భూసేకరణకు సిద్ధం కండి
- అలైన్‌మెంటు ప్రకారం సర్వే పనులు పూర్తి చేయండి
- అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవేపై కలెక్టర్ ఆదేశం
కర్నూలు(అగ్రికల్చర్): అనంతపురం నుంచి అమరావతికి గ్రీన్‌పీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణానికి అలైన్‌మెంటు ప్రతిపాదనలు పరిశీలించి సర్వే పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహంచిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నూలు డివిజన్లో అలైన్‌మెంటును పరిశీలించి సర్వే పనులు మొదలు పెట్టాలన్నారు. నంద్యాల డివిజన్లో ఈ ప్రక్రియ పూర్తయినందునా కర్నూలు డివిజన్‌పై దృష్టి సారించాలన్నారు. సర్వే పనుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం పూర్తయితే త్వరలోనే భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తామని వివరించారు. 18వ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి పాణ్యం మండల పరిధిలో ఉన్న అడ్డంకులను తొలగించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాల్వ హుసేనాపురంలో ఆంజనేయ స్వామి, వేణుగోపాలస్వామి దేవాలయాలు, మాస్క్ ప్రదేశాల్లో సంబందిత పెద్దలతో సంప్రదించి రహదారి నిర్మాణానికి భూములు సేకరించాలన్నారు. పులికనుమ ప్రాజెక్టు పనులకు రైతులు సహకరించకపోతే విధిగా అవార్డు పాస్ చేయాలన్నారు. ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ- ప్రయివేటు అనుసంధాన భూములు, అటవీ- దేవాదాయ- వక్ప్ భూములు అనే నాలుగు కేటగిరీలుగా విభజించి నివేదికలు అందించాలన్నారు. పశుగ్రాస క్షేత్రాల ఏర్పాటుకు భూములు గుర్తించాలన్నారు. సమావేశంలో జేసీ ప్రసన్న వెంకటేష్, డీఆర్ఓ గంగాధర్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.