స్వచ్ఛ ప్రపంచం కోసం ఏటా కావాలో...రూ.2.24 కోట్ల కోట్లు!
కర్బన, గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు. ప్రస్తుతం ప్రపంచ మానవాళికి పెను ప్రమాదంగా పరిణమించిన పెను సమస్యలు. పర్యావరణం పట్ల మనిషి బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. వాటిని ఎలాగైనా తగ్గించాలన్న ప్రతినలు, లక్ష్యాలు కాగితాలకే పరిమితమ వుతున్నాయి. భావితరాల భద్రత పట్ల మన జవాబుదారీతనాన్ని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ప్రస్తుత లెక్కల్లో 2050 నాటికి ఉద్గారాలను పూర్తిగా (నెట్ జీరో స్థాయికి) తగ్గించాలంటే ప్రపంచ స్థాయిలో ఇప్పటి నుంచీ ఏటా కనీసం 2.24 కోట్ల కోట్ల రూపాయలు (2.7 లక్షల కోట్ల డాలర్లు) వెచి్చంచాల్సి ఉంటుందట!
అలాగైతేనే ఈ శతాబ్దాంతానికల్లా అంతర్జాతీయ సగటు ఉష్ణోగ్రతలు కూడా 1.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పరిమితిని దాటకుండా ఉంటాయట. కానీ ఉద్గారాలకు ప్రధాన కారణంగా ఉన్న చాలా దేశాలు తామే స్వయంగా నిర్దేశించుకున్న 2030 లక్ష్యాల సాధనకే అల్లంత దూరంలో ఉన్నాయనీ తాజా నివేదిక ఒకటి వాపోతోంది! ఈ పరిస్థితుల్లో వాటి నుంచి 2050 లక్ష్యాల పట్ల చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణను ఆశించడం అత్యాశేనని పర్యావరణవేత్త లు అంటున్నారు. మరోవైపు సముద్రాలకు ముప్పు కూడా నానాటికీ మరింతగా పెరిగిపోతోందని గ్రీన్ పీస్ నివేదిక హెచ్చరిస్తోంది. చేపల వేట విచ్చలవిడిగా సాగుతోందని, గత నాలుగేళ్లలో 8.5 శాతం దాకా పెరిగిందని అది పేర్కొంది!
లక్ష్యాలు ఘనమే కానీ...
► కర్బన ఉద్గారాల కట్టడికి ప్రస్తుతం అన్ని దేశాలూ కలిపి ఏటా 1.9 లక్షల కోట్ల డాలర్లు వెచి్చంచాలన్నది లక్ష్యం. కానీ ఇదీ ఒక్క ఏడాది కూడా జరగడం లేదు.
► పలు కీలక సంపన్న దేశాలు ఈ విషయంలో చేస్తున్న గొప్ప ప్రకటనలు మాటలకే పరిమితమవుతున్నాయి.
► అవి పాటిస్తున్న ఈ ద్వంద్వ ప్రమాణాలు పరిస్థితిని మరింత జటిలం చేస్తున్నాయి.
► అవిలాగే దాటవేత ధోరణి కొనసాగిస్తే ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 2050 కల్లా ఏకంగా 2.5 డిగ్రీలు పెరగడం, మానవాళి మనుగడ పెను ప్రమాదంలో పడటం ఖాయమని స్వయంగా ఐక్యరాజ్యసమితే తాజాగా హెచ్చరించింది.
సముద్రాలకు ’మహా’ ముప్పు
మహా సముద్రాలలో విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటపై అంతర్జాతీయ పర్యావరణ సంస్థ గ్రీన్ పీస్ తాజా నివేదిక తీవ్ర ఆందోళన వెలిబుచి్చంది...
► 2018తో పోలిస్తే 2022 నాటికి సముద్రాల్లో చేపల వేట 8.5 శాతం పెరిగింది. ప్రత్యేక రక్షిత ప్రాంతాలైన సున్నిత సముద్ర జలాల్లోనైతే ఏకంగా 23.5 శాతం పెరిగింది.
► నిర్దిష్ట అంతర్జాతీయ సముద్ర జలా లను చేపల వేటను నిషేధించాలన్న ప్రతిపాదనలు ఏళ్ల తరబడి గ్రీన్ పీస్ చేసిన కృషి ఫలించి ఎట్టకేలకు గత మార్చిలో ఒప్పందంగా రూపుదాల్చాయి. జూన్లో ఐరాస కూడా దానికి ఆమోదముద్ర వేసింది.
► కానీ ఏ దేశమూ ఈ ఒప్పందాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్న దాఖలాలు కనిపించడం లేదని నివేదిక వాపోతోంది.
► విచ్చలవిడిగా వేట దెబ్బకు అరుదైన సముద్ర జీవరాశులు దాదాపుగా అంతరించిపోతున్నాయి.
► ఉదాహరణకు పసిఫిక్ బ్లూఫిన్ ట్యూనా చేప జాతి గత మూడు దశాబ్దాల్లోనే ఏకంగా 90 శాతానికి పైగా క్షీణించిపోయింది.
► ’30 బై 30’ లక్ష్య సాధనకు దేశాలన్నీ ఇప్పటికైనా నడుం బిగిస్తే మేలని గ్రీన్ పీస్ నివేదిక పేర్కొంది.
► ప్రపంచంలోని భూ, జలవనరులను 2030 కల్లా కనీసం 30 శాతమన్నా సంపూర్ణంగా సురక్షితంగా తీర్చిదిద్ద డమే ‘30 బై 30’ లక్ష్యం.
నెట్ జీరో అంటే..
► కర్బన ఉద్గారాలను దాదాపుగా సున్నా స్థాయికి తగ్గించడం.
► కాస్తో కూస్తో మిగిలే ఉద్గారాలను మహా సముద్రాలు, అడవుల వంటి ప్రాకృతిక వనరులు శోషించుకుంటాయన్నది సిద్ధాంతం.
► ఇందుకు ఉద్దేశించిన నిధుల్లో మూడొంతులు కీలకమైన ఇంధన, మౌలిక రంగాలపై వెచి్చంచాలన్నది లక్ష్యం. మిగతా లక్ష్యాలు ఏమిటంటే...
► రవాణా రంగాన్ని వీలైనంతగా విద్యుదీకరించడం.
► గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి.
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ‘1.5 డిగ్రీ ఉష్ణోగ్రత లక్ష్య సాధన అత్యంత పెను సవాలేనని చెప్పాలి. ఈ దశాబ్దంలో మిగిలి ఉన్న ఆరేళ్లలో ఆ దిశగా ఎంత చిత్తశుద్ధితో ప్రయతి్నస్తామన్న దానిపైనే ప్రపంచ భవిష్యత్తు చాలావరకు ఆధారపడి ఉంటుంది‘
– సైమన్ ఫ్లవర్స్
సీఈఓ, చీఫ్ స్ట్రాటజిస్ట్, వుడ్ మెకంజీ సంస్థ
‘లక్ష్యాల మాట ఎలా ఉన్నా చమురు, సహజ వాయువు పాత్ర అంతర్జాతీయ స్థాయి లో కనీసం మరి కొన్నేళ్ల పాటు కీలకంగానే ఉండనుంది‘
– ప్రకాశ్ శర్మ
వైస్ ప్రెసిడెంట్, వుడ్ మెకంజీ
– సాక్షి, నేషనల్ డెస్క్