ఇక మోడీ గులాల్
సాక్షి, న్యూఢిల్లీ: ‘నమోచాయ్’తో ఇప్పటికే ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోన్న బీజేపీ హోలీ రంగులను కూడా తన ఎన్నికల ప్రచారం కోసం ఉపయోగించుకోవాలని అనుకుంటోంది. హోలీని పురస్కరించుకుని తమ ఓటర్లను మోడీ గులాల్ రంగులలో ముంచెత్తాలని నగరంలోని కొందరు బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇందుకోసం హరిద్వార్ నుంచి మూడు రంగుల గులాల్ను తెప్పిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో లభించే ఈ గులాల్ ప్యాకెట్లను ఓటర్లకు ఉచితంగా పంచిపెడతామని వారు చెబుతున్నారు. నరేంద్ర మోడీ ఫొటో, కమలం గుర్తుతోపాటు ‘హ్యాపీ హోలీ’ అని కూడా గులాల్ ప్యాకెట్లపై రాసి ఉంటుంది. హోలీని పురస్కరించుకుని ఓటర్లకు సందేశాన్ని అందించడానికి గులాల్ ప్యాకెట్‌పై ‘దేశ్ జుడేగా హోలీ మిలన్సే’, ‘డేశ్ బడేగా మోడీ మిలన్సే’ అనే నినాదం కూడా ముద్రించి ఉంటుంది. గులాల్ ప్యాకెట్‌పై తమ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీపాటు హర్షవర్ధన్ ఫోటో, తమ పోటో ఉండేలా బీజేపీ స్థానిక నాయకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. బీజేపీ ఉపాధ్యక్షుడు ఆశిష్ సూద్ శుక్రవారమే 50 వేల గులాల్ప్యాకెట్లను పంచారు. సూద్ జనక్‌పురి మున్సిపల్ కౌన్సిలర్‌గా ఉన్నారు. ఆయన పశ్చిమఢిల్లీ లోక్‌సభ సీటు టికెట్ ఆశిస్తున్నారు. మోడీని ప్రజలకు మరింత దగ్గరగా తేవడం కోసం తాను కూడా తన నియోజకవర్గంలో దినపత్రికతోపాటు మోడీ గులాల్ ప్యాకెట్ అందిస్తానని రాజీందర్‌నగర్ ఎమ్మెల్యే ఆర్పీ సింగ్ చెప్పారు.