. 6 వేల కోట్ల పెట్టుబడులకు సిద్ధమని ‘గ్రీన్కో’ సంస్థ వెల్లడి 2018 నాటికి 800 మెగావాట్ల పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టు స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: విద్యుత్ సమస్య నుంచి గట్టెక్కేందుకు భారీగా థర్మల్ విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని లక్ష్యంగా ఎంచుకున్న తెలంగాణ ప్రభుత్వం... సౌర, పవన విద్యుదుత్పత్తిపైనా దృష్టి సారించింది. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి ప్రతిపాదనలకు కూడా ఆహ్వానించింది. దీంతో తెలంగాణలో 800 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి చేస్తామని విద్యుత్ ఉత్పత్తి రంగంలో అనుభవమున్న ‘గ్రీన్కో’ సంస్థ ముందుకు వచ్చింది. ఇందుకోసం తాము రూ. 6 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని.. 2018 నాటికి ఈ ప్రాజెక్టు ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తామని వెల్లడించింది. దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని పేర్కొంటూ సంబంధిత ప్రతిపాదనలను బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు ‘గ్రీన్కో’ సంస్థ అందించింది. దీనిపై స్పందించిన సీఎం.. రాష్ట్రంలో పవన విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదఢఢేశించారు. ఇప్పటికే సౌర విద్యుత్‌కు ఒక దఫా టెండర్లు పిలిచామని, అవసరమైతే మరోసారి టెండర్లు పిలవాలని సూచించారు. రాష్ట్రంలో దాదాపు రెండు వేల మెగావాట్ల వరకు వ్యవసాయ విద్యుత్ డిమాండ్ ఉందని.. పగటి పూట విద్యుత్ అందించే సోలార్ వ్యవస్థను వ్యవసాయ పంపుసెట్లకు అనుసంధానం చేస్తే ఉభయ తారకంగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు. పవన విద్యుత్ ప్లాంట్లను కూడా ఎక్కువ ప్రాంతాల్లో స్థాపిస్తే ఉపయోగం ఉంటుందని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ విద్యుత్ అవసరాలు ఉన్న చోట పవన విద్యుత్ ప్రత్యామ్నాయంగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో కొన్ని ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రయోగాత్మకంగా పవన విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించాలని, ఇప్పటికే అనుభవం ఉన్న సంస్థలతో ఈ పని చేయించాలని ముఖ్యమంత్రి చెప్పారు. రాజధానిలో నిరంతరం విద్యుత్ హైదరాబాద్‌లో విద్యుత్ కోతలు లేకుండా ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. న్యూయార్క్, ముంబై వం టి నగరాల్లో 24 గంటలు విద్యుత్ ఇస్తున్నట్లే హైదరాబాద్‌పైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంద ని... పరిశ్రమలు, ఐటీ సంస్థలు, వ్యాపార, వాణి జ్య సంస్థలు 24 గంటలు పని చేసినా విద్యుత్ కోతలు లేకుండా చూడాలని పేర్కొన్నారు.