పెరుగుతున్న అప్పులపై ఆందోళన వద్దు, కేంద్రంపై ప్రశంసలు
ముంబై: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటుకు సంబంధించి ధైర్యం ప్రదర్శించాల్సిన సమయం ఇదని ప్రముఖ బ్యాంకర్ కేవీ కామత్ పేర్కొన్నారు. వృద్ధికి అవసరం అనుకుంటే, బడ్జెట్లో నిర్దేశించుకున్న దానికన్నా ఎక్కువగా ద్రవ్యలోటు లక్ష్యాలను మరింత పెంచాలని ఆయన సూచించారు. భారత్కోసం 25 సంవత్సరాల వృద్ధి రన్‌వే అవకాశం ఎదురుచూస్తోందని కూడా కామత్ పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోడానికి 8 శాతంలోపు వడ్డీరేట్లు, అపారమైన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) అవసరం అని సూచించారు. ద్రవ్యలోటుపై ప్రముఖ బ్యాంకర్‌గా కామత్ తాజా ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో కామత్ చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే..
ద్రవ్యలోటు విషయంలో ఇప్పటికే కేంద్రం ధైర్యాన్ని ప్రదర్శించింది. దేశం నిరంతరాయంగా వృద్ధి బాటలో పయనిస్తుందని భావిస్తే, ద్రవ్యలోటు లక్ష్యాలను పెంచడానికి సిద్ధమని ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ప్రసంగం సూచిస్తోంది. ద్రవ్యలోటు భారీగా పెరిగిపోతోందని ఆందోళన అక్కర్లేదన్నది నా భావన. ఎందుకంటే ప్రాజెక్టులకు నిధుల సమీకరణకు వివిధ వినూత్న ఫైనాన్షింగ్ అవకాశాలు ఉన్నాయి. నగదు ముద్రణ ఇందులో ఒకటి. ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) వ్యవస్థలో తగిన స్థాయిలో ఉండడానికి ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. వడ్డీరేట్లు దిగువ స్థాయిలోనే కొనసాగుతాయని విశ్వసిస్తున్నాను
మౌలిక రంగం పటిష్టతలో ఉన్న క్లిష్టతలను జాగ్రత్తగా ఎదుర్కొనాలి. వినూత్న, ఆధునిక ఫైనాన్షింగ్ విధానాలను ప్రభుత్వం ఇందుకు అనుసరించాల్సి ఉంటుంది.ఈ సమయంలో పన్ను రహిత మౌలిక సదుపాయాల బాండ్లను ప్రవేశపెట్టవలసిన అవసరం లేదు. అవసరమైతే ప్రభుత్వం మాత్రమే ఇటువంటివి జారీ చేయాలి. థర్డ్ పార్టీలను అనుమతించాల్సిన అవసరం లేదు. తయారీ విషయంలో భారత్ కంపెనీలకు గతం తరహాలో ఇప్పుడు పెద్దగా ఇబ్బంలు లేవు. తగిన నిధుల అందుబాటు ఇందుకు కారణం.కొత్త తరం కంపెనీలకు ప్రస్తుతం లభించిన ఒక పెద్ద అవకాశం ‘డిజిటల్ సూపర్‌సైకిల్’. తద్వారా ఉపాధి అవకాశాలను కొత్త తరం కంపెనీలు సృష్టించవచ్చు. ఆర్థిక వ్యవస్థ పురోగతికి దోహదపడవచ్చు. భారత్‌కు సువిశాల తీరప్రాంతం ఉంది. దీనిని దేశం సద్వినియోగ పరచుకోవాలి. తీరప్రాంత ఆర్థిక మండళ్ల ఏర్పాటుపై కేంద్రం దృష్టి సారించాలి. అలాంటి మండళ్లను స్వయంగా ప్రారంభించాలి.
2019–20లో ద్రవ్యలోటు 4.6 శాతం (స్థూల దేశీయోత్పత్తి–జీడీపీతో పోల్చి). అప్పటికే ఇది ఏడేళ్ల గరిష్టం. 2020–21లో ద్రవ్యలోటును 3.5 శాతానికి (రూ.7.96 లక్షల కోట్లు) కట్టడి చేయాలన్న కేంద్రం లక్ష్యాలన్ని కరోనా మహమ్మారి దెబ్బతీసింది. ఇది ఏకంగా 9.3 శాతానికి ఎగసింది. విలువలో ఇది రూ.18,21,461 కోట్లు. 2022 మార్చితో ము గిసే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6.8 శాతానికి కట్టడి చేయాలని 2021 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేర్కొంది. అయితే కరోనా సెకండ్‌వేవ్ సవాళ్ల వల్ల ఈ లక్ష్యం 8 శాతం దాటిపోతుందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తీసుకురావడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం లో పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) తొలి నెల– ఏప్రిల్ ద్రవ్యలోటు బడ్జెట్ అంచనాల్లో 5.2 శాతానికి చేరింది. విలువలో రూ.78,699 కోట్లు. 2021–22లో 6.8 శాతం లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. విలువలో రూ.15,06,812 కోట్లు.
15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసులు
15వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం– 2021–22 నాటికి ద్రవ్యలోటు 6 శాతానికి తగ్గాలి. 2022–23 నాటికి 5.5 శాతానికి దిగిరావాల్సి ఉంటుంది. 2023–24 నాటికి 5 శాతానికి, 2024–25 నాటికి 4.5 శాతానికి, 2025–26 నాటికి 4 శాతానికి తగ్గించాల్సి ఉంటుంది.