అవును.. జట్టును ఛాపెల్ నాశనం చేశాడు: భజ్జీ
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కదిపిన తేనెతుట్టె గట్టిగానే అంటుకుంది. కోచ్ గ్రెగ్ ఛాపెల్ గురించి మరో సీనియర్ ఆటగాడు హర్భజన్ సింగ్ కూడా మండిపడ్డాడు. ఛాపెల్ భారత జట్టును సర్వనాశనం చేశాడని, అది తిరిగి కోలుకోడానికి మూడేళ్ల సమయం పట్టిందని అన్నాడు. ఇందులో మరీ దారుణం ఏమిటంటే, కొంతమంది జట్టు సభ్యులే కోచ్ వద్దకు వెళ్లి తప్పుడు సమాచారం చెప్పేవాళ్లని, దాంతో సమస్య మరింత ఎక్కువయ్యేదని చెప్పాడు. సరైన సమయం వచ్చినప్పుడు పేర్లన్నీ బయటపడతాయని అన్నాడు. కొంతమంది గుడ్డిగా ఛాపెల్ చెప్పిన మాట వినేవాళ్లని, దానివల్ల తాము బాగా ఎదిగిపోతామని భావించారని తెలిపాడు. కానీ అలా చేయడంతో భారత క్రికెట్ ఎంత పతనం అవుతుందన్న విషయం ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన చెందాడు.
హర్భజన్ మరో విభ్రాంతికర విషయం కూడా బయటపెట్టాడు. జింబాబ్వేతో టెస్టు మ్యాచ్ జరుగుతుండగా.. నాటి కెప్టెన్ సౌరభ్ గంగూలీ గురించి బీసీసీఐకి ఓ ఈమెయిల్ కూడా రాశాడని తెలిపాడు. గంగూలీ అప్పుడు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేశాడని, అలాంటి సమయంలో డ్రసింగ్ రూంలో కూర్చుని మరీ ఈమెయిల్ పెట్టాడని చెప్పాడు. అసలు మ్యాచ్ ఎలా జరుగుతోందో కూడా పట్టించుకోలేదని, తాను కూడా ఆ సమయంలో అతడి పక్కనే కూర్చోవడం వల్లే అనుమానం వచ్చిందని భజ్జీ తెలిపాడు. అతడు బాత్రూంకు వెళ్లినప్పుడు ల్యాప్టాప్ తెరిచి చూస్తే, అందులో ఈమెయిల్ ఉందన్నాడు. గంగూలీ వచ్చిన తర్వాత అతడికి చెబితే అతడు కూడా అంతే షాకయ్యాడన్నాడు.